ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ నేత సత్యేంద్ర కుమార్ జైన్ తో సహా 14మందిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ప్రాసిక్యూషన్ ఫిర్యాదు దాఖలు చేసింది. ప్రాసిక్యూషన్ ఫిర్యాదు” అనేది ఒక వ్యక్తిపై ఆరోపించిన నేరానికి సంబంధించి క్రిమినల్ దర్యాప్తును ప్రారంభించడానికి అవసరమైన అధికారిక పత్రం లేదా చట్టపరమైన చర్యను సూచిస్తుంది.
ఢిల్లీ జల బోర్డు (డిజెబి) మురుగునీటి శుద్ధి కర్మాగారాలకు (ఎస్టిపి)సంబంధించిన నాలుగు టెండర్ల కేటాయింపులో అవినీతికి సంబంధించి ఈ ఫిర్యాదు దాఖలు చేసినట్లు ఇడి అధికారులు మంగళవారం తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 4వతేదీన ఇడి వివిధ వ్యక్తులకు చెందిన రూ.15.36కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది.
అప్పటి డిజెబి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉదిత్ ప్రకాష్ రాయ్, మాజీ సభ్యులు అజయ్ గుప్తా, అప్పటి డిజెపి చీఫ్ ఇంజనీర్ సతీష్ చంద్ర వశిష్ట్, ఇతర ప్రైవేట్ వ్యక్తులు/ సంస్థలు ఉన్నట్లు ఇడి తెలిపింది. ఈ కేసులో మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ)లోని వివిధ సెక్షన్లను ప్రయోగించింది.
ఢిల్లీ ప్రభుత్వ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) యూరోటెక్ ఎన్విరాన్మెంటల్ ప్రైవేట్ లిమిటెడ్ (ఇఇపిఎల్), ఇతరులపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఇడి దర్యాప్తు ప్రారంభించింది. పప్పంకలన్, నిలోథి (ప్యాకేజి 1), నజాఫ్గఢ్, కేశోపూర్ (ప్యాకేజ్ 2), కోరోనేషన్ పిల్లర్, నరేలా, రోహిణి (ప్యాకేజ్ 3), కొండ్లి (ప్యాకేజ్ 4)లలో ఉన్న 10 ఎస్టిపిలను పెంచడం, అప్గ్రేడ్ చేయడం పేరుతో డిజెపిలో కుంభకోణం జరిగిందని పేర్కొంది.
ఈ స్కామ్లో జైన్, ఇతరులు రూ.17.70 కోట్ల మేర ఆదాయం పొందారని ఇడి ఆరోపించింది. కాగా, కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాల ‘కక్ష సాధింపు చర్య’ ఈ కేసు అని ఆప్ నేత సత్యేంద్ర జైన్ మండిపడ్డారు. గతంలో ఇడి, సిబిఐ, ఎసిబి దాఖలు చేసిన కేసులన్నీ కోర్టుల్లో విఫలమయ్యాయని ఆయన గుర్తు చేశారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం భయపడుతున్న ఏకైక పార్టీ ఆప్ మాత్రమేనని అని పేర్కొన్నారు.

More Stories
ఇండిగో సంక్షోభం ముగిసిందని ప్రకటించిన సీఈఓ
ఇండిగో విమాన షెడ్యూల్లో 5% తగ్గింపు
ఇండిగో శీతాకాల విమానాలను తగ్గించనున్న కేంద్రం