సిడ్నీ బీచ్‌లో ఉగ్రదాడి- కాల్పుల్లో 12 మంది మృతి

సిడ్నీ బీచ్‌లో ఉగ్రదాడి- కాల్పుల్లో 12 మంది మృతి
  * పోలీస్ కాల్పులలో పాకిస్తాన్ ఉగ్రవాది నవీద్ అక్రమ్ మృతి
ఆస్ట్రేలియాలో పర్యాటకులే లక్ష్యంగా ఇద్దరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 12మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. 29 మంది గాయపడ్డారు. వెంటనే స్పందించిన పోలీసులు దుండగులపై కాల్పులు జరపడంతో ఒకడు హతమయ్యాడు. మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో పాల్గొన్న ఇద్దరు ఉగ్రవాదులతో పొలిసు కాల్పులలో మృతి చెందిన నవీద్ అక్రమ్ పాకిస్థాన్‌కు చెందినవాడుగా గుర్తించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న ఉగ్రవాదిని గుర్తించాల్సి ఉంది. 
సిడ్నీ నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశమైన బాండీ బీచ్‌ లో ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు (అక్కడి కాలమానం ప్రకారం) ఈ కాల్పులు “ఇది హనుక్కా పండుగ మొదటి రోజున యూదు ఆస్ట్రేలియన్లపై జరిగిన ఒక లక్షిత దాడి… ఇది మన దేశ హృదయాన్ని తాకిన ఒక దుష్ట చర్య, యూదు వ్యతిరేకత, ఉగ్రవాదం,” అని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ వెల్లడించారు.  ఎనిమిది రోజుల పాటు కొనసాగే యూదుల హనుక్కా పండుగ తొలి రోజే ఈ దుర్ఘటన జరిగింది. 
 
ఆదివారం సాయంత్రం పర్యాటకులంతా ఉల్లాసంగా గడుపుతున్న సమయంలో బీచ్‌లోకి ఇద్దరు సాయుధులు ప్రవేశించారు. పర్యాటకులే లక్ష్యంగా ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డారు. దాంతో వందల మంది పర్యాటకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు.  కాల్పులు మొదలైన వెంటనే అక్కడున్నవారు నేలపై పడిపోవడం, దాక్కోవడం, కొందరు సముద్రం వైపు పరుగులు తీయడం వంటి దృశ్యాలు చోటుచేసుకున్నాయి.
 
గాయపడినవారిలో పర్యాటకులతో పాటు స్థానికులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో చిన్నారి సహా ఓ పోలీసు అధికారి ఉన్నట్లు ఆస్ట్రేలియా మీడియా పేర్కొంది. గాయపడిన 29 మందిని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరు పోలీసు అధికారులు ఉన్నారని వారి పరిస్థితి విషమంగా ఉందని న్యూ సౌత్ వేల్స్ పోలీసు కమిషనర్ తెలిపారు. నల్లటి దుస్తులు ధరించిన ఇద్దరు దుండగులు సర్ఫ్‌ క్లబ్‌ పక్కనే ఉన్న పాదచారుల వంతెనపైకి చేరుకొని కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.  
ఓ పర్యాటకుడు ఉగ్రవాదులపై తిరగబడి పదుల సంఖ్యలో ప్రాణాలు కాపాడి రియల్ హీరోగా మారిపోయాడు. కాల్పులు జరుపుతోన్న ఉగ్రవాదిని ఒట్టి చేతులతోనే ఎదిరించాడు. నిరాయుధుడైన అతడు అసమాన ధైర్యం ప్రదర్శించి ముష్కరుడి చేతులో తుపాకిని లాక్కుని, వాడిపైకే ఎక్కుపెట్టాడు. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కాగా.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది.
 
బాండీ బీచ్‌లో జరిగిన కాల్పుల ఘటనపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆయన, హింస, ద్వేషానికి ఆస్ట్రేలియాలో చోటులేదని స్పష్టం చేశారు. పోలీసులు, అత్యవసర ప్రతిస్పందన దళాలు సహాయక చర్యలు చేపడతున్నాయని చెప్పారు. ప్రజలు పోలీసుల సూచనలను పాటించాలని సూచించారు.
 
మరోవైపు ఆస్ట్రేలియాలోని బీచ్‌లో దుండగులు కాల్పులకు దిగి 11 మందిని పొట్టనపెట్టుకున్న ఘటనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. కాల్పుల్లో మరణించిన వారి కుటుంబాలకు ప్రధాని సంతాపం ప్రకటించారు. యూదుల పండగరోజు కాల్పులు జరగడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉగ్రవాదంపై భారత్‌ దశాబ్దాలుగా పోరాడుతోందని, ఉగ్ర దాడులు ఎక్కడ జరిగినా భారత్‌ ఖండిస్తుందని తెలిపారు.