అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సి గోట్ టూర్‌లో గందరగోళం నెలకొంది. గోట్ టూర్‌లో భాగంగా మెస్సీ ఇవాళ కోల్‌కతాలో వివేకానంద యువభారతి సాల్ట్ లేక్ స్టేడియంలో పర్యటించాడు. ఈ క్రమంలో మెస్సీని చూసేందుకు స్టేడియానికి వేలాదిమంది అభిమానులు టికెట్ కొనుగోలు చేసి వచ్చారు. అతడి ఆటను వీక్షించాలని ఆశించారు. ఈ నేపథ్యంలో స్టేడియంలో అతడు అలా వచ్చి, ఇలా స్టేడియం నుంచి వెళ్లిపోయాడు. దీంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
స్టేడియంలో పట్టుమని 10 నిమిషాలు కూడా ఉండలేదని మండిపడ్డారు. తీవ్ర ఆగ్రహంతో కుర్చీలు, వాటర్ బాటిళ్లను మైదానంలోకి విసిరేసి అసహనం వ్యక్తంచేశారు. ఈవెంట్ మేనేజ్మెంట్పై దాడికి దిగి పోస్టర్లను ధ్వంసం చేశారు. స్టేడియంలో పరిస్థితిని నియంత్రించడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన టూర్‌లో భాగంగా ఇవాళ ఉదయం మెస్సీ కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఫ్రెండ్లీ మ్యాచ్ ఉంటుందని నిర్వాహకులు ప్రకటించారు. దీంతో మెస్సీ మ్యాచ్ చూసేందుకు భారీ సంఖ్యలో ఆయన అభిమానులు స్టేడియానికి చేరుకున్నారు. కానీ మెస్సీ అక్కడ ఎలాంటి మ్యాచ్ ఆడలేదు. కేవలం ప్రేక్షకులకు అభివాదం మాత్రమే చేశారు. దీంతో మెస్సీ మ్యాచ్ ఆడకుండా త్వరగా వెళ్లిపోవడం పట్ల నిర్వహాకుల తీరుపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెస్సి స్టేడియంలోకి ప్రవేశించగానే మంత్రులు, రాజకీయ నాయకులు అతడిని చుట్టుముట్టారు.
తర్వాత అతడిని భారీ సెక్యూరిటీ మధ్య హోటల్‌కు తీసుకెళ్లారు. దీంతో ఫ్యాన్స్ మండిపడ్డారు. అభిమానులు కొనుగోలు చేసిన ఒక్కో టికెట్ ధర రూ.4,500- రూ. 10,000 మధ్య ఉన్నట్లు తెలుస్తోంది. ఇంత భారీ ధరకు టికెట్లు కొనుగోలు చేసి స్టేడియానికి వస్తే ఇలా జరగడంతో మండిపడ్డారు. ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీకి బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు. శనివారం ఉదయం కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ పాల్గొన్న కార్యక్రమ నిర్వహణలో అపశ్రుతి చోటుచేసుకుందని తెలిసి షాక్‌కు గురైనట్లు ఆమె తెలిపారు.
ఈ ఘటనపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి, బాధ్యులను గుర్తించేందుకు అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మమత ప్రకటించారు. రిటైర్డ్ న్యాయమూర్తి ఆశిమ్ కుమార్ రే సారథ్యంలో ఏర్పాటయ్యే ఈ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ, అదనపు చీఫ్ సెక్రెటరీ, రాష్ట్ర హోం-హిల్ అఫైర్స్ విభాగం ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారని వెల్లడించారు.
గవర్నర్ సి.వి. ఆనంద బోస్ ఈ సంఘటనను కోల్‌కతా క్రీడా సంస్కృతికి ఒక “చీకటి రోజు”గా అభివర్ణించారు. నిర్వాహకుడి నిర్లక్ష్యానికి గాను అతడిని అరెస్టు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనకు ప్రధానంగా నిర్వాహకులే బాధ్యులని పేర్కొంటూనే, పోలీసులు కూడా ప్రభుత్వానికి, ప్రజలకు విఫలమయ్యారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Stories
తిరువనంతపురంలో మొదటి బిజెపి మేయర్!
భారత్ పై 50 శాతం సుంకాలను ముగించాలని అమెరికాలో తీర్మానం!
నోబెల్ గ్రహీత నర్గెస్ మొహమ్మది అరెస్ట్