పాకిస్థాన్ గూఢచర్య నెట్‌వర్క్‌తో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై భారత వైమానిక దళానికి చెందిన ఒక రిటైర్డ్ అధికారిని అసోం పోలీసులు అరెస్ట్ చేశారు. తేజ్‌పూర్‌లోని పాటియా ప్రాంతానికి చెందిన కులేంద్ర శర్మ దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేసినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు శుక్రవారం రాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
కొంత కాలంగా కులేంద్ర శర్మపై నిఘా పెట్టిన పోలీసులు, ప్రాథమిక విచారణ అనంతరం అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడు పాకిస్థాన్ గూఢచర్య సంస్థతో సంబంధాలున్న వ్యక్తులతో టచ్‌లో ఉంటూ, వారికి దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అతని మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకోగా అందులో కొన్ని అనుమానాస్పద ఆధారాలు లభించినట్లు సమాచారం. అందులోని కొంత డేటాను నిందితుడు డిలీట్ చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నట్లు తెలిసింది.నిందితుడు శర్మకు పాక్‌తో సంబంధాలున్నాయనే అనుమానాలు బలంగా ఉన్నాయని, అయినప్పటికీ దర్యాప్తు పూర్తయితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని సోనిత్పూర్ డీఎస్పీ హరిచరణ్ భూమిజ్ చెప్పారు.
కులేంద్ర శర్మ 2002లో పదవీ విరమణ పొందారు. అంతకుముందు సుఖోయ్ 30 యుద్ధ విమానాల స్క్వాడ్రన్ వంటి కీలక వనరులున్న తేజ్‌పూర్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో జూనియర్ వారెంట్ ఆఫీసర్‌గా పనిచేశారు. రిటైర్మెంట్ తర్వాత కొన్నాళ్లు తేజ్‌పూర్ యూనివర్సిటీలో కూడా విధులు నిర్వర్తించారు.

More Stories
సామూహిక అత్యాచార బాధితురాలి మృతితో మణిపూర్ లో ఉద్రిక్తత
బంగ్లా ఎన్నికల్లో హసీనా పార్టీని చేర్చకపోతే స్థిరత్వం అసాధ్యం
ఢిల్లీలో 24, 25 తేదీల్లో రెండో ప్రపంచ బౌద్ధ సదస్సు