రాహుల్, ఖర్గే పార్లమెంటులో క్షమాపణలు చెప్పాలి

రాహుల్, ఖర్గే పార్లమెంటులో క్షమాపణలు చెప్పాలి
 
* ఖబర్ ఖుదేగీ వ్యాఖ్యలతో రాజకీయ దుమారం
 
ప్రధాని మోదీ ప్రాణాలకు హాని తలపెడతామంటూ కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు హెచ్చరికలు చేసినందుకు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో కొందరు కార్యకర్తలు ప్రధాని మోదీ కోసం సమాధిని తవ్వుతామని బహిరంగంగా వ్యాఖ్యానించడం అత్యంత దురదృష్టకరం, విషాదకరమని పేర్కొంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 
 
భారత ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి తావు లేదని ఆయన స్పష్టం చేశారు. సోమవారం అత్యవసరంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ  కార్యకర్తల తప్పుడు చేష్టను కాంగ్రెస్ నేతలు నామమాత్రంగా ఖండించి వదిలేస్తే సరిపోదని హెచ్చరించారు. దీనిపై పార్లమెంటు వేదికగా లోక్‌సభ విపక్ష నేత రాహుల్, కాంగ్రెస్ చీఫ్ ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందేనని తేల్చి చెప్పారు. 
 
కాంగ్రెస్ నేతల్లో మానవత్వం మిగిలి ఉంటే, దేశ ప్రజలపై గౌరవం ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా పార్లమెంటు ఉభయసభల్లో క్షమాపణ చెబుతూ ప్రకటన చేయాలని కేంద్ర మంత్రి సూచించారు. విపక్ష నేతలను రాజకీయ ప్రత్యర్ధులుగా చూస్తానే తప్ప, శత్రువులుగా చూడనని ప్రధాని మోదీ నిత్యం చెబుతుంటారని ఆయన గుర్తుచేశారు.

“కాంగ్రెస్, బీజేపీలకు చెందిన కార్యకర్తలు, నేతలు రాజకీయ ప్రత్యర్ధులు మాత్రమే. వాళ్లు శత్రువులు కాదు. రాజకీయ పార్టీల సైద్ధాంతిక భావజాలాలు వేరు. అయినప్పటికీ ప్రధాని మోదీ కలలు కంటున్న వికసిత భారత్‌ కోసం మేం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. రాజకీయ ఘర్షణలు ఉన్నప్పటికీ, ప్రజల సమక్షంలో నేతలు ఒకరినొకరు పలకరించుకుంటారు” అని తెలిపారు. 

“నేతలు రాజకీయ విమర్శలు చేసుకోవడం అనేది మరో ప్రత్యేక అంశం. మేం విమర్శించుకుంటాం, కానీ ఒకరినొకరు చంపుకోవాలని ఎన్నడూ ఆలోచించం. కనీసం అలాంటి విషయాలను అస్సలు మాట్లాడం. నేరుగా ప్రధాని మోదీకే ప్రాణహాని తలపెడతామని బెదిరిస్తున్నారంటే వాళ్ల మానసిక స్థితి ఎలా ఉంది? రాజకీయ ప్రత్యర్ధులను చంపుతామని బహిరంగంగా బెదిరించడం సరైన చర్యేనా?” అని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రశ్నించారు.

“140 కోట్ల మంది భారతీయులకు నరేంద్రమోదీ ప్రధాన మంత్రి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశానికి ఆయన సారథ్యం వహిస్తున్నారు. యావత్ ప్రపంచం మోదీని గౌరవిస్తోంది. కానీ కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం మోదీ ప్రాణాలకు హానిని తలపెడతామని అంటున్నారు. ఇదే వాళ్ల సంస్కృతి, వాళ్ల భాష. ఇదే సంస్కృతితో దేశాన్ని పాలించాలని కాంగ్రెస్ పార్టీ కలలు కంటోంది” అని ఆయన ధ్వజమెత్తారు. 

“ప్రజల విశ్వాసాన్ని ఎలా గెలుచుకోవాలి అనే దానిపై విపక్షాలకు గతంలో ప్రధాని మోదీ టిప్స్ కూడా ఇచ్చారు. అయినా ప్రజలు వాళ్లను నమ్మడం లేదు. ఆ ఫ్రస్ట్రేషన్‌లోనే రాజకీయాలతో సంబంధం లేని వ్యాఖ్యలను, విమర్శలను విపక్ష పార్టీలు చేస్తున్నాయి. రాజకీయ విమర్శలకు ఒక పరిమితి అనేది ఉంటుంది. అవి ఆ పరిమితిని దాటితే మన రాజకీయాలకు చేటు జరుగుతుంది” అని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు.

“మేం పార్లమెంటులో అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. విపక్షాలే చర్చ నుంచి తప్పించుకుంటున్నాయి. ప్రధానిపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే దేశానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ తన తప్పును గుర్తించాలి. లోక్‌సభ, రాజ్యసభలకు క్షమాపణ చెప్పాలి” అని కిరణ్ రిజిజు హితవు చెప్పారు. ‘ఓట్ చోర్ గద్దీ ఛోడ్’ పేరుతో ఆదివారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ర్యాలీని నిర్వహించింది. బీజేపీ, కేంద్ర ఎన్నికల సంఘాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు.

దేశ ప్రజల ఓటు హక్కును దొంగిలిస్తున్నారని వారు ఆరోపణలు చేశారు. ఈక్రమంలో కాంగ్రెస్ నేత మంజులతా మీన వివాదాస్పద వాఖ్యలు చేశారు ‘మోదీ నీ సమాధిని తవ్వుతాం. ఇవాళ కాకుంటే రేపు నీ సమాధిని తవ్వుతాం’ (మోదీ తేరీ ఖబర్ ఖుదేగీ, ఆజ్ నహీ తో కల్ ఖుదేగీ) అని వ్యాఖ్యానించారు. ప్రజల ఆగ్రహాన్ని అద్దంపట్టేలా తాను ఈ వ్యాఖ్యలు చేశానని మంజులతా మీన చెప్పుకొచ్చారు. దేశ ప్రజల అసలు సమస్యలపై మోదీ ధ్యాస పెట్టడం లేదని అంటూ ఆమె విమర్శించారు.