హైదరాబాద్‌కు చెందిన ఒక క్రైస్తవ విద్యా సంస్థ పలు సంవత్సరాలుగా ఆర్‌టిఇ నిధులను దుర్వినియోగం చేస్తున్నట్లు, అందుకోసం సాధారణ విద్యార్థులను ‘జోగినీలు’గా తప్పుగా చిత్రీకరించడం ద్వారా విదేశీ విరాళాలు పొందుతున్నట్లు, విలాసవంత విదేశీ ప్రయాణాలకు ఈ నిధులను మళ్లిస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు వెల్లడించారు. అదేవిధంగా అణగారిన విద్యార్థులకు విద్యాబోధన పేరుతో వివిధ ప్రభుత్వ కార్యక్రమాల కింద నిధులు పొందుతూనే ఆయా విద్యార్థుల నుండి ఫీజులను వసూలు చేస్తున్నట్లు కనుగొన్నారు.
ఈ క్రైస్తవ విద్యాసంస్థపై సుమారు పదేళ్లుగా నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదులు వస్తుండగా, తాజాగా ఈడీ సోదాలు జరిపి, ఆస్తులను జప్తు చేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ సోదాలలో గుడ్ షెపర్డ్ స్కూల్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆపరేషన్ మెర్సీ ఇండియా ఫౌండేషన్ (ఓఎంఐఎఫ్)కు చెందిన డజను స్థిరాస్తులను జప్తు చేసినట్లు ఈడీ తెలిపింది. వీటిలో ఎక్కువగా వెనుకబడిన విద్యార్థుల కోసం ఉద్దేశించినవి ఉన్నాయి.
ఈడీ అందించిన వివరాల ప్రకారం ఈ పాఠశాలలో పూర్తిగా స్పాన్సర్ పొందుతున్న విద్యార్థులతో పాటు సాధారణ విద్యార్థులు అందరి నుండి క్రమం తప్పకుండా ఫీజులు, పుస్తక ఛార్జీలు, యూనిఫాం, బస్సు ఫీజులను వసూలు చేస్తున్నారు. దానితో మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద నిర్వచించిన విధంగా “నేర ఆదాయం”ను పొందుతున్నట్లు ఈడీ తెలిపింది.
విద్యా హక్కు (ఆర్టిఈ), స్కాలర్‌షిప్ పథకాల కింద పాఠశాలలకు “గణనీయమైన” ప్రభుత్వ సహాయం కూడా లభిస్తుంది. అయినప్పటికీ విద్యార్థుల నుండి పూర్తిగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ రీయింబర్స్‌మెంట్‌లను విద్యార్థులకు తిరిగి చెల్లించకుండా ఒఎంఐఎఫ్ ప్రధాన కార్యాలయ ఖాతాలకు “మళ్లించారు” అని ఈడీ పేర్కొంది.
2011-12 నుండి 2017-18 మధ్య, విద్యార్థుల నుండి సేకరించిన, ప్రభుత్వ వనరుల నుండి పొందిన “గణనీయమైన” మొత్తాలను ఉచిత విద్యకు నిధులు సమకూరుస్తున్నామని, నమ్మిన దాతల నుండి దాచిపెట్టారని అది తెలిపింది.
ఈ విధంగా విద్యార్థుల నుండి ఫీజులు సేకరించడం, ప్రభుత్వ సబ్సిడీలను మళ్లించడం వల్ల ఉత్పన్నమయ్యే నేరపూరిత ఆదాయంగా ఈడీ రూ. 15.37 కోట్లను గుర్తించింది.
ఈడీ ప్రకారం, ఈ బృందం సాధారణ పాఠశాల విద్యార్థులను విదేశీ దాతలకు “జోగినీలు” (లైంగికంగా దోపిడీకి గురైన ఆలయ పరిచారకులు)గా తప్పుగా చిత్రీకరించి అధిక స్పాన్సర్‌షిప్ మొత్తాలను “అభ్యర్థించింది”. రెగ్యులర్ విద్యార్థులు, సంబంధం లేని పిల్లల చిత్రాలను దాత వెబ్‌సైట్‌లు, సోషల్ మీడియాలలో అప్‌లోడ్ చేసి, వారిని ‘జోగినీలు’గా చిత్రీకరించినట్లు కనుగొంది.
“జోగిని పునరావాసం” కోసం నెలకు 60-68 డాలర్ల వరకు విరాళాలు వస్తున్నాయని, సాధారణ విద్యార్థుల స్పాన్సర్‌షిప్ కోసం నెలకు 20-28 డాలర్ల వరకు విరాళాలు వస్తున్నాయని, ఫలితంగా “తప్పుడు” చిత్రీకరణలతో ఆధారంగా అధిక నిధుల సేకరణ జరిగిందని ఈడీ కనుగొంది. మతపరమైన కార్యకలాపాలలో నిమగ్నమైన ఒక గ్రూప్ సంస్థ, గుడ్ షెపర్డ్ కమ్యూనిటీ సొసైటీ (జిఎస్ సీఎస్), చర్చి సంబంధిత ఖర్చులు, స్థిరాస్తుల సముపార్జన కోసం తల్లిదండ్రులు చెల్లించే రుసుములను ఉపయోగించినట్లు ఈడీ ఆరోపించింది.
దర్యాప్తులో, నిందితులు తమ “ప్రధాన” కార్యకలాపాల కోసం అనుబంధ సంస్థలకు నిధులను “మళ్లించారు”, సీనియర్ కార్యకర్తల “విపరీత” విదేశీ ప్రయాణాలకు వాటిని ఉపయోగించారని, ఇందులో కీలక కార్యకర్త డాక్టర్ జోసెఫ్ గ్రెగొరీ డిసౌజా బిజినెస్ క్లాస్ విమాన ప్రయాణం కూడా ఉందని తేలింది. దళిత, ఇతర అణగారిన వర్గాల విద్యార్థుల విద్య, పాఠశాలల నిర్మాణం, నిర్వహణకు సంబంధించిన ఇతర అనుబంధ ఖర్చుల కోసం ఒఎంఐఎఫ్ “ముఖ్యమైన” విదేశీ స్పాన్సర్‌షిప్ నిధులను పొందిందని ఏజెన్సీ తెలిపింది.
హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఎచ్ఏ) బహుళ ఓఎం ఇండియా సంస్థల ఎఫ్ ఐ ఆర్ ఏ (విదేశీ సహకార నియంత్రణ చట్టం) లైసెన్స్‌ను పునరుద్ధరించకూడదని ఆదేశించిందని, వారి ఖాతాలను కూడా స్తంభింపజేసిందని పేర్కొంది. మొదటి సారిగా, 2016లో వీరిపై మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గోర్విపాగ ఆల్బర్ట్ లాయెల్, చీఫ్ ఫంక్షనరీ డాక్టర్ జోసెఫ్ గ్రెగొరీ డిసౌజాలపై భారీ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మరుసటి సంవత్సరం 2017లో తెలంగాణ పోలీసుల సిఐడి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, ఐపీసీ, ఎఫ్‌సీఆర్‌ఏ (కింద ఉన్న నేరాలతో సహా ఆరోపించిన ఆర్థిక అవకతవకలపై వివరణాత్మక దర్యాప్తును ప్రారంభించింది.
ఆగస్టు 2023లో సీఐడీ నాంపల్లి క్రిమినల్ కోర్టులో సమగ్ర చార్జిషీట్‌ను (45 పేజీలు) దాఖలు చేసింది. ఇందులో ఓం ఇండియా గ్రూప్‌తో సంబంధం ఉన్న 20 మంది ముఖ్య వ్యక్తులను పేర్కొంది. జూన్ 2024లో సీఐడీ దర్యాప్తు ఆధారంగా ఈడీ పీఎంఎల్‌ఏ చట్టం కింద ఈ కేసును చేపట్టి, హైదరాబాద్, చుట్టుపక్కల 11 ప్రదేశాలలో సోదాలు నిర్వహించింది. డిసెంబర్ 2025లో ఈడీ ఓం ఇండియా సంస్థలు, దాని ముఖ్య కార్యనిర్వాహకులకు సంబంధించిన 12 స్థిరాస్తులను (మార్కెట్ విలువ సుమారు రూ.15 కోట్లు) ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది.

More Stories
మొదటిసారి పాకిస్థాన్ లో సంస్కృత తరగతులు!
శ్రీవారి సేవలో పట్టుకు బదులు పాలిస్టర్ శాలువాలు
ఓటు చోరీపై అమిత్ షా, రాహుల్ గాంధీ వాగ్వివాదం