పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని డిసెంబరు 16 నుంచి 2026 జనవరి 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 233 కేంద్రాల్లో ప్రముఖ పండితులు తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నారు. టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తిరుపతితో పాటు ఆంధ్రప్రదేశ్ -76, తెలంగాణ -57, తమిళనాడు- 73, కర్ణాటక- 21, పాండిచ్చేరి- 4, న్యూఢిల్లీ, ఒడిశాలో ఒకొక్క కేంద్రంలో తిరుప్పావై ప్రవచనాలు నిర్వహించనున్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలోనూ ధనుర్మాసంలో సుప్రభాతం బదులు తిరుప్పావై నివేదించడం విశేషం. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం, కెటి రోడ్డులోని శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో తిరుప్పావై ప్రవచనాలు పారాయణం చేస్తారు. 12 మంది ఆళ్వారులలో ఒకరైన శ్రీ గోదాదేవి ధనుర్మాసం వ్రతం చేశారు. ఈ వ్రతం చేయడం వల్ల దేశం సమృద్ధిగా, సుభిక్షంగా ఉంటుంది. ద్వాపరయుగంలో గోపికలు ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుని కృపకు పాత్రులయ్యారని భాగవతం దశమ స్కందంలో పేర్కొనబడింది.
ఈ వ్రతం ఎలా పాటించాలనే విషయాన్ని శ్రీ గోదాదేవి 30 పాశురాలతో కూడిన తిరుప్పావై దివ్యప్రబంధాన్ని లోకానికి అందించారు. ఈ తిరుప్పావై సారాంశం భగవంతునికి కైంకర్యం చేయడమే. ఈ వ్రతం ఒకరు చేయడం కాకుండా అందరినీ కలుపుకుని చేస్తే గొప్ప ఫలితం ఉంటుందని పండితులు చెబుతారు . ఈ సంప్రదాయం ప్రకారం దేశవ్యాప్తంగా గల అన్ని వైష్ణవ దేవాలయాలలో తిరుప్పావై శాత్తుమొర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

More Stories
వైసీపీ పాలనలో గ్రోత్ రేట్ తగ్గి రూ.7 లక్షల కోట్ల జీఎస్డీపీ కోల్పోయాం
రాష్ట్రంలో మతమార్పిడిలపై విచారణ జరపాలి!
పవన్ కు ఉడిపి పీఠాధిపతి ’అభినవ కృష్ణ దేవరాయ’ బిరుదు