దక్షిణాఫ్రికాలో కుప్పకూలిన అహోబిలం ఆలయం.. నలుగురు దుర్మరణం

దక్షిణాఫ్రికాలో కుప్పకూలిన అహోబిలం ఆలయం.. నలుగురు దుర్మరణం
దక్షిణాఫ్రికాలో కొత్తగా నిర్మిస్తున్న న్యూ అహోబిలం ఆలయంకుప్పకూలింది. ఆ దేశంలోని డర్బన్‌ నగరం సమీపంలోని ఓ పట్టణంలో నిర్మాణంలో నాలుగంతస్తుల న్యూ అహోబిలం ఆలయం శుక్రవారం కూలిపోయిందని అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు.  మృతుల్లో భారత సంతతికి చెందిన 52 ఏళ్ల వ్యక్తి కూడా ఉన్నారు.
క్వాజులు-నటాల్ ప్రావిన్స్‌లో ఇథెక్విని మున్సిపాలిటీ శివార్లలోని రెడ్ క్లిఫ్ పట్టణంలో ఉన్న ఓ కొండపై న్యూ అహోబిలం ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈక్రమంలో శుక్రవారం రోజు భవనంలోని ఓ భాగం అకస్మాత్తుగా కుప్పకూలింది.  ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు, పలువురు ఆలయ అధికారులు విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతికూల వాతావరణం కారణంగా ఆటంకాలు ఎదురవుతుండటంతో శనివారం సహాయక చర్యలు నిలిపివేశారు.

టన్నులకొద్దీ శిథిలాలు ఉండటంతో వాటిని తొలగించడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని అధికారులు తెలిపారు. ప్రమాదంలో మరణించిన భారత సంతతి వ్యక్తిని ఆలయ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు, నిర్మాణ ప్రాజెక్టు మేనేజర్ విక్కీ జైరాజ్ పాండేగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దాదాపు రెండేళ్లుగా ఆయన ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు. క్వాజులు-నటాల్ ప్రావిన్స్‌లో ఇథెక్విని మున్సిపాలిటీ శివార్లలోని రెడ్ క్లిఫ్ పట్టణంలో ఉన్న ఓ కొండపై న్యూ అహోబిలం ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

“శుక్రవారం రోజు ఆలయం కూలిన వెంటనే రెస్క్యూ టీమ్‌కు ఒక అత్యవసర ఫోన్ కాల్ వచ్చింది. తాను ఆలయం శిథిలాల కింద చిక్కుకున్నాను కాపాడాలంటూ ఓ వ్యక్తి కాల్ చేసి చెప్పాడు. దీంతో హుటాహుటిన అక్కడికి రెస్క్యూ టీమ్‌లు చేరుకున్నాయి. శుక్ర, శనివారాల్లో రెస్క్యూ టీమ్స్ చాలా చురుగ్గా పనిచేశాయి. న్యూ అహోబిలం ఆలయ శిథిలాల కింద ఉన్న నాలుగు మృతదేహాలను బయటికి తీశాయి. అయితే శనివారం మధ్యాహ్నం తర్వాత వాతావరణం ప్రతికూలంగా మారింది. దీనివల్ల రెస్క్యూ టీమ్స్ పనికి తాత్కాలిక ఆటంకం కలిగింది. వాతావరణం మళ్లీ అనుకూలించగానే రెస్క్యూ వర్క్స్ మొదలవుతాయి. శిథిలాల కింద ఇంకా ఎన్ని డెడ్‌బాడీస్ ఉన్నాయి అనేది ఇప్పుడే కచ్చితంగా చెప్పలేం” అని రెస్క్యూ టీమ్‌లకు చెందిన రియాక్షన్ యూనిట్ అధికార ప్రతినిధి ప్రేమ్ బలరాం వెల్లడించారు.

రెడ్ క్లిఫ్ పట్టణంలో న్యూ అహోబిలం ఆలయాన్ని గుహ ఆకారంలో నిర్మిస్తున్నారు. ఇందుకోసం భారత్ నుంచి అక్కడికి ప్రత్యేక బండరాళ్లను తీసుకెళ్లారు. నరసింహ స్వామి భారీ ప్రతిమతో ఈ ఆలయాన్ని అందంగా, ఆకట్టుకునేలా నిర్మించాలని ఆలయ కమిటీ ప్లాన్ చేసింది. ఆలయ నిర్మాణ పనులు చేస్తున్న శిల్పుల కుటుంబీకులు ఈవివరాలను స్థానిక మీడియాకు వెల్లడించారు.