ఐక్యూఎయిర్ విడుదల చేసే వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ర్యాంకింగ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)కు చెందిన గ్లోబల్ ఎయిర్ క్వాలిటీ డాటాబేస్, ఎన్విరాన్‌మెంటల్ పర్ఫామెన్స్ ఇండెక్స్, గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ వంటి సంస్థలు ఇచ్చే నివేదికలను భారత ప్రభుత్వం ఎలా పరిగణిస్తోందని రాజ్యసభలో విపక్షాలు అడిగిన ప్రశ్నకు పైవిధంగా కేంద్రం బదులిచ్చింది. ప్రపంచ దేశాలు తమతమ స్థానిక అవసరాలు, భౌగోళిక, పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా గాలి నాణ్యతా ప్రమాణాలకు రూపకల్పన చేసుకునేందుకు డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక సహాయకారిగా ఉంటుందే తప్ప, అదే ప్రామాణికంగా మారదని భారత సర్కారు పేర్కొంది.
దేశంలో ప్రజారోగ్యం, పర్యావరణ నాణ్యతల పరిరక్షణ కోసం 12 కీలక కాలుష్య కారకాలను కట్టడి చేయాలనే అంశంపై ఇప్పటికే నేషనల్ ఆంబియెంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ (ఎన్‌ఏఏక్యూఎస్) సంస్థకు మార్గదర్శకాలను జారీచేశామని కేంద్రం వెల్లడించింది. ఏటా భారత్‌లో నిర్వహించే స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ ద్వారా గాలి నాణ్యతపై ప్రభుత్వం నిర్దిష్ట అంచనాకు వస్తుంటుందని తెలిపింది.
నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (ఎన్‌సీఏపీ)లో భాగంగా గాలి నాణ్యతను పెంచేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న 130 నగరాలు, పట్టణాలకు స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ ద్వారా ర్యాంకింగ్స్‌ను కేటాయిస్తామని పేర్కొంది. స్విట్జర్లాండ్‌కు చెందిన గాలి నాణ్యతా పర్యవేక్షణ సంస్థ ఐక్యూఎయిర్ ఈ ఏడాది మార్చిలో ఓ కీలక నివేదికను విడుదల చేసింది. గాలి నాణ్యత పరిరక్షణ చర్యలపై 2024లో డబ్ల్యూహెచ్‌ఓ జారీచేసిన మార్గదర్శకాల అమలులో భారత్ విఫలమైందని ఆ నివేదికలో ప్రస్తావించారు.
వాయు కాలుష్యం వల్ల తీవ్రమైన పొగమంచు సమస్యను ఎదుర్కొంటున్న ప్రపంచ దేశాల జాబితాలో భారత్‌కు 5వ ర్యాంకును ఐక్యూఎయిర్ ఇచ్చింది. ప్రపంచంలోని అత్యంత కాలుష్యమయ 20 నగరాల్లో 13 భారత్‌లోనే ఉన్నాయని ప్రకటించింది. ఈ జాబితాలో నంబర్ 1 స్థానంలో అసోంలోని బైర్నిహట్ పట్టణం నిలిచింది. ప్రపంచంలోని అత్యంత కాలుష్యమయ రాజధాని నగరాల్లో నంబర్ 1 స్థానంలో ఢిల్లీ నిలిచింది. గత కొన్ని నెలల వ్యవధిలో ఢిల్లీలో గాలి నాణ్యత దారుణంగా తగ్గిపోయింది.
భారత రాజధాని ప్రజలు వాయు కాలుష్యం అనే పెనుసవాల్‌ను ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు. ఈ నివేదిక వెలువడిన నేపథ్యంలో తాజాగా ఇప్పుడు పార్లమెంటులో భారత ప్రభుత్వం చేసిన ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

More Stories
5 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతానికి ఎస్ఐఆర్ గడువు పొడిగింపు
సోషల్ మీడియా తనిఖీలతో హెచ్-1బి వీసా ఇంటర్వ్యూలు వాయిదా
యునెస్కో వారసత్వ జాబితాలో దీపావళి