వందేమాతరం పాడిన వారిని ఇందిరా గాంధీ జైలులో పెట్టారు

వందేమాతరం పాడిన వారిని ఇందిరా గాంధీ జైలులో పెట్టారు
ఎమర్జెన్సీ సమయంలో వందేమాతరం పాడిన వారిని ఇందిరా గాంధీ జైలులో పెట్టారని హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. రాజ్యసభలో జరిగిన ప్రత్యేక చర్చలో వందే మాతరం గీతం ప్రాముఖ్యాన్ని ప్రత్యేకంగా వివరిస్తూ  జాతీయ గీతం 150 ఏళ్ల ప్రయాణాన్ని పురస్కరించుకుని జరిగిన చర్చపై కొన్ని పార్టీలు వ్యక్తం చేసిన అనుమానాలకు సమాధానాలిచ్చారు.

వందే మాతరం భారతీయుల దేశభక్తి భావనకు ప్రతీక, జాతీయ సంస్కృతి, జాతీయ స్పూర్తిని ప్రతిబింబించే అమర సృజన అని అమిత్ షా తెలిపారు. ప్రత్యేక చర్చను బంగాల్ అసెంబ్లీ ఎన్నికలతో అనుసంధానం చేయడం తప్పని స్పష్టం చేశారు. బంకిం చంద్ర చట్టోపాధ్యాయ బంగాల్‌కు చెందినవారు అయినా, వందే మాతరం ప్రభావం ఒక్క రాష్ట్రానికే పరిమితం కాలేదని చెప్పారు.

మొత్తం దేశాన్ని, విదేశాల్లోని స్వాతంత్ర్య సమరయోధులను కూడా ప్రేరేపించిందని గుర్తు చేశారు. “ఈ రోజు కూడా సరిహద్దుల్లో దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసే సైనికుల చివరి మాట వందే మాతరమే” అని అమిత్ షా పేర్కొన్నారు.  జాతీయ గీతం పట్ల గౌరవం పెంపొందేలా యువతకు, రాబోయే తరాలకు దీని చరిత్రను, భావజాలాన్ని అవగాహన చేయడం కీలకమని తెలిపారు. వందే మాతరం స్ఫూర్తి 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణానికి మార్గదర్శకం అవుతుందని స్పష్టం చేశారు.

ఈ చర్చను బంగాల్ ఎన్నికలతో అనుసంధానిస్తున్న ప్రతిపక్షాలపై స్పందిస్తూ, “ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారు తమ ఆలోచనను మరోసారి పునరాలోచించాలి. దేశభక్తిని రాజకీయ కళ్లజోడుతో చూడకూడదు” అని షా తీవ్రంగా విమర్శించారు. వందే మాతరం గీతం స్ఫూర్తి గతంలో అందించిన శక్తి భవిష్యత్తులో కూడా భారత అభివృద్ధికి దారితీస్తుందని చెప్పారు.

వందేమాతరం స్వర్ణోత్సవం సందర్భంగా నెహ్రూ జాతీయ గీతాన్ని విభజించారని అంటూ ముందురోజు లోక్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన    విమర్శలను అమిత్ తిరిగి చేశారు. వందేమాతరం 100వ సంవత్సరంలో, అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితిని విధించినందున ఆ గీతాన్ని పాడిన దేశభక్తులను జైలులో పెట్టారని ఆయన గుర్తు చేశారు.

“అప్పటి ప్రధాన రాజకీయ పార్టీ నాయకుడు వందేమాతరంను విభజించి, సంప్త్రుప్త రాజకీయాలను ప్రారంభించకపోతే, దేశ విభజన జరిగి ఉండేది కాదు” అని షా స్పష్టం చేశారు. “నెహ్రూ అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 1937 అక్టోబర్ కలకత్తా సమావేశంలో వందేమాతరంలోని రెండు చరణాలను మాత్రమే స్వీకరించింది. హిందూ దేవతల సూచనలతో కూడిన మిగిలిన వాటిని తొలగించారు” అని గుర్తు చేశారు. 

వందేమాతరంను అవమానించడం కాంగ్రెస్ నాయకత్వం నరాలలోకి ప్రవహించిందని పేర్కొంటూ జాతీయ గీతాన్ని అవమానకరమైన పదాలలో మాట్లాడినందుకు ప్రతిపక్షాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇస్లామిక్, బ్రిటిష్ దండయాత్రల వల్ల భారతీయ సంస్కృతి నాశనమైనప్పుడు, బంకించంద్ర చటోపాధ్యాయ వందేమాతరం రచించడం ద్వారా సాంస్కృతిక జాతీయతను తిరిగి స్థాపించారని షా చెప్పారు. “నేటికి కూడా, వందేమాతరం స్వేచ్ఛ, సంస్కృతి, దేశభక్తికి అత్యంత శక్తివంతమైన నినాదంగా మిగిలిపోయింది” అని షా తెలిపారు. 

ఆ తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికర్జున ఖర్గే ప్రభుత్వం, ముఖ్యంగా బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “1921లో మహాత్మా గాంధీజీ సహాయ నిరాకరణోద్యమం ప్రారంభించగా, వేలాది మంది కాంగ్రెస్ స్వాతంత్య్ర సమర వీరులు వందే మాతరం నినాదాలు చేస్తూ జైళ్లకు వెళ్లారు. కానీ అప్పటి మీ సిద్ధాంత పూర్వీకులు ఎక్కడ ఉన్నారు? వారు బ్రిటిషర్లతో కలిసి పనిచేశారు. మీ చరిత్ర అదే” అని ఖర్గే విమర్శించారు.

 ప్రధాని మోదీ తరచూ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూపై అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని, అమిత్ షా కూడా అదే ధోరణిని అనుసరిస్తున్నారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.