మెస్సీ పర్యటన గందరగోళంపై బెంగాల్ క్రీడా మంత్రి రాజీనామా

మెస్సీ  పర్యటన గందరగోళంపై బెంగాల్ క్రీడా మంత్రి రాజీనామా
పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పాల్గొన్న ‘గోట్ టూర్’ ఈవెంట్‌లో తలెత్తిన తీవ్ర గందరగోళం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ బెంగాల్‌ క్రీడా మంత్రి అరూప్‌ బిశ్వాస్‌ తన పదవికి రాజీనామా చేశారు. 
 
ఈ మేరకు ముఖ్యమంత్రి మమతాబెనర్జికి తన రాజీనామా లేఖను పంపారు. ‘దీదీ.. కోల్‌కతా స్టేడియంలో ఉద్రిక్తతలపై దర్యాప్తునకు మీరు ఇప్పటికే ఒక విచారణ కమిటీని నియమించారు. ఆ విచారణ నిష్పాక్షికంగా జరగడం కోసం నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా. నా రాజీనామాను ఆమోదించాలని అభ్యర్థిస్తున్నా’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ రాజీనామాకు సీఎం మమత బెనర్జీ వెంటనే ఆమోదముద్ర వేశారు.

అరూప్ బిస్వాస్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తులలో ఒకరు. అలాగే తృణమూల్ కాంగ్రెస్ లో శక్తివంతమైన నాయకుడిగా ఉన్నారు. అయినప్పటికీ ఆయన రాజీనామా చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.  ఈ ఘటన రాజీకీయంగా కూడా తీవ్ర దుమారం రేపింది. మెస్సీ పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయించడంలో బెంగాల్‌ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. దానితో క్రీడా మంత్రి రాజీనామా తప్పలేదు.