బోండీ బీచ్ లో కాల్పుల దర్యాప్తులో భారత బృందం

బోండీ బీచ్ లో కాల్పుల దర్యాప్తులో భారత బృందం
ఆస్ట్రేలియాలోని బోండీ బీచ్ లో ఆదివారం హనుక్కా ఉత్సవం వేళ జరిగిన ఉగ్రదాడిపై ఆ దేశ ప్రభుత్వం జరిగిస్తున్న సమగ్ర విచారణలో  ఆస్ట్రేలియా అధికారులకు సాయం చేసేందుకు ఓ బృందాన్ని అక్కడికి పంపించాలని భారత ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.  ఆస్ట్రేలియాలో మారణహోమం సృష్టించిన ఉగ్రవాది సాజిత్ అక్రమ్ (50)ను హైదరాబాదీగా గుర్తించడంతో భారత ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

ఉగ్రదాడి నిందితుల్లో ఒకరైన సాజిత్ భారత పాస్ పోర్టును కలిగి ఉండటంతో పాటు నాలుగేళ్ల క్రితం అతడు ఇక్కడికి వచ్చినట్లు తెలంగాణ డీజీపీ కార్యాలయం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దర్యాప్తులో భాగం కావాలని భారత్ భావిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ దర్యాప్తు బృందంలో రాష్ట్ర పోలీసు విభాగాలు, కేంద్ర నిఘాసంస్థలకు చెందిన అధికారులు ఉంటారని వెల్లడించాయి. 

యూదులను లక్షణయంగా చేసుకొని హింసకు పాల్పడిన వ్యక్తి నేపథ్యం, చేసిన ప్రయాణాల గురించి తెలుసుకునేందుకు ఆస్ట్రేలియా అధికారులతో కలిసి పని చేయనున్నట్లు తెలిపాయి. నాలుగేళ్ల క్రితం నిందితుడు తన తల్లిని కలిసేందుకు చేసిన భారత పర్యటనపై కూడా దృష్టిసారించనున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. భారత్ కు వచ్చిన ఉద్దేశం, వెళ్లిన ప్రదేశాలు, కలిసిన వ్యక్తుల గురించి దర్యాప్తు బృందం తెలుసుకోనుంది.

నిందితుడికి ఉగ్రవాద సంస్థలతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే దానిపైనా దృష్టి సారించినట్లు సమాచారం. భారత్ లో అతడికున్న పరిచయాలు, స్లీపర్ సెల్స్ ఎవరినైనా నియమించాడా? అనే కోణంలో కూడా విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది. అక్రమ సంబంధించిన ఆన్ లైన్ కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలపై భారత దర్యాప్తు ఏజెన్సీలు ఇప్పటికే దృష్టి సారించాయి.