కొండగట్టు శ్రీ అంజన్న ఆలయానికి అటవీ శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేయడం పట్ల బీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన, సనాతన ధర్మానికి ప్రతీక అయిన కొండగట్టు అంజన్న ఆలయంపై ఈ తరహా చర్యలు హిందూ భక్తుల విశ్వాసాలపై దాడిగా బిజెపి ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని, భక్తుల విశ్వాసాలు, ధార్మిక సంప్రదాయాలు, పేద భక్తుల ఇబ్బందులు, ప్రజల సౌకర్యాలను ప్రథమ ప్రాధాన్యంగా తీసుకొని ఈ వివాదానికి వెంటనే శాశ్వత పరిష్కారం చూపాలని బిజెపి డిమాండ్ చేసింది.
ఆలయానికి, ఆలయ ఆవరణలో 6 ఎకరాల భూమి భూముల పరిమితి అంటూ కొత్త వాదనను తీసుకురావడం భక్తులకు బాధను కలిగిస్తోందని రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచందర్ రావు విమర్శించారు. అయితే అటవీ శాఖ క్లెయిమ్ చేస్తున్న 6 ఎకరాల స్థలంలోనే భక్తులకు అత్యంత అవసరమైన అన్నదాన సత్రం, పబ్లిక్ టాయిలెట్స్, వాటర్ ప్లాంట్, ఆగమ పాఠశాల, వేద విద్యార్థుల వసతి గృహం, భోజనశాల వంటి కీలక మౌలిక సదుపాయాలు ఉన్నాయని తెలిపారు.
మరోవైపు ఎండోమెంట్ కూడా అటవీ శాఖ కు నోటీసులు ఇచ్చిందని చెబుతూ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను, వివాదాన్ని పట్టించుకోకపోవడం అన్యాయం అని విమర్శించారు. ఈ 6 ఎకరాల భూమి కొడిమ్యాల ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని 684 కంపార్ట్‌మెంట్‌లో ఉందని పేర్కొంటూ, ఫారెస్ట్ కన్సర్వేషన్ యాక్ట్–1980లోని 2ఏ నిబంధనల ప్రకారం కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని అటవీ శాఖ నోటీసులు జారీ చేసిందని తెలిపారు.
అలాగే వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ యాక్ట్‌లోని 3ఏ, 3బి సెక్షన్ల కింద 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేనిచో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం భక్తుల్లో ఆందోళనలకు దారితీస్తోందని ఆయన చెప్పారు. అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడితే జైలుశిక్ష పడే అవకాశం ఉందని, సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం మతపరమైన కట్టడాలనైనా కూల్చివేసే అధికారం అటవీ శాఖకు ఉందని నోటీసుల్లో పేర్కొనడం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తోందని రామచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రత్యేకంగా కొండగట్టు ఆలయంలో నిత్యం జరిగే వాహన పూజలు, గిరి ప్రదక్షిణ, భక్తుల రాకపోకలు, పార్కింగ్ ఏర్పాట్లు ఈ 6 ఎకరాల స్థలంతో నేరుగా ముడిపడి ఉన్నాయని ఆయన చెప్పారు. కొండగట్టు వద్ద 6 ఎకరాల స్థలానికి ప్రత్యామ్నాయంగా రాంసాగర్ గ్రామంలో ఉన్న దేవాదాయ భూముల నుంచి 8 ఎకరాలు ఇవ్వడానికి ఎండోమెంట్ శాఖ ముందుకు వచ్చినా, అటవీ శాఖ కొండగట్టు ఆలయం పరిధిలోనే వివాదాన్ని కొనసాగించడం వెనుక ఉన్న ఉద్దేశాలపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.
More Stories
సిర్పూర్-యు అడవుల్లో 16 మంది నక్సల్స్ అరెస్ట్,
రవీంద్రభారతిలో ఎస్పీ బాలు కాంస్య విగ్రహం
సగానికి పైగా స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారుల పాగా!