* 16కు పెరిగిన మృతుల సంఖ్య, ఆసుపత్రులలో 40 మంది
సిడ్నీ బాండీ బీచ్ సమీపంలో హనుక్కా వేడుకలో జరిగిన ఘోర కాల్పుల ఘటనకు బాధ్యులైన ఇద్దరు తుపాకీదారులను పాకిస్థాన్ సంతతికి చెందిన తండ్రీకొడుకులుగా గుర్తించినట్లు న్యూ సౌత్ వేల్స్ పోలీసులు తెలిపారు. ఈ దాడిలో ఇతర దాడిదారులు ఎవరూ పాల్గొనలేదని కూడా వారు ధృవీకరించారు. 50 ఏళ్ల తండ్రి సంఘటనా స్థలంలోనే మరణించడంతో మృతుల సంఖ్య 16కు చేరింది. కాగా అతని 24 ఏళ్ల కుమారుడు ఆసుపత్రిలో విషమ పరిస్థితిలో ఉన్నాడు.
ఆస్ట్రేలియా హోం మంత్రి ప్రకారం “బాండీ కాల్పుల దాడిలో పాల్గొన్న తండ్రి 1998లో విద్యార్థి వీసాపై ఆస్ట్రేలియాకు వచ్చాడు, కుమారుడు ఆస్ట్రేలియాలో జన్మించిన పౌరుడు”.
ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్‌లో హనుక్కా మొదటి రోజును జరుపుకుంటున్న యూదుల సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన కాల్పుల్లో మృతుల సంఖ్య 16కు పెరిగిందని, కనీసం 40 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని న్యూ సౌత్ వేల్స్ పోలీసులు సోమవారం ధృవీకరించారు.
అప్పటి నుండి యూదుల సామాజిక కార్యక్రమాల చుట్టూ భద్రతను పెంచారు. దర్యాప్తు కొనసాగుతున్నందున ఊహాగానాలు చేయవద్దని అధికారులు ప్రజలను కోరారు. ఆదివారం సాయంత్రం సుమారు 6.30 గంటలకు తండ్రీకొడుకులైన నిందితులు క్యాంప్‌బెల్ పరేడ్‌లోని పాదచారుల ఫుట్‌బ్రిడ్జ్ పైకి నడుచుకుంటూ వెళ్లి, అక్కడ నుండి సమీపంలోని పార్కులో హనుక్కా మొదటి రోజును జరుపుకుంటున్న పెద్ద జనసమూహం వైపు ఉత్తరం వైపు కాల్పులు జరపడం ఫుటేజీలో కనిపిస్తుంది.
ప్రత్యేకంగా యూదుల సమాజాన్ని లక్ష్యంగా చేసుకున్న ఈ దాడి, హనుక్కా మొదటి రోజును జరుపుకోవడానికి వందలాది మంది ప్రజలు గుమిగూడినప్పుడు జరిగింది/ దీనిని అధికారికంగా ఉగ్రవాద దాడిగా ప్రకటించారు. సాజిద్ అక్రమ్ సంఘటనా స్థలంలోనే మరణించగా, నవీద్ అక్రమ్ ఆసుపత్రిలో పోలీసుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఈ దాడిలో కనీసం 40 మంది గాయపడ్డారని, దీనిని యూదుల సమాజంపై ఉద్దేశపూర్వకంగా చేసిన దాడిగా పోలీస్ కమిషనర్ మాల్ లాన్యోన్ అభివర్ణించారు.
50 ఏళ్ల వ్యక్తికి అక్కడ తుపాకీలు కలిగి ఉండటానికి లైసెన్స్ ఉందని, ఆదివారం ఆరు రిజిస్టర్డ్ తుపాకులను బీచ్‌కు తీసుకువచ్చాడని లాన్యోన్ చెప్పారు. కాల్పులు జరిపిన వారిలో ఒకరు పోలీసులకు తెలిసిన వ్యక్తి, కానీ దాడికి ప్రణాళిక వేస్తున్నట్లు ఎటువంటి సూచన లేదని పేర్కొన్నారు. ఇటీవల ఉద్యోగం కోల్పోయిన ఇటుక పనివాడైన నవీద్ అక్రమ్, వారాంతంలో చేపల వేటకు వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పాడు.
పోలీసులు అతని బోనిరిగ్గ్‌లోని ఇంటిని, తండ్రీకొడుకులు బస చేస్తున్న క్యాంప్సీలోని ఒక స్వల్పకాలిక అద్దె ఇంటిని సోదా చేశారని తెలుస్తున్నది. ల్యాన్యన్ ప్రకారం, కాల్పులు జరిపిన వారిలో ఒకరు అధికారులకు తెలిసిన వ్యక్తే, కానీ “మాకు తెలిసిన ఆ వ్యక్తి గురించి పోలీసులకు చాలా తక్కువ సమాచారం ఉంది. కాబట్టి, ఈ సమయంలో మేము స్వయంచాలకంగా గమనించే వ్యక్తులలో అతను ఒకరు కాదు.”
సెమిటిజం వ్యతిరేకతపై కఠిన వైఖరి తీసుకోడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నుండి ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ విమర్శలను ఎదుర్కొన్నారు. అల్బనీస్ ఈ విమర్శలకు నేరుగా స్పందించకుండా, ఇది జాతీయ ఐక్యతకు సమయం అని పేర్కొన్నారు.
కాగా, పండ్ల దుకాణ యజమాని అహ్మద్ అల్-అహ్మద్‌గా గుర్తించిన ఒక ఆగంతకుడు, కాల్పులు జరిపిన వారిలో ఒకరిపై దాడి చేసి, అతని చేతుల్లోంచి ఆయుధాన్ని లాక్కుని ఉండకపోతే, ఈ సామూహిక కాల్పుల్లో మరింక చాలా మంది చనిపోయి ఉండేవారని అధికారులు తెలిపారు. 2023 అక్టోబర్‌లో గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఆస్ట్రేలియాలోని సినగోగ్‌లు, భవనాలు, కార్లపై జరిగిన అత్యంత తీవ్రమైన యూదు వ్యతిరేక దాడులలో ఆదివారం జరిగిన సామూహిక కాల్పులు ఒకటి.

More Stories
అన్ని పార్టీల అధ్యక్షులకంటే చిన్నవాడు నితిన్ నబిన్
ధర్మశాలలో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం
పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన యువ భారత్