భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆదివారం బీహార్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా ఉన్న నితిన్ నబిన్ (45)ను పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఈ పదవికి నబిన్‌ను ఎంపిక చేసింది. పూర్తిస్థాయి జాతీయ అధ్యక్షుడిని నియమించే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. “భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు బీహార్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నితిన్ నబిన్‌ను తక్షణమే అమల్లోకి వచ్చేలా భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించింది,” అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు.
జనవరి 2020లో మూడేళ్ళ పదవీకాలాన్ని బాధ్యతలు స్వీకరించిన ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దాదాపు ఆరేళ్ళు పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలతో సహా ముఖ్యమైన రాజకీయ ఘట్టాలలో పార్టీని నడిపించడానికి ఆయనకు పలుమార్లు పదవీకాల పొడిగింపులు ఇచ్చారు. బీజేపీ అగ్ర నాయకత్వం సంస్థాగత మార్పుల ప్రక్రియలో ఉన్న సమయంలో ఈ తాజా సంస్థాగత పునర్వ్యవస్థీకరణ జరిగింది. నితిన్ నబిన్ బీహార్‌కు చెందిన బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న సీనియర్ బీజేపీ నాయకుడు. పాట్నాలో జన్మించిన ఆయన, దివంగత నబిన్ కిషోర్ ప్రసాద్ సిన్హా కుమారుడు.
బీజేపీలో, కార్యనిర్వాహక అధ్యక్షుడు చివరికి పార్టీ అధ్యక్షుడిగా మారడం ఒక సంప్రదాయంగా ఉంది. అమిత్ షా కేంద్ర మంత్రివర్గంలో చేరిన తర్వాత పూర్తికాల అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు, జేపీ నడ్డానే మొదట కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులయ్యారు. లాంఛనంగా ఎన్నికైన తర్వాత, నితిన్ నబిన్ అతి పిన్న వయస్కుడైన బీజేపీ అధ్యక్షుడిగా కాగలరు. గతంలో 52 ఏళ్ల వయస్సులో అతి పిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా నిలిచిన నితిన్ గడ్కరీ రికార్డును ఆయన అధిగమిస్తారు.
ప్రధానమంత్రి నరేంద్ర అభినందిస్తూ నబిన్‌ను “కష్టపడి పనిచేసే కార్యకర్త” అని అభివర్ణించారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా నబిన్ నియామకాన్ని అభినందించడానికి ఫోన్ చేశారు. ప్రధానమంత్రి మోదీ నబిన్‌పై విశ్వాసం వ్యక్తం చేస్తూ “ఆయన యువకుడు, కష్టపడి పని చేయగల నాయకుడు, గొప్ప సంస్థాగత అనుభవం కలిగి ఉన్నాడు. బీహార్‌లో ఎమ్మెల్యేగా, మంత్రిగా అనేకసార్లు అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నాడు” అని కొనియాడారు.
“ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ఆయన శ్రద్ధగా పనిచేశారు. ఆయన వినయపూర్వకమైన స్వభావం, స్థిరమైన పని శైలికి ప్రసిద్ధి చెందారు. ఆయన శక్తి, అంకితభావం రాబోయే కాలంలో మన పార్టీని బలోపేతం చేస్తాయని నేను విశ్వసిస్తున్నాను. బిజెపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినందుకు ఆయనకు అభినందనలు” అని ప్రధాని మోదీ పోస్ట్‌లో పేర్కొన్నారు.
నబిన్ కిషోర్ ప్రసాద్ సిన్హా ఒక గౌరవనీయమైన బీజేపీ నాయకుడు. మాజీ ఎమ్మెల్యే. తన తండ్రి అకాల మరణం తర్వాత ఆయన క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించి, క్రమంగా తనకంటూ ఒక రాజకీయ గుర్తింపును ఏర్పరచుకున్నారు. పాట్నాలోని బాంకిపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నితిన్ నబిన్, రాష్ట్రంలో బీజేపీకి అత్యంత విశ్వసనీయ నాయకులలో ఒకరిగా పరిగణించబడతారు.
2006 ఉప ఎన్నికలో విజయం సాధించిన తర్వాత, ఆయన 2010, 2015, 2020, 2025లో వరుసగా నాలుగు అసెంబ్లీ ఎన్నికలలో గెలుపొందారు. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో, నబిన్ బాంకిపూర్ నియోజకవర్గం నుండి తన సమీప ప్రత్యర్థిపై 51,000 ఓట్లకు పైగా మెజారిటీతో నిర్ణయాత్మక విజయం సాధించారు. ఆయన పదేపదే సాధించిన ఎన్నికల విజయాలు పార్టీలో ఆయన స్థానాన్ని మరింత బలోపేతం చేశాయి.
ప్రస్తుతం, నబిన్ బీహార్‌లోని నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో రహదారుల నిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జేడీ(యూ)తో బీజేపీ పొత్తును నిర్వహించడంలో, ఎన్డీఏ ఎన్నికల విజయాలకు దోహదపడటంలో నబిన్ కీలక పాత్ర పోషించారని విస్తృతంగా ప్రశంసలు అందుకున్నారు. భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) జాతీయ ప్రధాన కార్యదర్శిగా జమ్మూ కాశ్మీర్‌లో జాతీయ ఐక్యతా యాత్ర, 1965 నాటి అమరవీరుల కోసం గౌహతి నుండి తవాంగ్ వరకు నివాళి యాత్రతో సహా వివిధ యువజన ఉద్యమాలలో నబిన్ చురుకుగా పాల్గొన్నారు. నబిన్ సిక్కింకు బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా, ఛత్తీస్‌గఢ్‌కు సహ-ఇన్‌ఛార్జ్‌గా కూడా పనిచేశారు.

More Stories
సిడ్నీ బీచ్‌లో ఉగ్రదాడి- కాల్పుల్లో 12 మంది మృతి
శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఐఎస్ఐ నుంచి ముప్పు
కామ్రేడ్ల కంచుకోటలో కమల వికాసం