శ్రీవారి ఆలయ అవసరాల కోసం ‘పట్టు శాలువాల’ కొనుగోలుకు తిరుమల తిరుపతి దేవస్థానం టెండర్లు పిలిచింది. శ్రీవారి సేవలతోపాటు వీవీఐపీలకు వేదాశీర్వచనం, దాతలను సత్కరించడానికి వాటిని వినియోగిస్తారు. ఇందులో భాగంగా నగరికి చెందిన మెసర్స్ వీఆర్‌ఎస్ ఎక్స్‌పోర్ట్ అనే సంస్థకు 15,000 శాలువాల సరఫరా కాంట్రాక్టును అప్పగించారు.
ఒక్కోటి రూ.1,389.15 చొప్పున ధర నిర్ణయించారు. నాణ్యతపై అనుమానాలు రావడంతో, గత బోర్డు సమావేశంలో దీనిపై సమగ్ర విచారణ జరపాలని సీవీఎస్వోను ఆదేశించారు. విజిలెన్స్ అధికారులు తిరుపతిలోని గోదాము, తిరుమలలోని వైభవోత్సవ మండపం నుంచి తాజా స్టాకు నమూనాలు సేకరించారు. వీటిని బెంగళూరు, ధర్మవరంలోని సెంట్రల్ సిల్క్‌బోర్డులకు పంపి పరీక్షించగా విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి.
టెండర్ నిబంధనల ప్రకారం స్వచ్ఛమైన పట్టు ఉండాలి. పరీక్షల్లో అది వందశాతం పాలిస్టర్ అని తేలింది. ఆ శాలువాలపై ‘సిల్క్ హోలోగ్రామ్’ కూడా లేదని అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో టిటిడిలోని కొందరు అధికారుల తీరుపై విజిలెన్స్ నివేదికలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. గతంలో డిప్యూటీ ఈవో (వేర్‌హౌస్) పంపిన నమూనాలను కాంచీపురం ల్యాబ్‌లో పరీక్షిస్తే అవి నాణ్యమైనవేనని నివేదిక వచ్చింది.
కానీ అదే స్టాకు నుంచి విజిలెన్స్ సేకరించి పంపినవి మాత్రం పాలిస్టర్ అని తేలింది. దీన్నిబట్టి ల్యాబ్‌కు పంపేటప్పుడు మార్చేయడమో, లేదా నివేదికలు తారుమారు చేయడమో జరిగి ఉంటుందని విజిలెన్స్ స్పష్టం చేసింది. ప్రస్తుత టెండర్‌లోనే కాకుండా కొన్నేళ్లుగా ఈ అక్రమాలు సాగుతున్నట్లు అనుమానిస్తున్నారు. వీఆర్‌ఎస్ ఎక్స్‌పోర్ట్, దాని సోదర సంస్థలైన తిరుమల ఫ్యాబ్రిక్స్, నన్నా కాటేజెస్, వీఎం రాజా పవర్‌లూమ్ యూనిట్ సంస్థల నుంచి 2015-25 వరకు దాదాపు రూ.54.95 కోట్ల విలువైన వస్త్రాలను టీటీడీ కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది.
తిరుమల తిరుపతి దేవస్థానానికి పట్టు శాలువాలకు బదులు పాలిస్టర్ శాలువాలను సరఫరా చేసిన స్కాంపై ప్రస్తుత పాలకమండలి సమగ్ర విచారణ ప్రారంభించిందని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు బుధవారం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. 2019 నుంచి ఇప్పటివరకు రూ.80-90 కోట్ల అవినీతి జరిగి ఉండవచ్చని అంచనా వేశామని తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటున్న పారదర్శక చర్యల కారణంగానే టీటీడీలో ఇంతకాలం జరుగుతున్న అవకతవకలు, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. హిందూ ధర్మం పట్ల కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, దీనిని అందరూ చాలా చిన్న విషయంగా చూస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పట్టువస్త్రాల స్కాంతో పాటు, టీటీడీ పరకామణి (హుండీ ఆదాయం లెక్కించే ప్రక్రియ) విషయంలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని పవన్ కళ్యాణ్ ఖండించారు. పరకామణిలో ఏదైనా చిన్న మొత్తంలో తేడా వస్తే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
“మీరు నమ్మే మతంలో లేదా మీ ఆరాధనా స్థలంలో ఇలాంటి అక్రమమే జరిగి ఉంటే, దాన్ని కూడా మీరు ఇంత చిన్న విషయంగా కొట్టిపారేసేవారా?” అని ఆయన జగన్‌ను సూటిగా ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు మతపరమైన అంశాల్లో కూడా పారదర్శకత, బాధ్యత అవసరాన్ని నొక్కి చెబుతున్నాయని తెలిపారు.

More Stories
ఓటు చోరీపై అమిత్ షా, రాహుల్ గాంధీ వాగ్వివాదం
జిహెచ్ఎంసీ పరిధి విస్తరించడం ఎంఐఎం కోసమే!
2025లో ఇప్పటికే 2024 నాటి 126 మంది జర్నలిస్టుల హత్య!