చనిపోతానని తెలిసినా తూటాలకు ఎదురెళ్లిన సిడ్నీ హీరో!

చనిపోతానని తెలిసినా తూటాలకు ఎదురెళ్లిన సిడ్నీ హీరో!

సిడ్నీలో యూదులపై జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలకు తెగించి తూటాలకు ఎదురొడ్డి ఎంతోమంది ప్రాణాలు కాపాడిన అహ్మద్‌ అల్‌ అహ్మద్‌ను రియల్‌ హీరోగా ప్రజలు కొనియాడుతున్నారు. తాను చనిపోతున్నా అని తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో అని ఉగ్రవాదిపైకి దాడికి వెళ్లేముందు తన బంధువుతో అహ్మద్‌ చెప్పిన మాటలు ఆయనలోని ధైర్యానికి అద్దం పడుతున్నాయి. 

ప్రజల ప్రాణాలు కాపాడే క్రమంలో నేలకొరిగినా పర్వాలేదని ఉగ్రవాదిని అడ్డుకొని ఎంతో మంది ప్రాణాలును అహ్మద్‌ కాపాడారు. అల్‌ అహ్మద్‌ స్వదేశం సిరియా కాగా నిత్యం అంతర్యుద్ధంతో నలిగిపోయే ఆ దేశం వీడి భవిష్యత్తుపై కలలు కంటూ దశాబ్దం క్రితం ఆస్ట్రేలియాకు వలస వచ్చారు. కుటుంబంతో కలిసి దక్షిణ సిడ్నీలో సదర్లాండ్‌ షైర్‌కు వచ్చారు. స్థానికంగా ఓ పండ్ల దుకాణం పెట్టి కుటుంబాన్ని పోషిస్తున్నారు. 

ఉగ్రదాడి జరిగిన సమయంలో అహ్మద్‌ బోండి బీచ్‌లో తన బంధువు జోజీ అల్కాంజ్‌తో కలిసి కాఫీ షాప్‌లో ఉన్నారు. ఒక్కసారిగా కాల్పుల శబ్దాలు విని, వారు భయపడ్డారు. కాసేపటికి తేరుకున్న అహ్మద్‌ ఉగ్రవాదులను అడ్డుకోవాలని భావించారు. ఈ క్రమంలోనే తన ప్రాణాలు పోతాయని తెలిసినా ఆయన వెనకడుగు వేయలేదు. తాను చనిపోబోతున్నా అని తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో అని అల్కాంజ్‌తో అహ్మద్‌ చెప్పారు.

ఉగ్రవాదులను అడ్డుకునే క్రమంలో తనకేదైనా జరిగితే ఇతరులను కాపాడే క్రమంలో తను ప్రాణాలు కోల్పోయినట్టు కుటుంబానికి చెప్పమన్నారని అల్కాంజ్‌ మీడియాకు వివరించారు. అనంతరం చాటుగా వెళ్లిన అహ్మద్‌ కాల్పులు జరుపుతున్న ఉగ్రవాదుల్లో ఒకరి వద్దకు వెనక నుంచి వెళ్లి తుపాకీ లాక్కున్నారు.  ఆ వెంటనే ఉగ్రవాది అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

ఉగ్రవాదిని అడ్డుకునే సమయంలో తుపాకి తుటాలు తగిలి అహ్మద్‌ గాయపడగా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అహ్మద్‌ సాహసాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రశంసించారు. ఆయన ఎంతో ధైర్యంగా ఉగ్రవాదులకు ఎదురునిలిచారని అభినందించారు. ఆయన చేసిన పనికి చాలా గర్వపడుతున్నానని ట్రంప్‌ పేర్కొన్నారు. అహ్మద్‌ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.