వాతావరణ మార్పులవల్ల ముంపునకు గురవుతున్న తమ పౌరులకు ‘గౌరవప్రదమైన వలస’ అవకాశం కల్పించాలని తువాలు చేసిన విజ్ఞప్తి మేరకు 2023లో ఆస్ట్రేలియాతో ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం తువాలు పౌరులకు ఆస్ట్రేలియా ప్రత్యేక వీసాలు జారీ చేస్తున్నది. ఆ వీసా ద్వారా వారు ఆస్ట్రేలియాలో నివసించవచ్చు, చదువుకోవచ్చు, పని చేసుకోవచ్చు. అర్హత సాధించిన వారికి ఆస్ట్రేలియా పౌరసత్వం కూడా లభిస్తుంది.
అంతేగాక ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన వెంటనే తువాలు వలసదారులకు విద్య, వైద్య బీమా (మెడికేర్), ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుబాటులోకి వస్తాయి. సుమారు 11 వేల జనాభా మాత్రమే ఉన్న తువాలు దేశం నుంచి ఈ ఏడాది జూన్లో వీసా దరఖాస్తులు ప్రారంభం కాగానే 3 వేల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. అయితే తువాలులో మేధోవలసను నివారించేందుకు ఏటా కేవలం 280 మందికి మాత్రమే వీసాలు జారీ చేయాలని నిర్ణయించారు.
ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ మాట్లాడుతూ వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రమవుతున్న వేళ తువాలు పౌరులకు ఆస్ట్రేలియాలో కొత్త జీవితం ప్రారంభించే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. మరోవైపు తమ దేశ సంస్కృతి, సంప్రదాయాలను ఎప్పటికీ మరిచిపోవద్దని వలస వెళ్తున్న పౌరులకు తువాలు ప్రధాని ఫెలెటి టియో సూచించారు. కాగా, వాతావరణ మార్పుల కారణంగా పసిఫిక్ ద్వీపదేశమైన తువాలు పూర్తిగా నీట మునిగినా, దాని సముద్ర జలాలపై యాజమాన్యాన్ని, ఒక దేశంగా గుర్తింపును నిలుపుకోవడానికి చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి సైమన్ కోఫే తెలిపారు.

More Stories
హెచ్-1బీ వీసా ఫీజు పెంపుపై 20 రాష్ట్రాల దావా
భారత్ పై 50 శాతం సుంకాలను ముగించాలని అమెరికాలో తీర్మానం!
నోబెల్ గ్రహీత నర్గెస్ మొహమ్మది అరెస్ట్