నెహ్రు, ఇందిరా హయాంలో హిమాలయాల్లో అమెరికా అణు పరికరం!

నెహ్రు, ఇందిరా హయాంలో హిమాలయాల్లో అమెరికా అణు పరికరం!

*  అణుధార్మిక పరికరం ఆచూకీపై గంగానది కాలుష్యం పట్ల ఆందోళన

హిమాలయాల్లోని నందాదేవి పర్వత శిఖరంపై దాదాపు 60 ఏళ్ల క్రితం అమెరికా వదిలి వెళ్లిన అణుధార్మిక పరికరం నేడు భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఒక వేళ ఈ అణుపరికరం దెబ్బతింటే గంగానదికి, దాని పరీవాహక ప్రాంతానికి తీవ్ర ముప్పు ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన ఓ సోషల్ మీడియా పోస్టుతో ఇదంతా వెలుగులోకి వచ్చింది.

1960ల్లో ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో చైనా పెద్ద ఎత్తున అణుకార్యక్రమాలు చేపట్టింది. దీనితో భారత్, ఆమెరికాలు అప్రమత్తమయ్యాయి. చైనాపై నిఘా పెట్టేందుకు అమెరికాకు చెందిన సీఐఏ, భారత్కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరోలు కలిసికట్టుగా ఓ కోవర్ట్ ఆపరేషన్ చేపట్టాయి. అందులో భాగంగా భారత్లోని రెండో అత్యంత ఎత్తైన నందాదేవి పర్వత శిఖరంపై ఒక న్యూక్లియర్ డివైజ్ను ఏర్పాటు చేశాయి. 

ఈ అణు పరికరం రేడియో ఐసోటోప్ థర్మోఎలక్ట్రిక్ జనరేటర్ (ఆర్టీజీ) ఆధారంగా పనిచేస్తుంది. దీనికి పెద్ద మొత్తంలో ప్లూటోనియం అవసరం అవుతుంది. ఎందుకంటే చైనా క్షిపణి, అణు పరీక్షలపై నిఘా ఉంటే సెన్సార్లకు ఇదే శక్తిని ఇస్తుంది. కొంత కాలానికి అమెరికా ఈ కోవర్ట్ ఆపరేషన్ నుంచి తప్పుకుంది.  కానీ  పర్యావరణపరంగా సున్నితమైన హిమాలయన్ ప్రాంతంలో ఆ ప్రమాదకర పరికరాన్ని వదిలేసి వెళ్ళిపోయింది. కొంతకాలం తర్వాత అక్కడకు వెళ్లిన అధికారులకు ఎంత వెతికినా ఆ పరికరం కనిపించలేదట! దీనితో హిమపాతం వల్ల మంచులో కూరుకుపోవడమో, లేదా జారిపోవడమో జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

అయితే ఇది చాలా ప్రమాదకరమైన పరికరం అని, దీని వల్ల గంగానదికి తీవ్ర ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని బీజేపీ సీనియర్‌ నేత, ఎంపీ నిషికాంత్ దూబే ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్‌ నుంచి బెంగాల్ వరకు గంగానది ఒడ్డున నివసిస్తున్న ప్రజల్లో క్యాన్సర్ కేసులు పెరగడానికి ఇది కారణం కాదా? అని దూబే ప్రశ్నించారు. హిమానీనదాలు కరగడానికి, క్లౌడ్‌బరస్ట్‌, ఇళ్లల్లో పగుళ్లకు కూడా ఇదే కారణమా? అని అనుమానం వ్యక్తంచేశారు. 

పార్లమెంట్‌లో 1978లో నిఘా పరికరం విషయాన్ని అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ అంగీకరించారని దూబే పేర్కొన్నారు.  అమెరికా వార్తా సంస్థ న్యూయార్క్‌ టైమ్స్‌ ఇటీవల దీనిపై కథనాన్ని ప్రచురించిందని ఆయన తెలిపారు. ఇప్పుడు మన భావితరాలను కాపాడుకునే సమయం ఆసన్నమైందని తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. ఈ అంశంపై 1978లో అమెరికా చట్టసభ సభ్యులు తమ ప్రభుత్వానికి రాసిన లేఖను ఆయన షేర్ చేశారు.

నందాదేవీ పర్వతంపై కనిపించకుండా పోయిన అమెరికా అణు పరికరానికి, ఉత్తర భారతంలో ఇటీవల ప్రకృతి వైపరీత్యాలకు ముడిపెడుతూ ఆయన కొద్దికాలం క్రితం విమర్శలు చేశారు. నెహ్రూ, ఇందిరలతోపాటు రాహుల్ గాంధీ విదేశీ శక్తులకు లొంగిపోయి, దేశ ప్రయోజనాలను ఫణంగా పెట్టారని ఆయన మండిపడ్డారు. వారి చర్యలు భావితరాలకు ప్రమాదకరంగా మారాయని ఆరోపించారు.

హిమాలయాల్లో కనిపించకుండా పోయిన ఈ న్యూక్లియర్ డివైజ్ గురించి, తరువాత కాలంలో అమెరికా, భారత్ బృందాలు అన్వేషించాయి. కానీ అది దొరకలేదు. మరోవైపు, ఎవరైనా ఈ పరికరం హార్డ్వేర్ను స్వాధీనం చేసుకుని ఉండొచ్చనే ప్రచారం కూడా జరిగింది. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం.  అయితే 1978లో ఇండియన్ అటామిక్ ఎనర్జీ కమిషన్ దీనికి సంబంధించిన ఓ నివేదికను రూపొందించింది.

అందులో స్థానిక నదీ జలాల్లో ఆ అణు  పరికరంలోని ప్లూటోనియం కలిసిన ఆనవాళ్లు లేవని స్పష్టం చేసింది. అయితే పరికరం ఎక్కడ ఉందనే విషయాన్ని మాత్రం ప్రస్తావించకపోవడం గమనార్హం. గంగానది పుట్టినిల్లు నందాదేవి పర్వతం. వాస్తవానికి ఈ నందాదేవి పర్వత హిమానీనదాల నుంచే రిషి గంగా, ధౌలి గంగ నదులు జన్మించాయి. ఈ రెండూ అలకనంద, భాగీరథి వద్ద కలిసిన తరువాత, దానిని మనం పవిత్ర గంగానదిగా వ్యవహరిస్తాం. ఈ గంగానది జలాలు మనదేశంలో కోట్లాది మందికి జీవనాధారంగా ఉంది.

నిపుణుల ప్రకారం, అమెరికా అమర్చిన ఆర్టీజీ పరికరం కనుక మంచులో కూరుకుపోయి ఉంటే, దాని వల్ల తక్షణం ఎలాంటి ముప్పు ఉండదు. ఒక వేళ ఆ పరికరం దెబ్బతిని, అందులోని రేడియోధార్మిక పదార్థాలు వాతావరణంలో కలిస్తే, అది తీవ్ర ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది. ముఖ్యంగా గంగానదీ జలాలు కలుషితమయ్యే అవకాశం ఉంటుంది.