దేశంలో మావోయిస్టుల ప్రభావం బాగా తగ్గిపోయిందని, వారి ఆర్థిఖ మూలాలను కూడా దెబ్బతీశామని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. గడచిన 11 సంవత్సరాల కాలంలో పలు భద్రతా సంస్థలు మావోయిస్టులను ఆర్థికంగా దెబ్బతీశాయని, రూ.92 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయని, వారి సమాచార యుద్ధ వ్యవస్థలలోకి ప్రవేశించి వాటిని తీవ్రంగా నియంత్రించడం ద్వారా అర్బన్ నక్సల్స్కు నైతిక, మానసిక నష్టాన్ని కలిగించాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
‘ఎన్ఐఏలో మావోయిస్టులకు వ్యతిరేకంగా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడంతో అది రూ.40 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. రాష్ట్రాలు మరో రూ.40 కోట్లకు పైగా స్వాధీనం చేసుకున్నాయి. రూ.12 కోట్లను ఈడీ జప్తు చేసింది. ఏకకాలంలో తీసుకున్న చర్యల కారణంగా అర్బన్ నక్సల్స్ నైతికంగా, మానసికంగా నష్టపోయారు’ అని వివరించింది.
2014లో దేశంలో మావోయిస్టు ప్రభావానికి తీవ్రంగా గురైన జిల్లాలు 36 ఉండగా ఈ ఏడాది వాటి సంఖ్య మూడుకు తగ్గిందని కేంద్రం చెప్పింది. భద్రతా బలగాల ఆపరేషన్లలో ఈ ఏడాది ఇప్పటి వరకూ 317 మంది మావోయిస్టులు మరణించారని, 862 మంది అరెస్టయ్యారని, 1,973 మంది లంగిపోయారని పేర్కొంది. గత సంవత్సరం ఒక కేంద్ర కమిటీ సభ్యుడు, ఈ ఏడాది ఐదుగురు సహా మొత్తం 28 మంది కీలక మావోయిస్టు నేతలు లంగిపోవడమో, అరెస్టవడమో లేదా ఎన్కౌంటర్లలో చనిపోవడమో జరిగిందని వివరించింది.
‘ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్’లో 27 మంది మావోయిస్టులు చనిపోయారు. మే 23న బీజపూర్లో 24 మంది లంగిపోయారు. అక్టోబరులో ఛత్తీస్గఢ్, మహారాష్ట్రల్లో 258 మంది లంగిపోయారు. వీరిలో పది మంది సీనియర్ నేతలు. 2014లో దేశంలో మావోయిస్టు ప్రభావిత జిల్లాలు 126 ఉంటే ఇప్పుడు 11 మాత్రమే ఉన్నాయి. గత పది సంవత్సరాలలో పటిష్టవంతమైన పోలీస్ స్టేషన్ల సంఖ్య 66 నుంచి 586కు పెరిగింది.
దేశంలో తీవ్రవాద సంబంధమైన ఘటనల సంఖ్య తగ్గింది. 2013లో 76 జిల్లాల్లో 330 ఘటనలు నమోదు కాగా ఈ ఏడాది జూన్ నాటికి 22 జిల్లాల్లో 52 ఘటనలు నమోదయ్యాయి. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచేందుకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యల కారణంగా దేశంలో గడచిన 11 సంవత్సరాలలో నక్సల్స్ హింస 70 శాతం తగ్గింది’ అని ప్రభుత్వం ఆ ప్రకటనలో వివరించింది. 2026 మార్చి 31 నాటికల్లా దేశాన్ని మావోయిస్టు రహితంగా మార్చాలని గడువు నిర్దేశించుకున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదేపదే ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే.

More Stories
విమాన టికెట్ల ధరలను ఏడాది పొడువునా నియంత్రించలేం
‘పూజ్య బాపు’ పథకంగా ఉపాధి హామీ పథకం
నేపాల్లో జెన్జెడ్ నిరసనలతో 42 బిలియన్ డాలర్ల నష్టం