* బంగ్లా నేతల భారత్ వ్యతిరేక వాఖ్యల పట్ల ఆగ్రహం!
పొరుగు దేశం బంగ్లాదేశ్లో మారుతున్న రాజకీయ పరిణామాలు, భారత్కు వ్యతిరేకంగా వినిపిస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. భారత్లో ఉంటున్న బంగ్లాదేశ్ హైకమిషనర్ మహమ్మద్ రిజాజ్ హమీదుల్లాకు విదేశాంగ శాఖ అత్యవసర సమన్లు జారీ చేసింది. ఢాకాలోని భారత దౌత్య కార్యాలయానికి వస్తున్న బెదిరింపులు, అలాగే బంగ్లా రాజకీయ నాయకుల నుంచి వస్తున్న విద్వేషపూరిత ప్రకటనలపై భారత్ తన నిరసనను గళమెత్తింది.
బంగ్లాదేశ్లో నేషనల్ సిటిజన్ పార్టీ (ఎస్సీపీ) నాయకుడు హస్నత్ అబ్దుల్లా ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి ప్రధాన కారణంగా మారాయి. బంగ్లాదేశ్ 55వ విజయ్ దివస్ వేడుకల సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ఈశాన్య రాష్ట్రాలైన ‘సెవెన్ సిస్టర్స్’ను భారత్ నుంచి వేరు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢాకాలో నిర్వహించిన ఒక నిరసన ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ భారత్కు వ్యతిరేకంగా ఉన్న శక్తులకు బంగ్లాదేశ్ ఆశ్రయం ఇస్తుందని, ఈశాన్య రాష్ట్రాలను విడగొట్టేందుకు తాము సహకరిస్తామంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు.
దీనిని తీవ్రంగా పరిగణించిన ఎంఈఏ తాజాగా డిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషనర్ మహమ్మద్ రియాజ్ హమీదుల్లాకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమన్లు ఇచ్చింది. ఈ పరిణామాలపై భారత విదేశాంగ శాఖ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం శాంతిభద్రతలను కాపాడాలని, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చూడాలని సూచించింది. మరోవైపు బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు లేదా ఉగ్రవాద శక్తుల కదలికలు ఉండవచ్చనే అనుమానంతో అస్సాంలోని కాచర్ జిల్లా సరిహద్దుల్లో ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించింది. అక్రమ రవాణా, సరిహద్దు దాటే కార్యకలాపాలను అరికట్టేందుకు అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.
మరోవైపు, ఢిల్లీలోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయంలో ‘విజయ్ దివస్’ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బంగ్లా హైకమిషనర్ హమీదుల్లా మాట్లాడుతూ, యువత ఆకాంక్షలను నెరవేర్చడానికి తమ దేశం కట్టుబడి ఉందని అన్నారు. భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు పరస్పర ప్రయోజనకరమైనవని, ప్రాంతీయ శాంథి, భద్రత, శ్రేయస్సు కోసం ఇరుదేశాలు కలిసి పనిచేయాలని పేర్కొన్నారు. అదే సమయంలో, భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు ‘బిజోయ్ దిబోష్’ (విజయ్ దివస్) శుభాకాంక్షలు తెలిపారు.

More Stories
వ్యక్తిత్వ నిర్మాణంతోనే దేశ నిర్మాణం
శబరిమలలో సిపిఎం జోక్యంతోనే స్థానిక ఎన్నికల్లో ఎదురుదెబ్బ!
ప్రధాని మోదీని `గొప్ప స్నేహితుడు’గా పేర్కొన్న అమెరికా