* హిందువుల హక్కులను సమర్ధించిన హైకోర్టు జడ్జిలపై అభిశంసనకు డీఎంకే సిద్ధం!
మదురై సమీపంలోని తిరుపరంకుండ్రంలోని సుబ్రమణ్యస్వామి ఆలయంలో ఏటా డిసెంబర్‌లో కార్తీక దీపోత్సవం నిర్వహిస్తారు. ఆరవ శతాబ్దపు ఆలయం, 14వ శతాబ్దపు సికందర్ బాదుషా దర్గా ఉన్న కొండపై ఉన్న రెండు పురాతన స్తంభాల్లో ఒకదానిని ‘దీపథాన్’గా పిలుస్తారు. గత వందేళ్లుగా కొండ పాదాల వద్ద ఉన్న స్తంభంపై కార్తీక దీపం వెలిగిస్తున్నారు.
అయితే కొండ పైభాగం కూడా ఆలయానికి చెందినదిగా పేర్కొంటూ నలుగురు వ్యక్తులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కొండ పైభాగంపై ఉన్న రెండో స్తంభంపై కార్తీక దీపం వెలిగించేందుకు కోర్టు అనుమతి కోరారు. అయితే, కొండ పైభాగంలో ఉన్న స్తంభం సమీపంలో దర్గా ఉండటంతో మత పరమైన ఘర్షణలు తలెత్తుత్తాయని డీఎంకే ప్రభుత్వం హైకోర్టులో వాదించింది.
కాగా, జస్టిస్ స్వామినాథన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ 2017లో ఇచ్చిన ఆదేశాన్ని ప్రస్తావించింది. ఆలయ యాజమాన్యం కూడా పిటిషనర్ల డిమాండ్‌ను వ్యతిరేకించింది. దర్గా యాజమాన్యం కూడా తమ వాదనలు వినిపించింది. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జీఆర్ స్వామినాథన్, పిటిషనర్లకు మద్దతుగా డిసెంబర్ 1న తీర్పు ఇచ్చారు.
డిసెంబర్ 4న సాయంత్రం 6 గంటలలోపు కొండపై ఉన్న పురాతన రాయిపై దీపం వెలిగించాలని సుబ్రమణ్య స్వామి ఆలయ అధికారులను ఆదేశించారు. అయితే ఆలయ అధికారులు దీనిని పాటించలేదు. ప్రభుత్వ సూచనకు అనుగుణంగా కొండ దిగువన ఉన్న స్తంభంపై దీపం వెలిగించారు. కోర్టు తీర్పును పాటించకపోవడంపై హిందూ సంఘాలకు చెందిన వ్యక్తులు నిరసన తెలిపారు.
కొండపై ఉన్న పురాతన స్తంభం వద్ద దీపం వెలిగించేందుకు ప్రయత్నించారు. భారీగా మోహరించిన పోలీసులు, భద్రతా సిబ్బంది వారిని చెదరగొట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో గురువారం తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను మద్రాస్ హైకోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం విచారించింది.కాగా, కోర్టు తీర్పును ఉల్లంఘించడంపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహించింది. డీఎంకే ప్రభుత్వం కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు ఆరోపించింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 5న రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. అయితే విచారణ తేదీని ఇంకా ఖరారు చేయలేదు.
పైగా, తీర్పు ఇచ్చిన మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జీఆర్ స్వామినాథన్‌ను అభిశంసించాలని డీఎంకే ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాల్లో ఈ మేరకు అభిశాంసన తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీపోత్సవ్ కు ఎంకే స్టాలిన్ ప్రభుత్వం అడ్డుతగలడంతో ఈ దేవాలయం గురించి దేశవ్యాప్తంగా ఆసక్తి చెలరేగింది.
తిరుప్పరంకుండ్రం అనేది తమిళనాడు లో మదురై దగ్గర ఒక అతి ప్రాచీన మురుగన్ అంటే కుమారస్వామి వారి దేవాలయం ఉన్న ఊరు. స్వామి వారి ఆరు ముఖ్య దేవాలయాల్లో ఇది ఒకటి. ఇక్కడ కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. దీనికి తమిళనాడులో ని అన్ని ప్రాంతాలు నుండే కాకుండా కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ నుండి కూడా ప్రజలు పెద్ద ఎత్తున వస్తారు.
ఈ దేవాలయం ని అనుకుని ప్రాచీనకాలపు కొండలు వాటిల్లో 6-8 శతాబ్దాలలో పాండ్య రాజులు నిర్మించిన హిందూ గుహ ఆలయం ఉంది. కొన్ని చారిత్రక రికార్డ్స్ ప్రకారం ఈ గిరి 2వ శతాబ్దం నుండి హిందూ కేంద్రంగా ఉంది. ఇక్కడ ఒక దీప స్తంభం కూడా ఉంది. కార్తీక మాసంలో ఇక్కడ స్తంభంపై దీపం వెలిగించడం అనేది శతాబ్దాలుగా ఉన్న ఆచారం.
14వ శతాబ్దంలో మదురై సుల్తాన్ పాలనలో ఈ కొండ మీద దేవాలయం పాక్షికంగా ధ్వంసం చేశారు. 1377లో సుల్తాన్ సికిందర్ షా ఈ కొండ మీదే మరణించాడు. విజయనగర రాజులు వచ్చి ఈ దేవాలయాన్ని పునరుద్ధరించారు. 17వ శతాబ్దంలో కొందరు స్థానిక ముస్లింలు కొండ మీద పునరుద్ధరించిన హిందూ దేవాలయ సముదాయంలో కొంత భాగం ఆక్రమించి దానిని సికిందర్ షా దర్గా గా మార్చారు. తర్వాత కాలంలో ఇది ముస్లిం తీర్థక్షేత్రంగా మారింది.
హిందూ దేవాలయం ఆక్రమించి కట్టినట్లు రుజువుగా పాండ్య రాజుల శిల్పకళ ఉన్న రాతి స్తంభాలు, దర్గా ప్రవేశ ద్వారం మీద మకర తోరణం, దర్గా వెనుక ఉన్న గోడపైన మురుగన్ శిల్పం వంటివి ఇప్పటికి కనిపిస్తాయి. ఈ స్థల వివాదం పై 1923 లో మదురై స్థానిక సబార్డినెట్ జడ్జి తీర్పు ఇస్తూ ఈ గిరి మొత్తం సుమారు 170 ఎకరాలు అంతా మురుగన్ ఆలయ ఆస్తి అని స్పష్టం
చేసింది.
కేవలం నెల్లి తోపు అంటే సమాధులు ఉన్న చోటు, దర్గాలో ప్రవేశించడానికి ఉన్న రాతి మెట్లు, దర్గా ఉన్న చిన్న ప్రాంతం పై ముస్లిం లకు హక్కుఇచ్చి, దర్గా వారు ఇక్కడ కొత్తగా తవ్వకాలు చేయడం, కొత్త కట్టడాలు సమాధులు నిర్మించడం నిషేధించింది. ఈ సబ్ జడ్జి తీర్పును 1926లో మద్రాస్ హైకోర్టు , ఆపై 1931లో లాండన్లోని ప్రివి కౌన్సిల్ కూడా దృవీకరించాయి.
కొండ మీద హిందూ దేవాలయ ప్రాంతంలో జంతు బలులు ఇస్తున్నారని హిందూ సంస్థలు కోర్టుకు వెళ్లడంతో 2025లో ఫిబ్రవరి లో మద్రాస్ హైకోర్టు దర్గాలో జంతు బలులు నిషేధించింది. కార్తీక దీపం ఉత్సవంలో (కార్తీగై మాసం, నవంబర్-డిసెంబర్) గిరి శిఖరంపై ‘దీపతూణ్’ (పాత రాయి స్తంభం)లో దీపం వెలిగించడం అనేది తమిళ శైవ-మురుగన్ సంప్రదాయాల్లో పురాతనమైనది. సంగం సాహిత్యం (అగ నానూరు, 1800 సంవత్సరాల క్రితం)లో ప్రస్తావించారు.
గిరి శిఖరాలపై దీపాలు వెలిగించడం తమిళ సంస్కృతిలో ‘కుండ్రిన్ మీద ఇట్ట విలక్కాయి పోల’ అనే సామెతలో ప్రతిబింబిస్తుంది. ఈ స్తంభం 6వ శతాబ్దం సిఈ నుండి ఉంది (పాండ్య కాలం). సాంప్రదాయం అప్పటి నుండి కొనసాగుతుంది. రెండవ ప్రపంచ యుద్ధం (1940లు)లో బ్రిటిష్ నిషేధం వల్ల ఆగిపోయి, 1920ల నుండి కింది భాగంలో (ఉచ్చిపిళ్లయార్ ఆలయం వద్ద) కొనసాగుతుంది. ఈ స్తంభం దర్గా సమీపంలో ఉన్నందున, 1912లో కోర్టు పరిమితులు విధించింది.
ఈ ప్రాచీన దీప స్తంభం మీద ఇకపై ప్రతీ సంవత్సరం దీపం వెలిగించుకుందికి అనుమతి కోరిన హిందు మున్నాని నేత రామరవికుమార్, మరో 10 మంది భక్తులకు 2025 డిసెంబర్ 1న మద్రాస్ హైకోర్టు (జస్టిస్ జి.ఆర్. స్వామినాథన్) దీపతూణ్‌లో వెలిగించడానికి అనుమతి ఇచ్చింది. ఇది ‘తమిళ సంప్రదాయం’ అని, దర్గా హక్కులను ప్రభావితం చేయదని పేర్కొంది.
ఏ ప్రాంతం ఎవరిది అని 1923లొనే తీర్పు ఇచ్చారు. దర్గాకు చెందని స్థలం, దేవాలయానికి చెందిన స్థలంలో ఉన్న దీప స్తంభం మీద దీపం వెలిగించుకుంటే ఇబ్బంది ఏమిటీ? అని ప్రశ్నిస్తూ డిసెంబర్ 3వ తేదీన సిఐఎస్ఎఫ్ రక్షణతో దీప స్తంభం మీద దీపం వెలిగించాలని ఆదేశించింది. కానీ మదురై జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా అపీల్ చేశారు.
ఆ అపీల్ ఇంకా విచారణకు రాక ముందే దేవాదాయ శాఖ అధికారులు, పోలీసులు కొండ మీద ఉన్న దీపస్తంభం మీద దీపం వెలిగించడానికి ప్రయత్నించిన భక్తులను అడ్డుకున్నారు. జిల్లా కలెక్టర్ సెక్షన్ 144 క్రింద నిషేదాజ్ఞలు విధించారు. తమకు హై కోర్టు అనుమతి ఇచ్చింది అని చెప్పినా కూడా వినకుండా దౌర్జన్యంగా భక్తులను కొండపై నుండి దింపి కింది భాగంలో మాత్రమే దీపం వెలిగించడానికి ఒప్పుకున్నారు.
ఇది కోర్టు ఉత్తర్వులను ఉల్లఘించడమే అని రామా రవికుమార్ బృందం ఒక కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పిటిషన్ వేశారు. హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలు అమలు కాకుండా కలెక్టర్, పోలీసులకు సహకరించిన దేవాలయం ఈవో తన తప్పు కప్పించుకుందికి హైకోర్టు ఆదేశాలు అమలు చేయలేదని అధికారికంగా మరో కంటెంప్ట్ పిటిషన్ వేశారు.
డిసెంబర్ 4వ తేదీన మద్రాస్ హై కోర్ట్ అన్ని విచారించి సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పు ధృవీకరిస్తూ దీప్ తూన్ మీద దీపం వెలిగించడం అనేది ప్రాచీన సాంప్రదయం అని, ఇది ఎవరి హక్కులకు భంగం కలిగించదని, రామ రవికుమార్, మరో 10 మంది భక్తులకు దీపం వెలిగించుకుందికి అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వ అప్పీల్ ని కొట్టేసింది.
హై కోర్ట్ ఈ ఉత్తర్వులపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో ‘అర్జంట్ లిస్టింగ్’ కోరింది. ప్రత్యేక మెన్షనింగ్ అవసరం లేదని, నెంబరింగ్ చేసి లిస్ట్ చేయండి, అర్జెంట్ గా లిస్ట్ చేయాలా వద్దా అనేది నిర్ణయిస్తాం అని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు.
ఈ విషయాన్ని బిజెపి రాజకీయం చేస్తోంది అని డీఎంకే విమర్శిస్తోంది. హైకోర్టు ఉత్తర్వులు మీద దర్గా కమిటీ మౌనంగా ఉన్నప్పుడు తమిళనాడు ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకంగా హైకోర్ట్ తీర్పు అమలు కాకుండా ఎందుకు చూస్తోంది? అంటూ బీజేపీ తిరిగి ప్రశ్నిస్తోంది.
ఎన్ని దేవాలయాలు, దేవాలయాలు ఆస్తులు కబ్జా చేసినా, హిందువులు నోరు మూసుకుని మౌనంగా ఉంటేనే మతసామరస్యం వెళ్లి విరుస్తుంది. కానీ, ఇటువంటి వాటిలో వేటి మీద అయినా హిందువులు తమ హక్కులను తిరిగి కోరితే వారిని మతవివాదాలు రెచ్చగొట్టే వారీగా చిత్రీకరిస్తారు సెక్యులర్ వాదులు. అంతే కానీ, హిందువులకు ఆ దేవాలయం, ఆ గిరి పవిత్రమైనవి,
మీరు అక్కడ అక్రమంగా దేవాలయం ఆక్రమించి ఒక చచ్చిన రాజుకి సమాధి అక్రమంగా కట్టారు, అది మీకు ఏమీ పవిత్రమైన మతపరమైన కట్టడం కాదు. కాబట్టి, ఆ దర్గా తీసి ఆ గిరి మీద పూర్తి హక్కులు హిందువులకు ఇచ్చి మతసామరస్యం కాపాడండి అని ఏ సెక్యులర్ జీవి ముస్లింలకు చెప్పే ప్రయత్నం చేయడం లేదు.
More Stories
స్థానిక నేతలతో ‘లోకల్’ సమ్మిట్‌గా మారిన `గ్లోబల్ సమ్మిట్’
బెంగాల్లో 6.5 లక్షల మందితో భగవద్గీత పారాయణం
$1 ట్రిలియన్ డాలర్లు దాటిన చైనా వాణిజ్య మిగులు