ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం జోర్డాన్, ఇథియోపియా, ఒమాన్ దేశాల పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటనలో ఆయన ఆయా దేశాల అగ్ర నాయకులను కలిసి, వారితో భారతదేశ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయనున్నారు. సోమవారం, మంగళవారం జోర్డాన్‌లో పర్యటిస్తారు. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ సమస్యలపై కింగ్ అబ్దుల్లా-2 బిన్ అల్ హుస్సేన్‌తో చర్చించనున్నారు.
ప్రధాని జాఫర్ హస్సన్‌తో కూడా చర్చలు జరుపుతారు. రెండు దేశాల దౌత్య సంబంధాలు ఏర్పడి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ పర్యటన జరగనుంది. డిసెంబర్ 16, 17ల్లో తూర్పు ఆఫ్రికా దేశం ఇథియోపియాకు ప్రధాని వెళ్లనున్నారు. ఇథియోపియాలో ప్రధాని మోదీ తొలిసారి కాలుమోపనున్నారు. ఆ దేశ పార్లమెంటు ఉమ్మడి సమావేశంలో ప్రసంగిస్తారు.
అడిస్ అబాబాలో భారత్-ఇథియోపియా సంబంధాలను బలోపేతం చేయడంపై, గ్లోబల్ సౌత్‌తో విస్తృత భాగస్వామ్యంపై తన దార్శనికతను పంచుకుంటారు. అంతేకాకుండా ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్ అలీని కలిసి అక్కడి భారతీయ ప్రవాసులతో సమావేశం అవుతారు. అనంతరం డిసెంబర్ 17, 18 తేదీల్లోప్రధాని మోదీ ఒమన్‌లో పర్యటించనున్నారు.
ఈ పర్యటనలో ఒమన్‌తో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంటుందని భావిస్తున్నారు. ఇది భారత్, ఒమన్ మధ్య 70 ఏళ్ల దౌత్య సంబంధాలకు గుర్తుగా జరగనుంది. రాబోయే మూడు రోజుల్లో జోర్డాన్, ఇథియోపియా, ఒమన్‌కు వెళ్తున్నట్లు బయలుదేరే ముందు ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇవి భారత్‌తో ప్రాచీన నాగరిక, బలమైన ద్వైపాక్షిక సంబంధాలను కలిగి ఉన్న మూడు విలువైన భాగస్వామ్య దేశాలని తెలిపారు.

More Stories
రాహుల్, ఖర్గే పార్లమెంటులో క్షమాపణలు చెప్పాలి
ధర్మశాలలో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం
బంగ్లా వ్యతిరేక కార్యకలాపాలకు భారత్ అనుమతించదు