భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 45 ఏళ్ల నితిన్ నబిన్‌ను తన జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించడం ద్వారా ఒక కీలక ప్రకటన చేసింది. దీనితో ఆయన భారతదేశంలో ఒక రాజకీయ పార్టీకి అత్యంత పిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా నిలిచారు. నబిన్ వయస్సు ప్రతిపక్ష పార్టీల అధినేతల వయస్సుతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంది. వారిలో చాలా మందికి 60 ఏళ్లు పైబడి, 70 లేదా 80 ఏళ్ల వయస్సులో ఉన్నారు.
బీహార్ రోడ్ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న నబిన్, జగత్ ప్రకాష్ నడ్డా తర్వాత బిజెపి కొత్త జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సోమవారం బాధ్యతలు స్వీకరిస్తున్నారు. బీజేపీ జాతీయ పార్టీ అధినేతగా నియమించిన అత్యంత పిన్న వయస్కుడైన నాయకుడు కూడా నబినే కావడం గమనార్హం. ఇతర పార్టీల అధినేతలతో పోలిస్తే ఆయన వయస్సు ఎలా ప్రత్యేకంగా నిలుస్తుందో ఇక్కడ చూడండి.
మల్లికార్జున్ ఖర్గే ప్రస్తుతం భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్‌సి) అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. 2022 నుండి కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఆయన రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నారు. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) అధ్యక్షుడైన అఖిలేష్ యాదవ్ 2017 నుండి జాతీయ పార్టీ అధినేతగా పనిచేస్తున్నారు. 2012 నుండి 2017 వరకు ఉత్తరప్రదేశ్‌కు అత్యంత పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రిగా పనిచేసిన యాదవ్ వయస్సు 52 సంవత్సరాలు.
శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్చంద్ర పవార్ వర్గం) జాతీయ అధ్యక్షుడు. 85 ఏళ్ల ఈ నాయకుడు ఎన్‌సిపి వ్యవస్థాపకుడు, మహారాష్ట్రకు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఫరూక్ అబ్దుల్లా ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి అయిన అబ్దుల్లా వయస్సు 88 సంవత్సరాలు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ప్రస్తుతం ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. ఆమె వయస్సు 70 సంవత్సరాలు. ఆమె పార్టీ వ్యవస్థాపకురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన మొదటి మహిళ. మాయావతి బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి) జాతీయ అధ్యక్షురాలిగా ఉన్నారు. మాయావతి వయస్సు 69 సంవత్సరాలు. గతంలో నాలుగు పర్యాయాలు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.
ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్‌కు 72 సంవత్సరాలు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్, 2018 నుండి డీఎంకే అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన 2017 నుండి 2018 వరకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేశారు. తన తండ్రి ఎం. కరుణానిధి మరణానంతరం ఆయన పార్టీ పగ్గాలు చేపట్టారు.
నాలుగోసారి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన చంద్రబాబు నాయుడు వయస్సు 75 సంవత్సరాలు. ఆయన 30 ఏళ్లుగా తెలుగు దేశం పార్టీ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. పదేళ్ళపాటు ప్రతిపక్ష నాయకుడిగా కూడా వ్యవహరించారు. సుమారు 16 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఆయన తన మామగారైన ఎన్టీ రామారావు నుండి ముఖ్యమంత్రి పదవిని, పార్టీ నాయకత్వాన్ని బలవంతంగా దక్కించుకున్నారు.
బిఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు వయస్సు 71 ఏళ్ళు. ఆయన పార్టీ ఆవిర్భావం నుండి అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. పదేళ్ళపాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వయస్సు 52 ఏళ్ళు. పార్టీ ఆవిర్భావం నుండి అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు.
సుదీర్ఘకాలం ఒడిశా ముఖ్యమంత్రిగా వ్యవహరించి, ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉంటున్న బిజెడి అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ వయస్సు 79 ఏళ్ళు. 1997లో బిజూ జనతా దళ్ పార్టీని స్థాపించినప్పటి నుండి అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. 24 ఏళ్లకు పైగా ముఖ్యమంత్రిగా కొనసాగారు. శివసేన ఒక వర్గం అధ్యక్షుడైన ఉద్ధవ్ థాకరే వయస్సు 65 ఏళ్ళు. ఆయన తండ్రి తర్వాత పార్టీ నాయకత్వాన్ని చేపట్టి, మధ్యలో రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. సిపిఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా వయస్సు 76 ఏళ్ళు. ఆరున్నరేళ్లుగా పార్టీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. గత మేలో సిపిఎం ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టిన ఎం ఎ బేబీ వయస్సు 71 ఏళ్ళు.

More Stories
సిడ్నీ ఉగ్రదాడిలో పాక్ సంతతి తండ్రి, కొడుకులు
ధర్మశాలలో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం
రేణిగుంట, మదనపల్లెలలో వాజ్‌పేయీ కాంస్య విగ్రహాలు