భారత్‌లోనూ సిడ్నీ తరహా దాడులకు అవకాశం

భారత్‌లోనూ సిడ్నీ తరహా దాడులకు అవకాశం
ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండి బీచ్‌ వద్ద జరిగిన ఉగ్రవాద దాడితో భారత్ లోని భద్రతా వర్గాలు అపరమత్తం అయ్యాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిన నిఘా వర్గాలు సిడ్నీ తరహదాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించాయి. ముఖ్యంగా కొత్త ఏడాది వేడుకలు సమీపిస్తున్న తరుణంలో భద్రతను కట్టుదిట్టం చేయాలని, ఐసిస్ ప్రేరేపిత ఉగ్రమూకలు పలు ప్రాంతాలను టార్గెట్ చేసుకోవచ్చని అప్రమత్తం చేశాయి.
 
నిందితులు ఐసిస్ భావజాలంతో ప్రభావితమయ్యారని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ స్వయంగా ప్రకటించారు.  సిడ్నీ దాడిని ఉదాహరణంగా చూపి, ఐసిస్ అనుబంధ గ్రూప్‌లు యువతను రెచ్చగొట్టే ప్రమాదం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాదిలో వేర్పాటువాద డ్రైవ్‌లు కొనసాగుతున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని కూడా తీవ్రవాద సంస్థలు రిక్రూట్‌మెంట్లకు ఒక సాధనంగా వాడుకుంటున్నాయి. న్యూ ఇయర్ వేడుకలకు భారీగా పర్యాటకులు వచ్చే గోవా వంటి రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఫరీదాబాద్ కేంద్రంగా పనిచేసిన జైషే మహమ్మద్ ప్రేరేపిత వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడకు తెగబడిన విషయాన్ని అధికారులు గుర్తుచేస్తున్నారు.
 
పోలీసులు ఏమాత్రం అలసత్వంగా ఉన్నా ముష్కర మూకలు దాడులకు తెగబడే ప్రమాదం ఉందని, కాబట్టి అప్రమత్తత అత్యవసరమని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. స్థానిక మీడియా పేర్కొన్న నిఘా వర్గాల అంచనా ప్రకారం ఉగ్రవాద సంస్థలు ఢిల్లీ, ముంబయి, బెంగళూరు సహా ప్రధాన నగరాల్లో యూదు, ఇజ్రాయెల్‌కు సంబంధిత ప్రదేశాలపై దాడులు పరిగణనలోకి తీసుకుంటున్నట్లు భావిస్తున్నారు. 
 
ఈ హెచ్చరికలను అత్యంత తీవ్రమైనవిగా భద్రతా వర్గాలు అభివర్ణించాయి. ఈ నేపథ్యంలో సంబంధిత ప్రాంతాల్లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా యూదుల ప్రార్థనా స్థలాలు, ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాలు, అలాగే యూదు, ఇజ్రాయెల్ సముదాయాలు నివసించే నివాస ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. పలు పట్టణ కేంద్రాల్లో నిఘాను విస్తరించడంతో పాటు, సున్నిత ప్రాంతాల్లో అదనపు భద్రతా సిబ్బందిని మోహరించారు.