ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టివేసిన స్పీకర్‌

ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టివేసిన స్పీకర్‌

ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక తీర్పు వెలువరిస్తూ ఐదుగురు ఎమ్మెల్య అనర్హత పిటిషన్లను కొట్టేశారు. అనర్హత వేటుకు తగిన ఆధారాలు లేవని స్పీకర్‌ తెలిపారు. ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారాలు చూపలేకపోయారని పేర్కొన్నారు. వారంతా సాంకేతికంగా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నట్లు స్పష్టం చేస్తూ అరికెపూడి గాంధీ, మహిపాల్‌రెడ్డి, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్‌గౌడ్ అనర్హత పిటిషన్లను కొట్టేశారు.

మొత్తం పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలు చేశారు. ఇందులో ఎనిమిది మందికి సంబంధించి విచారణ పూర్తి చేశారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్పై దాఖలైన పిటిషన్లకు సంబంధించిన విచారణ ఇంకా పూర్తి కాలేదు.  అనర్హత పిటిషన్లపై స్పీకర్‌ త్వరగా నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఈ నెల 19న మరోమారు విచారణ జరగనుంది.

8 మందికి సంబంధించి విచారణ పూర్తి చేసిన గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం ఐదుగురికి సంబంధించి తీర్పు ఇచ్చారు. కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సంజయ్‌ కుమార్‌కు సంబంధించి గురువారం తీర్పు ఇవ్వనున్నారు. ఈ పది మందిపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ నాయకులు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై స్పీకర్‌ సకాలంలో స్పందించి చర్యలు తీసుకోలేదని బీఆర్‌ఎస్‌ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు.

బీఆర్‌ఎస్‌ నాయకులు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలపై విచారణ చేపట్టాలని హైకోర్టు స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌కు సూచించింది. ఈ ఉత్తర్వులతో సంతృప్తి చెందని బీఆర్‌ఎస్‌ నాయకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీ సాక్షిగా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ నిలువునా ఖూనీ చేసిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రంగావిమర్శించారు. దేశ అత్యున్నత న్యాయస్థానాలపైనే కాదు.. చివరికి రాజ్యాంగంపై కూడా రాహుల్ గాంధీకి ఏమాత్రం గౌరవం లేదని మరోసారి తేలిపోయిందని విమర్శించారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ ఇచ్చిన తీర్పును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎమ్యెల్యే కేపీ వివేకానంద ధ్వజమెత్తారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలు బాహాటంగానే కాంగ్రెస్‌లో ఉన్నారని తెలిపారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కోసం పనిచేశారని చెప్పారు. కాంగ్రెస్‌ ఫ్లెక్సీలు, పోస్టర్లలో ఫిరాయించిన ఎమ్మెల్యేల ఫొటోలు ఉన్నాయని తెలిపారు. స్పీకర్‌ తీర్పుపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

కాగా, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఈరోజు స్పీకర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ హత్య, ప్రజాస్వామ్య హత్య అని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు ధ్వజమెత్తారు.  పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఎమ్మెల్యేలపై తెలంగాణ శాసనసభ స్పీకర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగానికి పూర్తిగా విరుద్ధంగా ఉందని విమర్శించారు.

రాజ్యాంగాన్ని కాపాడుతామని పదే పదే చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ, ఈరోజు రాజ్యాంగ వ్యవస్థ అయిన స్పీకర్‌ను కూడా ప్రభావితం చేసి, రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకోకుండా చేసిందని ఆయన మండిపడ్డారు.  పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీయే. అలాంటి పార్టీనే ఈరోజు ఆ చట్టానికీ, రాజ్యాంగానికీ గౌరవం ఇవ్వకుండా వ్యవహరిస్తోందని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.