పశ్చిమ బెంగాల్‌లో 58 లక్షల ఓట్ల తొలగింపు

పశ్చిమ బెంగాల్‌లో 58 లక్షల ఓట్ల తొలగింపు
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్‌) తొలి దశలో పశ్చిమ బెంగాల్ మొత్తంమ్మీద 58 లక్షలకుపైగా ఓటర్ల పేర్లను జాబితాల నుంచి ఎన్నికల కమిషన్ తొలగించింది. ఎన్యూమరేషన్‌ పత్రాల సమర్పణకు గురువారం చివరిరోజు కాగా, మరుసటి రోజునే తొలగించిన ఓటర్ల వివరాలు వెల్లడయ్యాయి.  ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న కోల్‌కతా నగరంలోని భబానీపూర్‌ నియోజవర్గంలో 44,787 ఓట్లను తొలగించింది.
ఈ నియోజవర్గంలో జనవరి నాటికి 1,61,509 మంది ఓటర్లు నమోదు కాగా, ప్రస్తుతం వారిలో చెప్పుకోదగ్గ సంఖ్యలోనే పేర్లను తొలగించింది. మరణాలు, ఓటర్లు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడం, డూప్లికేట్‌ ఓట్లు ఉండడం వంటి కార ణాలను ఎన్నికల కమిషన్‌ చూపించింది. ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి ప్రాతినిధ్యం వహిస్తు న్న నందిగ్రాం నియోజకవర్గంలో 2,78,212 మంది ఓటర్లు నమోదు కాగా, వారిలో 10,599 మంది పేర్లను తొలగించింది.
తృణమూల్‌కు స్థావరాల్లాంటి చౌరింగీ సెగ్మెంట్‌లో అత్యధికంగా 74,553 ఓట్లు, కోల్‌కతా పోర్టు నియోజకవర్గంలో 63,730 మంది పేర్లను టాలీగంజ్‌లో 35,309 మంది పేర్లను అధికార్లు తొలగించారు.  బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న అసన్‌ సోల్‌ సౌత్‌లో 39,202, సిలిగురిల్లో 31,181 మంది పేర్లు తొలగించారు. జిల్లాల వారీగా విశ్లేషిస్తే దక్షిణ 24 పరగణాల జిల్లాలో అత్యధికంగా 8,16,047మంది ఓటర్లను అధికారులు తొలగించారు.
తృణమూల్‌కు కంచుకోటలాంటి ఈ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మమత మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ గత ఎన్నికల్లో 7 లక్షల మెజార్టీలో విజయం సాధించడం విశేషం.  అత్యల్పంగా బంకురా జిల్లాలోని కొతుల్‌పూర్‌ నియోజకవర్గంలో కేవలం 5,678 ఓట్లను మాత్రమే తీసివేశారు. వలసవచ్చిన వారి సంఖ్య అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా తొలగింపులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 16న ముసాయిదా ఓటర్ల జాబితాలను ఈసీ విడుదల చేయనుంది. ఎంతమందిని తొలగించారు, ఎంత మందిని చేర్చారన్న సమాచారం వాటి ద్వారా వెల్లడి కానుంది.
 
కాగా, ‘సర్‌’ నిర్వహించనున్న ఎనిమిది రాష్ట్రాలకు ఎన్నికల కమిషన్‌ పరిశీలకులను నియమించింది. ‘ప్రత్యేక జాబితా పరిశీలకుడు’ (స్పెషల్‌ రోల్‌ అబ్జర్వ ర్‌- ఎస్‌ఓఆర్‌) పేరుతో శుక్రవారం వీరిని ఎంపిక చేసింది. పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, ఛత్తీ్‌సగఢ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో జరిగే ‘సర్‌’ను వారు పర్యవేక్షించనున్నారు. వారానికి రెండు రోజుల పాటు సంబంధిత రాష్ట్రాలకు వెళ్లి జిల్లా అధికారులు, రాజకీయ పార్టీల నాయకులను కలిసి సమన్వయం చేయనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఓటర్ల తుది జాబితా ప్రచురించే వరకు వారు ఈ విధుల్లో ఉండనున్నారు.