భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌లో 50 వార్డులను గెలుచుకుని చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.గత 45 ఏళ్లుగా అధికారంలో ఉన్న వామపక్ష ప్రజాస్వామ్య కూటమి (ఎల్‌డిఎఫ్) కేవలం 29 స్థానాలకే పరిమితం కాగా, కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్) 19 వార్డులను కైవసం చేసుకుంది.
కేరళ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఇసి) ప్రకారం, రెండు వార్డులను స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలుచుకున్నారు.కేరళలో తొలి మహిళా ఐపిఎస్ అధికారి అయిన మాజీ డీజీపీ, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలు ఆర్ శ్రీలేఖ 41వ వార్డు నుండి విజయం సాధించారు. కేరళ రాజధాని నగరంలో బీజేపీ తరపున తొలి మేయర్‌గా ఆమె నియమితులయ్యే అవకాశం ఉంది.పట్టణ నియోజకవర్గాల నుండి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీ తన సన్నాహాలను ముమ్మరం చేస్తున్న తరుణంలో, రాష్ట్ర రాజధానిలోని కార్పొరేషన్‌ను కైవసం చేసుకోవడం ఆ పార్టీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
తిరువనంతపురంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ చారిత్రాత్మక కార్పొరేషన్ విజయాన్ని నమోదు చేసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.తిరువనంతపురం కార్పొరేషన్‌లో బీజేపీ-ఎన్డీఏకు లభించిన ఈ తీర్పు కేరళ రాజకీయాల్లో ఒక కీలక మలుపు అని ఆయన పేర్కొన్నారు.ఎక్స్ పోస్ట్‌లో ప్రధాని మోదీ ఇలా చెప్పారు:
“తిరువనంతపురానికి ధన్యవాదాలు! తిరువనంతపురం కార్పొరేషన్‌లో బీజేపీ-ఎన్డీఏకు లభించిన ఈ తీర్పు కేరళ రాజకీయాల్లో ఒక కీలక మలుపు. రాష్ట్ర అభివృద్ధి ఆకాంక్షలను మా పార్టీ మాత్రమే నెరవేర్చగలదని ప్రజలు దృఢంగా విశ్వసిస్తున్నారు. మా పార్టీ ఈ శక్తివంతమైన నగరం యొక్క అభివృద్ధికి కృషి చేస్తుంది మరియు ప్రజల జీవన సౌలభ్యాన్ని పెంచుతుంది.”
“తిరువనంతపురం కార్పొరేషన్‌లో అద్భుతమైన ఫలితాన్ని సాధించేందుకు ప్రజల మధ్య కష్టపడి పనిచేసిన బీజేపీ కార్యకర్తలందరికీ నా కృతజ్ఞతలు. కేరళలో క్షేత్రస్థాయిలో పనిచేసి, నేటి ఫలితం వాస్తవరూపం దాల్చేలా చేసిన తరతరాల కార్యకర్తల కృషిని, త్యాగాలను గుర్తుచేసుకోవాల్సిన రోజు ఇది. మా కార్యకర్తలే మా బలం, మేము వారిని చూసి గర్విస్తున్నాము!”
ఇదిలా ఉండగా, వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరితో పాటు కేరళలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ఫలితాలు ఎల్‌డిఎఫ్‌కు భారీ ఎదురుదెబ్బ. తాజా ట్రెండ్‌ల ప్రకారం, రాష్ట్రంలోని ఆరు కార్పొరేషన్లలో, కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ నాలుగు చోట్ల ముందంజలో ఉండగా, 2020లో ఐదు కార్పొరేషన్లలో అధికారాన్ని చేజిక్కించుకున్న వామపక్ష కూటమి కేవలం కోజికోడ్‌లో మాత్రమే ఆధిక్యంలో ఉంది.
2020 ఎన్నికల్లో, యుడిఎఫ్ కేవలం కన్నూర్ కార్పొరేషన్‌ను మాత్రమే గెలుచుకోగలిగింది. మున్సిపాలిటీల విషయానికొస్తే, ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న తాజా సమాచారం ప్రకారం, యుడిఎఫ్ 55 చోట్ల, ఎల్‌డిఎఫ్ 27 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. ఎన్‌డిఎ రెండు మున్సిపాలిటీలలో ఆధిక్యంలో ఉంది.బ్లాక్ పంచాయతీల ఎన్నికల్లో, ప్రతిపక్ష కూటమి 82 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇది అధికార కూటమి కంటే పదిహేడు ఎక్కువ. కాగా, ఎన్‌డిఎ ఐదు చోట్ల ఆధిక్యంలో ఉంది.గ్రామ పంచాయతీలలో, యుడిఎఫ్ 453, ఎల్‌డిఎఫ్ 372 మరియు ఎన్‌డిఎ 24 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి.
కాగా, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ కేరళ స్థానిక సంస్థల ఎన్నికలలో, ముఖ్యంగా తిరువనంతపురంలో బిజెపి విజయాన్ని అభినందిస్తూ ప్రజల తీర్పును గౌరవించాలని పేర్కొన్నారు.ఎక్స్‌లో ఒక సుదీర్ఘ పోస్ట్‌లో, ఆయన కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ను కూడా ప్రశంసించారు. ఈ కూటమి కేరళ అభివృద్ధి కోసం పని చేస్తూనే ఉంటుందని తెలిపారు.
“కేరళ స్థానిక స్వపరిపాలన ఎన్నికలలో ఎంత అద్భుతమైన ఫలితాలు వచ్చాయి! ప్రజాతీర్పు స్పష్టంగా ఉంద. రాష్ట్ర ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది,” అని తిరువనంతపురం లోక్‌సభ ఎంపీ థరూర్ పేర్కొన్నారు.
More Stories
మెస్సి టూర్లో గందరగోళం.. అభిమానుల అసహనం
భారత్ పై 50 శాతం సుంకాలను ముగించాలని అమెరికాలో తీర్మానం!
నోబెల్ గ్రహీత నర్గెస్ మొహమ్మది అరెస్ట్