ఓటు చోరీపై అమిత్‌ షా, రాహుల్‌ గాంధీ వాగ్వివాదం

ఓటు చోరీపై అమిత్‌ షా, రాహుల్‌ గాంధీ వాగ్వివాదం
 
* కాంగ్రెస్ ఓటమికి ఇవిఎంలు, ఓటు చోరీ కాదు, ఆ పార్టీ నాయకత్వమే కారణం!
 
ఓటు చోరీ అంశంపై బుధవారం లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. ఎన్నికల సంస్కరణలపై మంగళవారం నాటి చర్చ కొనసాగింపులో భాగంగా బుధవారం మాట్లాడిన హోంమంత్రి అమిత్‌షా ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమికి ఇవిఎంలు, ఓటు చోరీ కారణం కాదని, ఆ పార్టీ నాయకత్వమే కారణమని ధ్వజమెత్తారు. 
 
ఈ దశలో జోక్యం చేసుకున్న రాహుల్‌గాంధీ ఓటర్ల జాబితాల్లో అవకతవకలపై చర్చకు రావాలని సవాల్‌ చేశారు. దీంతో అమిత్‌ షా ఎదురుదాడికి దిగారు. సభలో తాను ఏం మాట్లాడాలన్నది ఎవరూ నిర్దేశించలేరని స్పష్టం చేశారు. కాగా, ఓటర్ల జాబితా నవీకరణ, అర్హత కలిగిన ఓటర్లను నిర్ధారించడం లక్ష్యంగా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) జరుగుతోందని ఆయన చెప్పారు. ప్రతిపక్షాలు దీనిపై కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయని విమర్శించారు. 
 
‘మీరు గెలిచినప్పుడు ఓటర్ల జాబితాలు కచ్చితంగా ఉంటాయి. మీరు కొత్త దుస్తులు ధరించి ప్రమాణం చేస్తారు. కానీ బీహార్‌లో లాగా మీరు ఓడిపోయినప్పుడు ఓటర్ల జాబితాలో సమస్య ఉందని అంటారు. ఈ ద్వంద్వ ప్రమాణాలు పని చేయవు’ అని అమిత్‌ షా స్పష్టం చేశారు. 
 
‘ప్రతిపక్ష నాయకుడు ‘ఓటు చోరీ’ గురించి మాట్లాడారు. అయితే కొన్ని కుటుంబాలు తరతరాలుగా ఓటు దొంగలు’ అంటూ పరోక్షంగా నెహ్రూ, ఇందిరాగాంధీ కుటుంబాలను ఆయన విమర్శించారు. ఎస్‌ఐఆర్‌పై ప్రతిపక్షాలు ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నాయన్న అమిత్‌ షా వ్యాఖ్యలపై స్పందించిన రాహుల్‌గాంధీ  దేశ చరిత్రలో తొలిసారిగా ఎన్నికల కమిషనర్ల నియామకం కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోయిందని విమర్శించారు. 
 
తాను మీడియా సమావేశంలో లేవనెత్తిన అంశాలపై చర్చకు రావాలని సవాల్‌ చేశారు. అమిత్‌ షా ఆందోళన చెందుతున్నారని, భయపడుతున్నారని పేర్కొన్నారు. ఆ తరువాత కూడా అమిత్‌ షా ఎదురుదాడి కొనసాగింది. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానాలివ్వకుండా ఆయన దాడికి దిగడంతో ప్రతిపక్షాలు వాకౌట్‌ చేశాయి.  ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ‘ఓటరు జాబితా సమగ్ర సవరణ’ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై దేశ ప్రజలను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విమర్శించారు. గత నాలుగు నెలలుగా ఎస్‌ఐఆర్ గురించి అవాస్తవాలను వ్యాప్తి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 

బుధవారం లోక్‌సభలో ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చలో పాల్గొంటూ రాజ్యాంగబద్ధ సంస్థ అయిన కేంద్ర ఎన్నికల సంఘమే ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిర్వహిస్తుందని, కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం అది నడవదని ఆయన స్పష్టం చేశారు. పారదర్శక, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించడం ఎన్నికల సంఘం బాధ్యత అని హోంమంత్రి చెప్పారు.

“పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఎస్‌ఐఆర్ ప్రక్రియ గురించి ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి. ఆ అంశం గురించి ప్రజల్లోకి తప్పుడు సందేశాన్ని పంపే యత్నం చేస్తున్నాయి. అందుకే మేం ఎన్నికల సంస్కరణలపై చర్చకు నిరాకరిస్తున్నాం. పార్లమెంటు అనేది దేశంలోనే అతిపెద్ద పంచాయతీ అయినందున, దీనిలో చర్చకు మేం ఎన్నడూ అభ్యంతరం చెప్పలేదు” అని తెలిపారు. 

ఎస్‌ఐఆర్ ప్రక్రియపై సమగ్ర సమీక్ష జరపాలని విపక్ష పార్టీలు కోరుతున్నాయని,  అయితే అది సాధ్యమయ్యే విషయం కాదని తేల్చి చెప్పారు. ఎందుకంటే ఆ అంశం కేంద్ర ఎన్నికల సంఘం అధికార పరిధిలోకి వస్తుందని పేర్కొంటూ ఎన్నికలను  నిర్వహించం గదా అమిత్‌షా ప్రశ్నించారు. లోక్‌సభలో ఎన్నికల సంస్కరణలపై మాత్రమే చర్చ జరగాలని, కానీ విపక్షాలు పూర్తిగా ఎస్‌ఐఆర్ ప్రక్రియ గురించే మాట్లాడుతున్నాయి అంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. 

జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ ప్రధానులుగా ఉన్న టైంలోనూ ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిర్వహించారని విపక్షాలు తెలుసుకోవాలని అమిత్ షా హితవు చెప్పారు. తొలిసారిగా 1952లో నెహ్రూ హయాంలో ఎస్‌ఐఆర్ జరిగిందని, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలోనూ ఎస్‌ఐఆర్‌ను నిర్వహించారని ఆయన గుర్తు చేశారు. ఇవన్నీ తెలిసి కూడా ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. 

ఓటర్ల జాబితాలను సమగ్రంగా సవరణ చేయకుండా ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎలా నిర్వహించగలుగుతారో ప్రతిపక్ష పార్టీలే చెప్పాలి అంటూ ధ్వజమెత్తారు. అక్రమంగా ఓగుర్తింపు కార్డులు పొందిన వాళ్లకు ఓట్లు వేసే అవకాశం లభిస్తే దేశం భద్రంగా ఎలా ఉండగలదో విపక్షాలు చెప్పాలని చురకలు అంటించారు. 

అక్రమ వలసదారులు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనొచ్చా? చనిపోయిన వారి పేర్లు ఇంకా ఓటరు జాబితాల్లోనే కొనసాగాలా? ఒక ఓటరుకు ఒకటి కంటే ఎక్కువచోట్లలో ఓటు ఉండొచ్చా? అని అమిత్ షా ప్రశ్నించారు.  రాజ్యాంగపరమైన బాధ్యతను నిర్వర్తించే క్రమంలోనే ఎస్‌ఐఆర్‌ను ఈసీ నిర్వహిస్తోందని అందరూ తెలుసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియను శుద్ధి చేసే క్రమంలోనే ఎస్‌ఐఆర్‌ను నిర్వహిస్తున్నారని అమిత్‌షా పేర్కొన్నారు.

అంతకు ముందు, కాంగ్రెస్‌ సీనియర్‌ ఎంపి కెసి వేణుగోపాల్‌ మాట్లాడుతూ నిష్పాక్షిక ఎన్నికల కోసం ఇసిని తీసుకొచ్చారని, అది ఇప్పుడు రాజకీయ ఒత్తిడి కారణంగా పక్షపాతంగా మారిపోయిందని విమర్శించారు. ఎస్‌ఐఆర్‌ అనేది ఎన్‌ఆర్‌సిలా బ్యాక్‌డోర్‌ వెర్షన్‌ అని ఎంఐఎం ఎంపి అసదుద్దీన్‌ ఒవైసి విమర్శించారు.  ఆర్‌ఎస్‌పి ఎంపి ఎన్‌కె ప్రేమచంద్రన్‌ మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్‌ వల్ల మైనారిటీలు, జనాభాలోని బలహీనవర్గాలకు సామూహిక హక్కులు లేకుండా పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
జెఎంఎం ఎంపి విజరు కుమార్‌ హన్స్‌డాక్‌ మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియలో జరిగిన లోపాల గురించి అనేక పార్టీలు సమాచారాన్ని సేకరించి ఎన్నికల సంఘాన్ని సంప్రదించాయని, కానీ ఎటువంటి చర్య తీసుకోలేదని విమర్శించారు.  నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఎంపి మియాన్‌ అల్తాఫ్‌ అహ్మద్‌ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలోని ప్రతి భాగం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవడానికి ప్రతి అడుగు వేయాల్సిన అవసరం ఉందని అన్నారు.