కొత్తగా ప్రతిపాదించిన 300 వార్డుల విభజనలో స్పష్టంగా రాజకీయ ప్రయోజనం దాగి ఉందని పేర్కొంటూ, విస్తరణను మూడు భాగాలుగా చేస్తూ ప్రత్యేకంగా మజ్లిస్ పార్టీకి మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు వచ్చేలా మార్గం ఏర్పర్చడం ద్వారా రాజకీయ ప్రయోజనం కల్పించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోందని ఆయన విమర్శించారు.
కొత్తగా జిహెచ్ఎంసీలో చేర్చబడుతున్న ప్రాంతాల్లోని ప్రతి ఒక్కరూ వారం రోజుల్లో తమ అభిప్రాయాలు, అభ్యంతరాలు తప్పనిసరిగా సమర్పించాలని రామచందర్ రావు విజ్ఞప్తి చేశారు. బిజెపి ఈ నిర్ణయాన్ని గతంలోనూ, ఇప్పటికీ స్పష్టంగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. 69 లక్షల ఓటర్లు ఉన్న జీహెచ్ఎంసీని అకస్మాత్తుగా కోటి 69 లక్షల జనాభా స్థాయికి తీసుకువచ్చి, హైదరాబాద్‌ను దేశంలోనే అతిపెద్ద నగరంగా మార్చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం వెనుక రాజకీయ దురుద్దేశ్యాలు ఉన్నాయని తెలిపారు.
కానీ నిజానికి-ఇప్పటికే జీహెచ్ఎంసీలోని అనేక వార్డుల్లో రోడ్లు సరిగా లేవని, సీవరేజ్ సిస్టమ్ లేదని, మౌలిక వసతులు సరిగ్గాలేవని చెబుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించకముందే, విస్తరణ పేరిట మరిన్ని ప్రాంతాలను చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం అన్యాయం అంటూ ఆయన మండిపడ్డారు. ఇంతటితో ఆగకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ ల్యాండ్‌గా కన్వర్ట్ చేయాలనుకోవడం మరో పెద్ద అన్యాయం అంటూ బిజెపి నేత ధ్వజమెత్తారు.
దీనిపై బిజెపి ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసిందని చెబుతూ ప్రజల అభిప్రాయాలు వినాలని, హియరింగ్స్ నిర్వహించాలని, పబ్లిక్ డొమైన్‌లో పూర్తి వివరాలు ఉంచాలని ఆయన డిమాండ్ చేసారు. కొత్త జిహెచ్ఎంసీ విస్తరణలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలపై పన్నులు పెరుగుతాయని పేర్కొంటూ ఇప్పటికే అనేక ప్రాంతాల్లో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు, నీటి సరఫరా, విద్యుత్ వంటి అవసరమైన మౌలిక సౌకర్యాలు కూడా సరిగ్గా లేవని తెలిపారు.
అంతేకాదు సామాన్య రైతుల భూములు ఇండస్ట్రియల్ ల్యాండ్‌గా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. హైదరాబాద్ ఒక గొప్ప నగరంగా ఎదగడం అనేది గర్వకారణంగా భావిస్తామని, కానీ ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా, ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించకుండా, పబ్లిక్ డొమైన్‌లో వివరాలు షేర్ చేయకుండా ప్రభుత్వం ఈ జీహెచ్ఎంసీ విస్తరణ నిర్ణయం తీసుకోవడం పూర్తిగా తప్పుడు పద్ధతని రామచందర్ రావు స్పష్టం చేశారు.
కొత్తగా జిహెచ్ఎంసీలో చేర్చబడే ప్రాంతాల ప్రజలు ప్రస్తుతం చెల్లిస్తున్న పన్నులతో పోలిస్తే దాదాపు రెట్టింపు మేరకు పన్నులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తోందని ఆయన చెప్పారు. రోడ్లు, నీరు, విద్యుత్, డ్రైనేజ్ వంటి మౌలిక వసతులు సరిపోకపోయినా పన్నులు మాత్రం నగర స్థాయిలో చెల్లించే పరిస్థితికి తీసుకెళ్లడం అన్యాయమని మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాల నుంచి మున్సిపాలిటీల వరకు మొత్తం టాక్స్ స్ట్రక్చర్‌ను మార్చుతూ, ప్రజలపై భారాన్ని భారీగా పెంచడం, పారదర్శకత లేకుండా నిర్ణయాలను తీసుకోవడం వంటి వాణ్ణి ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయని ఆయన విమర్శించారు.

More Stories
శ్రీవారి సేవలో పట్టుకు బదులు పాలిస్టర్ శాలువాలు
ఓటు చోరీపై అమిత్ షా, రాహుల్ గాంధీ వాగ్వివాదం
2025లో ఇప్పటికే 2024 నాటి 126 మంది జర్నలిస్టుల హత్య!