‘ఆపరేషన్ సిందూర్’ వేళ పాకిస్థాన్ ఆర్మీ ప్రయోగించిన తుర్కియే ఆత్మాహుతి డ్రోన్ ‘యిహ’ను భారత ఆర్మీ కూల్చేసింది. ‘విజయ్ దివస్’ సందర్భంగా సోమవారం భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ డ్రోన్‌ను ప్రదర్శించారు. మే 10న 2వేల మీటర్ల ఎత్తులో ఎగురుతున్న ఈ డ్రోన్‌ను భారత ఆర్మీ గగనతల రక్షణ విభాగం (ఏఏడీ) కూల్చేసింది. దాన్ని సేకరించి తిరిగి నిర్మించి ఇప్పుడు ప్రదర్శనకు ఉంచడం విశేషం. 10కేజీల పేలుడు పదార్థాలను మోసుకెళ్లే కెపాసిటీ ఆ డ్రోన్‌కు ఉందని తెలిపారు.
పెద్దసంఖ్యలో ‘యిహ’ ఆత్మాహుతి డ్రోన్లను ఆర్మీ కూల్చేసిందని వెల్లడించారు. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో భారత్ విజయానికి గుర్తుగా ఏటా డిసెంబరు 16న ‘విజయ్ దివస్’ను నిర్వహిస్తుంటారు. ఈసారి విజయ్ దివస్ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో ‘యిహ’ డ్రోన్‌ను ప్రదర్శించారు. గగనతల రక్షణ వ్యవస్థలో, డ్రోన్ల నిర్మాణంలో భారత్ ఎంతటి స్థాయికి ఎదిగిందో పాక్‌కు తెలపాలనే ఉద్దేశంతో ఈ డ్రోన్‌ను ప్రదర్శనకు ఉంచారు.
జమ్మూకశ్మీరులోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో పెద్దసంఖ్యలో భారతీయ పర్యాటకులు చనిపోయారు. దీనికి ప్రతిగా మే 7న భారత త్రివిధ దళాలు ఆపరేషన్ సిందూర్‌ను మొదలుపెట్టాయి. పాక్‌లోని ఉగ్రవాద, సైనిక స్థావరాలపై దాడులు చేశాయి. దీంతో పాకిస్థాన్ సైన్యం కూడా ప్రతిఘటించింది. మే 10 వరకు ఇరుదేశాల సైనిక ఘర్షణ కొనసాగింది. ఈక్రమంలో పాక్ వైపు నుంచి పెద్దసంఖ్యలో దూసుకొచ్చిన ‘యిహ’ డ్రోన్లను భారత ఆర్మీ కూల్చేసింది. ఆపరేషన్ సిందూర్ వేళ పాక్‌కు తుర్కియే పెద్దఎత్తున మిస్సైళ్లు, డ్రోన్లను సప్లై చేసింది.
1971లో భారత సైన్యం, బంగ్లాదేశ్ స్వతంత్ర పోరాట యోధులు కలిసి పాక్ సైన్యంపై పోరాడారు. 1971 డిసెంబరు 3 నుంచి డిసెంబరు 16 వరకు ఈ వార్ కొనసాగింది. చివరకు పాకిస్థాన్ ఘోరంగా ఓడిపోయింది. 1971 మార్చి 26న పాకిస్థాన్ రెండు ముక్కలుగా చీలిపోయింది. ఆ రోజున బంగ్లాదేశ్ పేరుతో ఒక కొత్త దేశం ఏర్పడింది. ఏటా డిసెంబరు 16వ తేదీని బంగ్లాదేశ్ విక్టరీ డేగా జరుపుకుంటుంది. ఈ తేదీన భారత్ విజయ్ దివస్‌ను నిర్వహిస్తుంది.
ఏటా డిసెంబరు 16న విక్టరీ డే సందర్భంగా బంగ్లాదేశ్ ఆర్మీ పరేడ్ నిర్వహించేది. కానీ గత ఏడాది యూనస్ ప్రభుత్వం పరేడ్ నిర్వహించలేదు. ఈసారి కూడా పరేడ్ ఉండదని అంటున్నారు. ప్రస్తుత బంగ్లాదేశ్ సర్కారు ఇస్లామిక్ అతివాదుల చేతుల్లోకి వెళ్లిపోయిందనే వాదన వినిపిస్తోంది. గత ఏడాది వ్యవధిలో పాక్ ఆర్మీ ఉన్నతాధికారులు సైతం బంగ్లాదేశ్‌లో పలుమార్లు పర్యటించారు.
More Stories
ఢిల్లీని కమ్మేసిన పొగమంచు
ఆసియాలోనే అతిపెద్ద కారాగారం తిహార్ జైలు తరలింపు
2026లో రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు