నలుగురు ఇండిగో అధికారులు సస్పెండ్

నలుగురు ఇండిగో అధికారులు సస్పెండ్

దేశీయ విమానయాన రంగంలో తీవ్ర గందరగోళానికి కారణమైన ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కఠినంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే చర్యలు కూడా ప్రారంభించింది. తాజాగా నలుగురు ఫ్లైట్‌ ఆపరేషన్స్‌ ఇన్‌స్పెక్టర్లను సస్పెండ్‌ చేసింది. పర్యవేక్షణలో లోపాల వల్లే ఇండిగోలో సంక్షోభం తలెత్తినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. దీంతో విమానాల భద్రత, కార్యాచరణను పర్యవేక్షించే నలుగురు అధికారులను సస్పెండ్‌ చేసినట్లు తెలుస్తోంది.

సంక్షోభం తలెత్తడానికి వీరు విధుల్లో నిర్లక్ష్యం వహించడమే కారణమని, అందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.  డీజీసీఏలో కీలక స్థానంలో ఉండే ఎఫ్ఐఓలు పని విమాన సంస్థల కార్యకలాపాలను పర్యవేక్షించడం, పైలట్ల శిక్షణ, సర్టిఫికేషన్‌, భద్రతా ప్రమాణాల అమలు, ఆపరేషనల్‌ ఆడిట్ల వంటి కీలక అంశాలను పరిశీలించడం. ఇండిగోలో కొనసాగుతున్న పెద్ద ఎత్తున రద్దుల విషయంలో వీరి పాత్రపై ప్రశ్నలు తలెత్తడంతో సస్పెండ్ తీసుకున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.

శుక్రవారం ఒక్కరోజే బెంగళూరు విమానాశ్రయం నుంచి ఇండిగో 54 విమానాలను రద్దు చేసింది. వీటిలో 31 అరైవల్స్‌, 23 డిపార్చర్లు ఉన్నాయి. గురువారం అయితే దిల్లీ, బెంగళూరు నుంచి 200కు పైగా విమానాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ వరుస రద్దులతో ప్రయాణికులు పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొంటూ కౌంటర్ల వద్ద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విమానాల ఆలస్యం, చివర్లో ఆకస్మిక రద్దు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడం వల్ల వేలాది మంది గంటల తరబడి ఎయిర్‌పోర్టుల్లోనే గడపాల్సి వస్తోంది. కుటుంబాలతో ప్రయాణిస్తున్నవారికి, విదేశీ కనెక్టింగ్‌ ఫ్లైట్‌ ఉన్నవారికి, అత్యవసర ప్రయాణాలు ప్లాన్‌ చేసినవారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇండిగోలోని సమస్యలపై డీజీసీఏ ఇప్పటికే ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. గురువారం ఇండిగో సిఈఓ పిటర్‌ ఎల్బర్స్‌ విచారణ ప్యానెల్‌ ముందు హాజరయ్యారు.

వివరాలు పూర్తిగా ఇవ్వలేదన్న కారణంతో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు మళ్లీ హాజరుకావాలని ఆదేశించారు. ఆయనతో పాటు సిఓఓ ఇసిడ్రే పోర్కెరాస్‌ కూడా విచారణకు హాజరు కానున్నారు.  ఇంతవరకు పరిస్థితి ఎలా ఉందో ప్రత్యక్షంగా తెలుసుకోవడం కోసం డీజీసీఏ అధికారులు ఇండిగో హెడ్‌క్వార్టర్స్‌లోనే బస చేస్తూ రికార్డులు, రోజువారీ కార్యకలాపాలు, సిబ్బంది ప్లానింగ్‌, డ్యూటీ రోస్టర్లు తదితర అంశాలను పరిశీలిస్తున్నారు.