భారత్, చైనా, రష్యా, జపాన్ లతో ట్రంప్ సి-5 ఏర్పాటు!

భారత్, చైనా, రష్యా, జపాన్ లతో ట్రంప్ సి-5 ఏర్పాటు!
రెండోసారి అధికారంలోకి వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పటికే పలు దేశాలపై అధిక టారిఫ్‌లు, వలసలు, హెచ్‌1బీ వీసా వంటి వాటిపై కఠిన నిబంధనలను అమల్లోకి తేవడం ద్వారా కలకలం రేపుతుండగా, తాజాగా ప్రపంచ రాజకీయాల్లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టే ప్రయత్నంలో ట్రంప్‌ ఉన్నట్లు తెలుస్తోంది.  భారత్‌తో కలిసి ఓ శక్తిమంతమైన కూటమిని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది.
సి5 లేదా కోర్‌ 5 పేరుతో ఈ కూటమిని ఏర్పాటు చేయనున్నట్లు అమెరికా మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే ఉన్న జీ7 కూటమి లానే సీ5ని తెరపైకి తెచ్చే యోచనలో ట్రంప్‌ ఉన్నట్లు సదరు కథనాలు వెల్లడిస్తున్నాయి.  అమెరికన్ మీడియా సంస్థ ‘పొలిటికో’ ఈ మేరకు ఒక కథనాన్ని ప్రచురించింది. అత్యధిక జనాభాగల దేశాలైన అమెరికా, భారత్‌, రష్యా, చైనా, జపాన్‌లతో ఈ సీ5 కూటమిని ఏర్పాటు చేసే యోచనలో ట్రంప్‌ ఉన్నట్లు సదరు కథనం పేర్కొంది.
సంపద, ప్రజాస్వామ్య పాలన వంటి జీ7 నిబంధనలతో సంబంధం లేకుండా, ప్రపంచంలోని ప్రధాన సైనిక, ఆర్థిక, జనాభా శక్తిగా ఉన్న దేశాలతో ఈ కొత్త కూటమిని ఏర్పాటు చేయాలన్నది ట్రంప్‌ ఆలోచనగా తెలుస్తోంది. అయితే, ఈ కొత్త కూటమిలో ఐరోపా దేశాలకు చోటు లేకపోవడం గమనార్హం. మరోవైపు ఈ కథనాలను వైట్‌హౌస్‌ ఖండించింది. అలాంటి ప్రతిపాదన ఏమీ లేదని ప్రెస్ సెక్రటరీ హన్నా కెల్లీ స్పష్టం చేశారు. కానీ, జాతీయ భద్రతా నిపుణులు మాత్రం ఇది ట్రంప్ మార్క్ ఆలోచనేనని చెబుతున్నారు. 
సి5ని అమెరికా వ్యూహాత్మక ఆలోచనకు అనుగుణంగా ఉండే అవకాశం ఉందంటున్నారు. ట్రంప్‌ తలచుకుంటే ఏదైనా సాధ్యమే అంటూ చెబుతున్నారు. ఇప్పటికే ప్రపంచ అగ్రరాజ్యాలు, సంపన్న దేశాలతో ‘జీ7’ కూటమి ఉంది. అమెరికా, ఐరోపా దేశాలతో ‘నాటో’ కూటమి ఉంది. ఈ రెండు కూటములపైనా ఐరోపా దేశాల ప్రభావం ఎక్కువగా ఉంది. మారుతున్న అంతర్జాతీయ సమీకరణాల నేపథ్యంలో ఐరోపా దేశాల ప్రభావం నుంచి బయటికొచ్చే ప్రయత్నాలను అమెరికా మొదలుపెట్టింది.
 
ఈక్రమంలోనే భారీ జనాభా, అత్యాధునిక సైనిక సంపత్తి, భౌగోళిక ప్రాధాన్యత, అతిపెద్ద వాణిజ్య మార్కెట్ కలిగిన అతి ముఖ్యమైన దేశాలతో ఒక కొత్త కూటమిని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ సర్కారు రూపొందించిన ‘జాతీయ భద్రతా వ్యూహం’ ముసాయిదా ప్రతుల్లో సీ5 కూటమి ఏర్పాటు ప్రతిపాదన ఉందని అమెరికా మీడియా పేర్కొంది.

రష్యా లాంటి శత్రు దేశాన్ని కలుపుకొని అమెరికా కూటమిని ఏర్పాటు చేయడం అసాధారణ అంశంగా కనిపిస్తున్నప్పటికీ, అది షాకింగ్ విషయమేం కాదని అమెరికా మీడియా కథనాల్లో విశ్లేషించారు. సైద్ధాంతికంగా చైనా, రష్యాలతో అమెరికాకు పొసగదు. అయినప్పటికీ సీ5 కూటమిలో ఈ రెండు దేశాలు ఉండాలని అగ్రరాజ్యం కోరుకుంటోందట. తద్వారా ఆయా దేశాలతోనూ దౌత్య సంబంధాలను బలోపేతం చేసుకోవచ్చని ట్రంప్ సర్కారు భావిస్తోంది. 
 
అంతర్జాతీయ స్థాయి సున్నిత అంశాల్లో తాము సత్వర ఫలితాలను సాధించేందుకు సీ5 కూటమి ఉపయోగపడుతుందని అమెరికా అంచనా వేస్తోంది. సున్నిత అంశాలపై వీలైనంత త్వరగా భారత్, చైనా, రష్యా, జపాన్‌ దేశాల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఈ కూటమి వేదికగా ఉపయోగపడుతుందని కోరుకుంటోంది.
 
భారత్, చైనాల్లో చెరో 142 కోట్లకుపైగా జనాభా ఉండగా, అమెరికాలో 34 కోట్లు, రష్యాలో 14 కోట్లు, జపాన్‌‌లో 12 కోట్ల జనాభా ఉంది. ఈ దేశాలు వ్యూహాత్మకంగా యావత్ ప్రపంచానికి చాలా కీలకమైనవి. చాలావరకు ప్రపంచ దేశాలు వీటిలో ఏదో ఒక దేశంతో వ్యూహాత్మక వాణిజ్య, సైనిక, ఆర్థిక సంబంధాలను కలిగి ఉన్నాయి. అందుకే సీ5 కూటమి ఏర్పాటు తమకూ ప్రయోజనకరంగానే ఉంటుందని అమెరికా ఆశిస్తోంది.