వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పశ్చిమ బంగాల్లో ఒకప్పుడు నక్సలైట్ ఉద్యమానికి కేంద్ర బిందువుగా నిలిచిన నక్సల్బరీ గ్రామంలో ఇప్పుడు బిజెపి పాగా వేస్తుంది. గతంలో ఉత్తర బెంగాల్ వామపక్షాలకు కంచుకోటగా ఉండేది. ఇప్పుడు అక్కడ ఆర్ఎస్ఎస్, బీజేపీ హవా వీస్తోంది. చారు మజుందార్, కానూ సన్యాల్, లెనిన్, స్టాలిన్ వంటి వామపక్ష యోధుల విగ్రహాలతో కూడిన ‘నక్సల్బరీ టియానన్మెన్ స్క్వేర్’ చుట్టూనే గతంలో రాజకీయాలు జరిగేవి.
కానీ ఇప్పుడు అందరి చూపు నక్సల్బరీలోని కొత్త కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నం వైపు మళ్లింది. ఆర్ఎస్ఎస్ క్యాడర్ ఏళ్ల తరబడి చేసిన శ్రమ వల్లే నక్సల్బరీలో ఈ దిశగా మార్పు వచ్చింది. ఈ ప్రాంతంలో ఉన్న 54 అసెంబ్లీ స్థానాలు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారనున్నాయి. వాటిలో వీలైనన్ని ఎక్కువ సీట్లను సాధించాలనే లక్ష్యంతో బీజేపీ ఉంది. ‘నక్సల్బరీ’ పుణ్యమా అని కొన్ని దశాబ్దాల పాటు ఉత్తర బంగాల్ ప్రాంతం వామపక్ష పార్టీలకు కంచుకోటగా ఉండిపోయింది.
అయితే 2011 సంవత్సరం తర్వాత రాష్ట్రంలోని వామపక్ష పార్టీలు కలిసికట్టుగా ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేసుకోలేకపోయాయి. ప్రత్యేకించి కాంగ్రెస్‌తో పొత్తు విషయంలో ఆ పార్టీలు రెండుగా చీలిపోయాయి. ఈ పరిణామాన్ని గుర్తించిన బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ‘ఆపరేషన్ లోటస్’ను మొదలుపెట్టారు. ఆపరేషన్ లోటస్‌లో భాగంగా 2017లో నక్సల్బరీ గ్రామంలో ఓ దళిత కుటుంబంతో కలిసి అమిత్‌షా భోజనం చేశారు.
ఉత్తర బెంగాల్లో పూరి గుడిసెల్లో నివసించే మహలీ వర్గం ప్రజలకు పక్కా ఇళ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ ప్రాంతంలోని డార్జిలింగ్‌లో ఉన్న గూర్ఖాలు, కూచ్ బెహార్లో ఉన్న రాజ్బన్షీల ప్రత్యేక రాష్ట్రం లేదా ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతాన్ని కోరుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతోనే ఇలాంటి డిమాండ్లు సాకారం అవుతాయనే సందేశాన్ని గూర్ఖాలు, రాజ్బన్షీలకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేరవేశాయి.
సామాజిక సేవా కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారంతో బీజేపీ, ఆర్ఎస్ఎస్ మున్ముందుకు సాగాయి. 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వీటి ఫలితం వచ్చింది. అంతకుముందు ఎన్నికల్లో 3 స్థానాల్లో గెల్చిన బీజేపీ, 2021లో ఏకంగా 77 సీట్లు కైవసం చేసుకుంది. బీజేపీకి ఇన్ని సీట్లు రావడానికి ప్రధాన కారణం ఉత్తర బెంగాల్ ప్రాంతమే.
“నేను మమతా బెనర్జీ ప్రభుత్వం అమలుచేస్తున్న లక్ష్మీ భండార్ పథకం లబ్ధిదారురాలిని. అయినా నా హృదయం బీజేపీ కోసం కొట్టుకుంటోంది. బీజేపీ దేశ నిర్మాణం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నాన్ని నక్సల్బరీలో ఏర్పాటు చేసింది” అని నక్సల్బరీకి చెందిన రైతు మీను సైబా తెలిపారు.

More Stories
స్థానిక ఎన్నికల ఓటమితో కేరళలో సిపిఎం హింసాకాండ!
నరేగా చట్టం రద్దు!.. పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగింపు
నెహ్రు, ఇందిరా హయాంలో హిమాలయాల్లో అమెరికా అణు పరికరం!