* పట్టుబడిన వారిలో తెలంగాణ కార్యదర్శి దామోదర్, ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన 34 మంది
దేశవ్యాప్తంగా మావోయిస్టుల కోసం వేట కొనసాగుతూనే ఉంది. తెలంగాణలోని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్-యు అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి కూంబింగ్ నిర్వహించిన పోలీసులు 16 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు. పోలీసు నిఘా విభాగం సమాచారంతో ఏఎస్పీ చిత్తరంజన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బలగాలతో సిర్పూర్-యు అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించగా 16 మంది మావోయిస్టులు పట్టుబడినట్లు ఆయన తెలిపారు.
పట్టుబడిన వారిలో 9 మంది మహిళా మావోయిస్టులు ఉండగా, ఏడుగురు పురుషులు ఉన్నారని చెప్పారు. అరెస్టయిన వారిలో రాష్ట్ర కార్యదర్శి బడె చొక్కారావు అలియాస్ దామోదర్ ఉన్నట్లు సమాచారం. జిల్లాలో మావోయిస్టు సంచారం పూర్తిగా తగ్గిపోయిందని భావిస్తున్న సమయంలో 16 మంది పట్టుబడటం పోలీసు వర్గాల్లో కలకలం రేపింది
30 ఏండ్ల కిందట అజ్ఞాతంలోకి వెళ్లిన తన కొడుకు పోలీసులకు పట్టుబడ్డాడని తెలియడంతో చొక్కారావు అలియాస్ దామోదర్ తల్లి సంతోషపడటంతోపాటు తన కొడుకును తనకు అప్పగించాలని పోలీసులను వేడుకుంటున్నది. తన కొడుకును ప్రాణాలతో చూస్తానో లేదోననే బాధ ఉండేదని, పోలీసులకు దొరికాడనే వార్త ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు.
కాగా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పోలీసు అధికారుల ఎదుట 34 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వివరాలను బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ మీడియాకు వెల్లడించారు. లొంగిపోయిన వారిలో 26 మందిపై రూ.84 లక్షల రివార్డులు ఉన్నాయని, ఇందులో ఏడుగురు మహిళలు కూడా ఉన్నారని తెలిపారు. ఈ 26 మందిపై రూ.లక్ష నుంచి రూ.8 లక్షల రివార్డు ఉన్నవారు ఉన్నట్లు వెల్లడించారు.
వీరిలో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీ, ఆంధ్రా-ఒడిశా బోర్డర్ డివిజన్ సభ్యులు ఉన్నారని పేర్కొన్నారు. లొంగిపోయిన వారికి తక్షణ సహాయార్థం రూ.50 వేల ప్రోత్సాహకాన్ని అందించనున్నట్లు తెలిపారు.

More Stories
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బిజెపిని గెలిపించండి
సాహితీ ఇన్ ఫ్రా మోసం రూ. 3 వేల కోట్లు !
ఎస్సీ కులస్థులు, గిరిజన తెగలు కలిసి పనిచేయాలి