గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జయకేతనం

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జయకేతనం
 
తెలంగాణలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ జయకేతనం ఎగురవేసింది. మొదటి, రెండో విడతల్లో దాాదాపు 56 % స్థానాలను గెలిచిన పార్టీ మూడో విడతలోనూ అదే ఆధిక్యాన్ని కొనసాగించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12,719 గ్రామపంచాయతీలకు మూడు దశల్లో జరిగిన ఎన్నికల్లో 7,093 స్థానాల్లో గెలిచి చాంపియన్‌గా నిలిచింది. సిద్దిపేట మినహా మిగిలిన 30 జిల్లాల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ ఆధిక్యం సాధించింది.
 
3,488 సీట్లతో బీఆర్‌ఎస్‌ ఉనికి చాటుకోగా, బీజేపీ 699 స్థానాలతో సరిపెట్టుకుంది. స్వతంత్రులు 1264 స్థానాల్లో విజయం సాధించగా సీపీఐ 79, సీపీఎం  75 స్థానాల్లో గెలిచాయి. ఇతరులు 22 స్థానాల్లో గెలిచారు. తొలి రెండు విడతల ఎన్నికల్లాగానే బుధవారం జరిగిన మూడో దశ ఎన్నికల్లోనూ సగానికిపైగా స్థానాల్లో (2,301 చోట్ల) గెలుపుతో హస్తం పార్టీ తన విజయపరంపరను కొనసాగించింది. 
 
బీఆర్‌ఎస్‌ పార్టీ సైతం పాతిక శాతానికి పైగా (1,145) స్థానాలు దక్కించుకుంది. బీజేపీ కూడా తొలి, మలి విడతల మాదిరిగానే మూడో విడతలోనూ 200 పైచిలుకు స్థానాలను దక్కించుకుంది. వాస్తవానికి పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల తర్వాత అత్యధిక స్థానాలు దక్కించుకున్నది స్వతంత్రులు, ఇతరులే.  స్వతంత్రులే సుమారుగా 10 శాతం సీట్లను గెలుచుకున్నారు. వారిలోనూ 80 శాతం మంది కాంగ్రె్‌సకు చెందినవారే. 
అనేక గ్రామాల్లో వారు స్థానిక కార్యకర్తల అభీష్టానికి భిన్నంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. దాంతో ఆయా గ్రామాల్లో కాంగ్రెస్‌ పార్టీ నేతలే రెబల్స్‌గా బరిలోకి దిగి.. సొంత పార్టీ అభ్యర్థులపైనే గెలిచారు. ప్రమాణ స్వీకారం నాటికి వారంతా కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.  వీరందరినీ కలిపితే పంచాయతీల్లో 64 శాతం కాంగ్రెస్‌ ఖాతాలోకే చేరనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక.. మూడు విడతల్లోనూ కలిపి బీఆర్‌ఎస్‌ పార్టీ ఖాతాలో 27.4 శాతం,  బీజేపీకి 5.5 శాతం సర్పంచ్‌ స్థానాలు దక్కాయి.