ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2027 జనాభా లెక్కల నిర్వహణ కోసం రూ.11,718 కోట్ల బడ్జెట్ను ఆమోదించింది. 2026-27ల్లో దేశవ్యాప్తంగా 2 దశల్లో జనగణన జరుగుతుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం తెలిపారు. వాస్తవానికి 2021లోనే జనగణన జరగాల్సి ఉంది. కానీ ఆనాడు రోనా మహమ్మారి విజృంభించడంతో జనాభా లెక్కల సేకరణను వాయిదా వేశారు.
ఈ నేపథ్యంలో తదుపరి జనగణన 2027లో జరుగుతుందని కేంద్రం వెల్లడించింది. 2027 మార్చి 1ని రిఫరెన్స్ తేదీగా నిర్ణయించింది. భారతదేశంలో 150 ఏళ్లకు పైగా జనాభా లెక్కల సేకరణ జరుగుతోంది. అందుకు సంబంధించిన రికార్డులు అన్నీ మన వద్ద ఉన్నాయని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దానికి కొనసాగింపుగా 2027 జనగణన చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
మొత్తంగా చూసుకుంటే ఈ జనగణన భారత్లో 16వది అవుతుంది. స్వతంత్ర్యం వచ్చిన తర్వాత అయితే 8వది అవుతుంది. ఈ జనగణనలో దేశంలోని మొత్తం జనాభా, గృహాలు, సౌకర్యాలు, విద్య, ఆర్థిక కార్యకలాపాలు, వలసలు లాంటి అనేక అంశాల డేటాను సేకరించనున్నారు. వార్డు, గ్రామం, పట్టణం స్థాయిల్లో ఈ జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. 1948 జనాభా లెక్కల చట్టం, 1990 జనాభా లెక్కల నియమాల ఆధారంగా ఈ సెన్సెస్-2027 జరగనుంది.
2025 జూన్ 16న విడుదల చేసిన గెజిట్ ప్రకారం, ఈ జనగణన మొత్తం 2 దశల్లో నిర్వహించనున్నారు. మొదటి దశ 2026 ఏప్రిల్- సెప్టెంబర్ మధ్య జరుగుతుంది. ఆయా రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల సౌలభ్యాన్ని అనుసరించి 30 రోజుల వ్యవధిలో ఇది నిర్వహించబడుతుంది. ఈ దశలో హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సెస్ నిర్వహిస్తారు. రెండో దశ 2027 ఫిబ్రవరిలో జరుగుతుంది. ఈ దశలో జనాభా గణన చేస్తారు. అయితే లద్ధాఖ్, జమ్మూకశ్మీర్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్ లాంటి మంచు ప్రాంతాల్లో, అక్కడి వాతావరణ పరిస్థితులను బట్టి 2026 సెప్టెంబర్లో జనాభా లెక్కల సేకరణ చేస్తారు.
భారత్లో మొదటిసారిగా పూర్తి డిజిటల్ పద్ధతిలో జన గణన చేయనున్నారు. మొబైల్ అప్లికేషన్స్ (ఆండ్రాయిడ్, ఐఓఎస్) ద్వారా డేటాను సేకరించి, దానిని మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (సిఎంఎంఎస్) పోర్టల్ ద్వారా రియల్ టైమ్లో పర్యవేక్షించనున్నారు. ప్రజలు స్వయంగా ఎన్యూమరేషన్ చేసుకోవడం కోసం, హౌస్లిస్టింగ్ కోసం ప్రత్యేక టూల్స్ (హౌస్లిస్టింగ్ బ్లాక్ క్రియేటర్ వెబ్ మ్యాప్ టూల్)ను కూడా ప్రవేశపెడుతున్నారు.
ఈ జనాభా లెక్కల సేకరణలో భాగంగానే కుల గణన కూడా చేయాలని గతంలో రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయించింది. అందువల్ల ఈసారి కులాల డేటాను కూడా ఎలక్ట్రానిక్ పద్ధతిలో సేకరించనున్నారు. స్వతంత్ర భారతదేశంలో ఇలా కుల గణన చేపట్టడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

More Stories
చైనా వృత్తి నిపుణులకు వీసాల జారీ వేగవంతం
రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్న వినేశ్ ఫొగాట్
తిరువనంతపురం, కోచి, కన్నూర్, త్రిసూర్ లలో హంగ్ మున్సిపాలిటీలు!