వ్యక్తిత్వ నిర్మాణంతోనే దేశ నిర్మాణం సాధ్యమవుతుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే తెలిపారు. హిందూ ఐక్యత, సామాజిక సామరస్యం, సాంస్కృతిక చైతన్యాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో సంత కబీర్ నగర్ లో జరిగిన హిందూ సమ్మేళనంలో మాట్లాడుతూ భారతదేశపు సాంస్కృతిక మూలాలు ఉమ్మడివని స్పష్టం చేశారు.
మఘర్‌లోని సంత కబీర్ మఠం మహంత్ విచార్ దాస్ అధ్యక్షత వహించారు. పూజా పద్ధతులు వేర్వేరుగా ఉండవచ్చు, కానీ మన పూర్వీకులు, మూలాలు ఒక్కటే అని దత్తాత్రేయ హోసబాలే తెలిపారు. ఇక్కడ దేశాన్ని రక్షించడం అంటే ధర్మాన్ని రక్షించడమే, ఎందుకంటే ధర్మం కేవలం పూజ మాత్రమే కాదు, అది ఒక జీవన విధానం అని చెప్పారు. సామాజిక సామరస్యం, పర్యావరణ పరిరక్షణ, కుటుంబ ప్రబోధం, స్వదేశీ, పౌర కర్తవ్యాలను స్వీకరించాలని ఆయన సమాజానికి పిలుపునిచ్చారు.
వ్యక్తిత్వ నిర్మాణంతోనే దేశ నిర్మాణం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఒక సంఘటిత సమాజం మాత్రమే ఒక దేశాన్ని దాని అంతిమ వైభవానికి తీసుకువెళ్లగలదని చెప్పారు. ఈ ప్రాచీన దేశాన్ని ఆధునిక కాలంలో దాని అంతిమ వైభవానికి తీసుకువెళ్లడానికి సంఘ్ కృషి చేస్తోందని సర్ కార్యవాహ పేర్కొన్నారు. సంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ఆలోచనలను ఆయన నొక్కి చెబుతూ కేవలం మంచిగా ఉండటం సరిపోదని, ఒక వ్యక్తికి జాతీయవాదం, సామాజిక స్పృహ ఉండటం కూడా అవసరమని స్పష్టం చేశారు.
వ్యక్తిగత వ్యక్తిత్వం కాకుండా జాతీయ వ్యక్తిత్వాన్ని లక్ష్యంగా చేసుకుని సంఘ్, శాఖ అనే భావన సృష్టించిన్నట్లు తెలిపారు. ఈ హిందూ సమ్మేళనానికి సాధువులు, సామాజిక కార్యకర్తలు, సమాజంలోని ప్రముఖులు, ప్రజలు హాజరయ్యారు. సమాజంలోని వివిధ వర్గాలను ఒకే వేదికపైకి తీసుకురావడం, పరస్పర సోదరభావాన్ని, సహకారాన్ని పెంపొందించడం, సాంస్కృతిక విలువలను బలోపేతం చేయడం దీని లక్ష్యం.
కార్యక్రమ వేదికను కాషాయ రంగులో అలంకరించారు. వేదికపై శ్రీరాముని ఆకర్షణీయమైన శకటాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులు అందమైన రంగవల్లులు, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఈ సమ్మేళనం హిందూ సమాజానికి నూతన శక్తి, చైతన్యం, ఐక్యత సందేశాన్ని అందించింది.

More Stories
బంగ్లాదేశ్ హైకమిషనర్‌కు భారత్ సమన్లు
శబరిమలలో సిపిఎం జోక్యంతోనే స్థానిక ఎన్నికల్లో ఎదురుదెబ్బ!
ప్రధాని మోదీని `గొప్ప స్నేహితుడు’గా పేర్కొన్న అమెరికా