చైనా, భారత్ సంబంధాల్లో సానుకూల పురోగతి నెలకొందని ఉభయ పక్షాలు పేర్కొన్నాయి. ఇరు దేశాల విదేశాంగ శాఖల సీనియర్ అధికారులు బీజింగ్‌లో తాజాగా చర్చలు జరిపారు. ఆగస్టు మాసంలో ప్రధాని మోడీ, చైనా నేత జిన్‌పింగ్‌లు సమావేశమైన నేపథ్యంలో ఈ చర్చలు చోటు చేసుకున్నాయి. వారి సమావేశంలో కుదిరిన కీలకమైన ఉమ్మడి అవగాహనలను పూర్తి స్థాయిలో అమలు పరచడానికి ఇరు పక్షాలు నిబద్ధతను ప్రకటించాయి.
తూర్పు ఆసియా విదేశాంగ శాఖ జాయింట్ కార్యదర్శి సుజిత్ ఘోష్, చైనా విదేశాంగ శాఖలో ఆసియా వ్యవహారాల విభాగ డైరెక్టర్ జనరల్ లియూ జిన్‌సంగ్‌లు చర్చలు జరిపారని చైనా విదేశాంగ శాఖ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఈ చర్చలు నిర్మాణాత్మకమైనవి, ముందుచూపుతో కూడినవని భారత విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. రాబోయే సంవత్సరంలో ఉభయ పక్షాల మధ్య జరగాల్సిన కార్యకలాపాలు, పరస్పర మార్పిడులపై కూడా చర్చించారని తెలిపింది.
ఇరు దేశాల నేతల వ్యూహాత్మక మార్గనిర్దేశం ప్రాముఖ్యతను ఉభయ పక్షాలు ప్రముఖంగా పేర్కొన్నాయని ఆ ప్రకటన పేర్కొంది. ద్వైపాక్షిక సంబంధాల ను సుస్థిరీకరించడంలో, తిరిగి నిర్మించడంలో పురోగతిని సానుకూలంగా సమీక్షించారని పేర్కొంది. ఎగుమతుల నియంత్రణకు సంబంధించిన అపరిష్కృత అంశాలను సత్వరమే పరిష్కరించాల్సిన అవసరాన్ని భారత వర్గం నొక్కి చెప్పిందని విదేశాంగ శాఖ పేర్కొంది. పరస్పర ప్రయోజ నాలు కలిగిన ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలను కూడా ఇరు పక్షాలు చర్చించాయి.

More Stories
పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన యువ భారత్
జమ్మూ జైలు అంటేనే వణికిపోతున్న మసూద్ అజార్
సిడ్నీ బీచ్‌లో ఉగ్రదాడి- కాల్పుల్లో 12 మంది మృతి