ఫోన్ ట్యాపింగ్ పై సజ్జనార్ నేతృత్వంలో మరో సిట్

ఫోన్ ట్యాపింగ్ పై సజ్జనార్ నేతృత్వంలో మరో సిట్
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ కొనసాగిస్తున్నప్పటికీ, కేసు చుట్టూ పెరుగుతున్న ఆరోపణలు, రాజకీయ వాదనలు, భిన్న కోణాలు నేపథ్యంలో ప్రభుత్వం మరో ప్రత్యేక దర్యాప్తు వ్యవస్థను ముందుకు తెచ్చింది. హైదరాబాదు పోలీస్ కమిషనర్ సజ్జనార్‌ను కొత్త విచారణ బృందానికి నేతృత్వంగా నియమిస్తూ, డీజీపీ శివధర్ రెడ్డి గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. 
 
ఇప్పటి వరకు పశ్చిమ మండల డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఐవోగా సిట్‌ బృందం దర్యాప్తు చేస్తూ వస్తోంది. ఇప్పటివరకు నలుగురు పోలీస్ అధికారులను అరెస్ట్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రధాన నిందితుడు ప్రభాకర్‌ రావు కస్టోడియల్ విచారణ చేశారు దర్యాప్తు వేగాన్ని పెంచడం, కేసులో బయటపడుతున్న అంశాలను పలు కోణాల్లో సమగ్రంగా పరిశీలించడానికి సీనియర్ అధికారులతో కూడిన ప్రత్యేక బృందాన్ని తీసుకొచ్చారు. 
 
ఈ బృందంలో రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, సిద్దిపేట సీపీ ఎస్‌.ఎం. విజయ్‌కుమార్, మాదాపూర్ డీసీపీ రితిరాజ్, మహేశ్వరం డీసీపీ కె. నారాయణరెడ్డి, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ ఎం. రవీందర్ రెడ్డి, రాజేంద్రనగర్ ఏడీసీపీ కేఎస్‌ రావు, జూబ్లీహిల్స్ ఏసీపీ పి. వెంకటగిరి (దర్యాప్తు అధికారి), నాగేందర్‌రావు (హెచ్‌ఎంఆర్‌ఎల్‌), సీహెచ్ శ్రీధర్ (టీజీ న్యాబ్‌)ను నియమించారు. 
 
వీరికి కేసు వివిధ భాగాలతో సంబంధం ఉన్న అంశాలపై ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. ఈ కొత్త ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటుతో, దర్యాప్తు దిశ మరింత స్పష్టంగా మారనుందని భావిస్తున్నారు. ప్రభుత్వం స్పష్టంగా ఒక డెడ్‌లైన్ కూడా విధించింది.  కేసు దర్యాప్తు ఒక నెలలో పూర్తి చేయాలి. ఈ వ్యవధిలో ఫోన్ ట్యాపింగ్ ఆదేశాలు ఎవరివి, యంత్రాంగం ఎలా పనిచేసింది, ఆ ఆదేశాలు అమలకు ఎవరు ముందు వరుసలో ఉన్నారు, రాజకీయ ఆరోపణలకు తగిన ఆధారాలున్నాయా అనే అంశాలను స్పష్టంగా తేల్చాల్సి ఉంటుంది.

ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాలు అస్థిరతను ఎదుర్కొంటున్నాయి. ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తుండగా, అధికార పక్షం వాటిని తిరస్కరిస్తోంది. ఈ పరిస్థితుల్లో విచారణను నిష్పక్షపాతంగా, వేగవంతంగా, ఆధారాలతో ముగించేందుకు ప్రభుత్వ యంత్రాంగం కట్టుదిట్టమైన విధానాన్ని అవలంభించింది. ఈ దర్యాప్తు ఫలితాలు రాష్ట్ర రాజకీయాలపై స్పష్టమైన ప్రభావం చూపే అవకాశముండటంతో, అందరి చూపు ఇప్పుడు సజ్జనార్ బృందం పనితీరుపై నిలిచింది.

 
ఇటీవల ట్యాపింగ్ కేసులో భాగంగా సిట్​ ఎదుట లొంగిపోయిన మాజీ ఐపీఎస్​ అధికారి ప్రభాకర్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించింది. ఆయనను పలు అంశాలపై అధికారులు ప్రశ్నించారు. విచారణలో భాగంగా క్లౌడ్ పాస్ వర్డ్ లను ఎంటర్ చేసి ప్రభాకర్ రావు ఇచ్చారు. అందులోని కీలక ఆధారాలతో విచారిస్తున్నారు. ఈ నెల 13 నుంచి ప్రభాకర్‌రావును తమ కస్టడీలో ఉంచి విచారించిన సిట్, ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ నివేదికను సమర్పించనుంది. సిట్ తమ నివేదికలో ఏ వివరాలు పొందుపరిచిందనే అంశం, ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది.