భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రైవేటు పేపర్ల వ్యవహారంపై కేంద్ర సాంస్కృతిక శాఖ బుధవారం కీలక వివరణ విడుదల చేసింది. న్యూఢిల్లీలోని ప్రధానమంత్రుల మ్యూజియం అండ్ లైబ్రరీ (పీఎంఎంఎల్)లోని నెహ్రూ ప్రైవేటు పేపర్లు ‘గల్లంతు’ అయ్యాయనే పదాన్ని వాడటం సరికాదని సాంస్కృతిక శాఖ పేర్కొంది. ఎందుకంటే ఆ పేపర్లు ఎక్కడున్నాయి అనేది తెలుసని, అవి కాంగ్రెస్ మాజీ అధినేత సోనియాగాంధీ దగ్గరే ఉన్నాయని తెలిపింది.
నెహ్రూకు సంబంధించిన పేపర్లను తిరిగి మ్యూజియానికి ఇచ్చేయమని ఇప్పటికే ఆమెను కోరామని వెల్లడించింది. దేశ తొలి ప్రధానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ భారత జాతీయ వారసత్వ పత్రాల పరిధిలోకి వస్తాయని సాంస్కృతిక శాఖ స్పష్టం చేసింది. ‘ప్రధానమంత్రుల మ్యూజియం నుంచి నెహ్రూ ప్రైవేటు పేపర్లు గల్లంతు అయ్యాయా?’ అని ప్రశ్నిస్తూ బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర అడిగిన ఓ ప్రశ్నకు ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
దేశ తొలి ప్రధానికి సంబంధించిన ఏ ఒక్క డాక్యుమెంట్ కూడా మ్యూజియం నుంచి మిస్ కాలేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు వివరాలతో ‘ఎక్స్’ వేదికగా కేంద్ర సాంస్కృతిక శాఖ ఒక ట్వీట్ కూడా చేసింది. “2008 సంవత్సరం ఏప్రిల్ 29న సోనియాగాంధీ తరఫు ప్రతినిధి ఎంవీ రాజన్ ప్రధానమంత్రుల మ్యూజియం అండ్ లైబ్రరీకి ఒక విన్నపం చేశారు. మాజీ ప్రధాని నెహ్రూకు సంబంధించిన అన్ని ప్రైవేటు కుటుంబ లేఖలను వెనక్కి తీసుకోవాలని సోనియాగాంధీ భావిస్తున్నారు అనేది ఆ విన్నపం సారాంశం. ఈ విన్నపం అందిన వెంటనే 51 కార్టన్ల నిండా నెహ్రూ ప్రైవేటు లేఖలు, డాక్యుమెంట్లను సోనియాగాంధీకి అందించారు”
ప్రధానమంత్రి మ్యూజియం మరియు లైబ్రరీ సొసైటీ సభ్యుడు రిజ్వాన్ కద్రి, కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ వద్ద ఉన్న మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూకు సంబంధించిన ప్రైవేట్ పత్రాలను భౌతికంగా లేదా డిజిటల్‌గా యాక్సెస్ చేయడానికి అనుమతించాలని ఆమెకు లేఖ రాసినట్లు సెప్టెంబర్‌లో రాజకీయ వివాదం చెలరేగింది. 2008లో కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ సూచనల మేరకు నెహ్రూకు సంబంధించిన చారిత్రక రికార్డులు, లేడీ మౌంట్‌బాటన్‌కు రాసిన లేఖలు ఉపసంహరించుకున్నారని కద్రి పేర్కొన్నారు.
నెహ్రూ ప్రైవేటు పేపర్లలో కీలకమైన సమాచారం ఉంది. ఈ జాబితాలో ఆయన రాసిన లేఖలు, డైరీలు, నోట్సులు ఉన్నాయి. నెహ్రూ కుటుంబ, వ్యక్తిగత జీవితంతో ముడిపడిన వివరాలకు ఇవి నెలవు లాంటివి. తండ్రి మోతీలాల్ నెహ్రూ, తల్లి స్వరూపా రాణి, సోదరీమణులు విజయలక్ష్మీ పండిట్, క్రిష్ణ హుతీసింగ్, కుమార్తె ఇందిరాగాంధీ, ఎడ్వినా మౌంట్‌బాటన్, పీఎన్ హక్సర్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, జయప్రకాశ్ నారాయణ్, బాబు జగ్జీవన్ రామ్ వంటి వారికి నెహ్రూ లేఖలు రాశారు.
సాధారణంగా ఇలాంటి లేఖలు, డైరీలు, నోట్సులను పరిశోధకుల కోసం లైబ్రరీలు, పరిశోధనా సంస్థలకు విరాళంగా ఇస్తుంటారు. మొదటి నుంచి న్యూఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ అండ్ లైబ్రరీ సొసైటీలో నెహ్రూ డాక్యుమెంట్లు ఉన్నాయి. 2023లో ఈ సొసైటీ పేరును ప్రధానమంత్రుల మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీగా మార్చారు.

More Stories
ప్రతిపక్షాల నిరసనల మధ్య వీబీ జీ రామ్ జీ బిల్లు ఆమోదం
ఢిల్లీని కప్పేసిన పొగమంచు.. 40 విమానాలు, 20కిపైగా రైళ్లు ఆలస్యం
విఫల ప్రయోగంగా నిరూపితమైన సిపిఐ (మావోయిస్టు)