* 90 పరుగుల తేడాతో ఘన విజయం
అండర్-19 ఆసియా కప్‌లో భారత్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో యువ భారత్ 90 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ భారత బౌలర్ల ధాటికి 41.2 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌటైంది.
హుజైఫా అహ్సన్ (70; 83 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) మాత్రమే రాణించగా, ఫర్హాన్ యూసుఫ్ (23), ఉస్మాన్ ఖాన్ (16) పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు తక్కువ స్కోరుకే ఫెవిలియన్ బాట పట్టారు. ఇక భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్ 3, చౌహాన్ 3, కిషన్ కుమార్ సింగ్ 2, ఖిలాన్ పటేల్, వైభవ్ సూర్యవంశీ ఒక్కో వికెట్ తీశారు.
కాగా, వర్షం కారణంగా మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన యువ భారత్ జట్టు 46.1 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. అరోన్ జార్జి (85 పరుగులు; 88 బంతుల్లో, 12×4, 1×6) హాఫ్ సెంచరీతో రాణించాడు. కాన్షిక్ చౌహాన్ (46 పరుగులు; 46 బంతుల్లో, 2×4, 3×6), కెప్టెన్ ఆయుష్ మాత్రే (38 పరుగులు; 25 బంతుల్లో, 4x 4, 3x 6) ఆకట్టుకున్నారు.
అభిజ్ఞాన్ కుందు (22 పరుగులు ; 32 బంతుల్లో, 1×4) పరుగులు చేశాడు.గత మ్యాచ్లో భారీ ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ సూర్యవంశీ (5) ఈ మ్యాచ్లో నిరాశ పర్చాడు. మిగతా బ్యాటర్లు విహాన్ మల్హోత్రా (12 పరుగులు), హేనిల్ పటేల్ (12 పరుగులు), వేదాంత్ త్రివేది (7 పరుగులు), ఖిలాన్ పటేల్ (6 పరుగులు), దీపేశ్ దేవేంద్రన్ (1 పరుగులు) స్వల్ప స్కోర్ తో వెనుదిరిగారు.
పాకిస్థాన్ బౌలర్లలో మహ్మద్ సయ్యమ్ 3, అబ్దుల్ సుభాన్, నికబ్ సాఫిక్ చెరో 2, అహ్మద్ హుస్సేన్, అలీ రజా తలో 1 వికెట్ పడగొట్టారు.కాగా, వర్షం కారణంగా టాస్ ఆలస్యం అయ్యింది. దీంతో మ్యాచ్ను ఇరుజట్లకు 49 ఓవర్లకు కుదించారు. దుబాయ్ ఐసీసీ అకాడమీ గ్రౌండ్ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది.
డిసెంబర్ 16న భారత్ తమ మూడో మ్యాచ్ లో మలేసియాను ఢీ కొట్టనుంది.
మరోసారి మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే పెవిలియన్ కు చేరుకున్నారు భారత ఆటగాళ్లు. పహల్గా ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆసియా కప్లో పాక్కు కరచాలనం చేయలేదు. తాజా మ్యాచ్ లో కూడా ఆటగాళ్లకు కరచాలనం చేయకుండా ఎంపైర్లకు మాత్రమే ఇచ్చి వెళ్లిపోయారు. అంతకుముందు టాస్ సమయంలోనూ ఇరు జట్ల కెప్టెన్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు.

More Stories
జమ్మూ జైలు అంటేనే వణికిపోతున్న మసూద్ అజార్
చైనా, భారత్ సంబంధాల్లో సానుకూల పురోగతి
సిడ్నీ బీచ్‌లో ఉగ్రదాడి- కాల్పుల్లో 12 మంది మృతి