మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్ఆర్ ఈజిఎ) పేరును ‘పూజ్య బాపు గ్రామీణ్ రోజ్‌గార్ యోజన’గా మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ అధ‍్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ దీనికి ఆమోదం తెలిపింది. పనిదినాల సంఖ్యను 100 నుంచి 125 రోజులకు, ఒక రోజుకు ఇచ్చే కనీస వేతనాన్ని 240కి పెంచింది.
అయితే ద్రవ్యోల్బణంలో వ్యత్యాసం కారణంగా ఆయా రాష్ట్రాల వారీగా కనీస వేతనాల్లో మార్పులు ఉండొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు ఒక సంవత్సరంలో కనీసం 100 రోజులు ఉపాధి కల్పించడమే ఈ పథకం లక్ష్యం. దీని ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగు పరచడం, గ్రామీణ ప్రాంతాల్లో సుస్థిర ఆస్తుల కల్పన, వనరుల ఉత్పాదకత, అభివృద్ధి లక్ష్యాలుగా 2006లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.
తర్వాత దానిని మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా పేరు మార్చారు. ఇప్పుడు మరోసారి ఆ పేరు మార్పునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపడం గమనార్హం. మరోవంక, కేంద్ర కేబినెట్ ఇకపై బీమారంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) బిల్లుకు పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం సాధారణ, జీవిత, ఆరోగ్య బీమాలో 74 శాతం వరకు మాత్రమే ఎఫ్‌డీఐలను అనుమతిస్తుండడం గమనార్హం.
బీమా రంగంలోకి ఎఫ్‌డీఐలకు పూర్తిగా అనుమతినిస్తే, దేశీయ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది. అంతేకాదు 100 శాతం ఎఫ్‌డీఐకి అనుమతిస్తే, విదేశీ సంస్థలు భారతీయ కంపెనీలపై ఆధారపడకుండా సొంతంగా పనిచేయడానికి వీలు అవుతుందని, దీనివల్ల ఈ రంగానికి మేలు జరిగే అవకాశాలున్నాయని అంచనా వేస్తోంది. మరోవైపు పౌర అణు విద్యుత్ రంగంలో కూడా ప్రైవేటు భాగస్వామ్యానికి ఉద్దేశించిన బిల్లుకు కేంద్ర కేబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది.

More Stories
విమాన టికెట్ల ధరలను ఏడాది పొడువునా నియంత్రించలేం
నేపాల్‌లో జెన్‌జెడ్ నిరసనలతో 42 బిలియన్ డాలర్ల నష్టం
నలుగురు ఇండిగో అధికారులు సస్పెండ్