సీనియర్ ఐఎఎస్ అధికారిణి ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. కేడర్ కేటాయింపుపై గతంలో క్యాట్ ఇచ్చిన ఆదేశాలపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ స్టే విధించింది. ఈ పరిణామంతో ఆమ్రపాలికి తాత్కాలికంగా చుక్కెదురైంది. గత ఏడాది అక్టోబర్‌లో కేంద్రంలోని డివొపిటి ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆమ్రపాలి డివొపిటి ఆదేశాలను సవాల్ చేస్తూ క్యాట్‌లో పిటిషన్ దాఖలు చేయగా క్యాట్ ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. క్యాట్ ఆదేశాల మేరకు ఐఎఎస్ అధికారి హరికిరణ్‌తో స్వాపింగ్ పద్ధతి ద్వారా ఆమ్రపాలిని తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు. అయితే క్యాట్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ డివొపిటి తెలంగాణ హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లింది.
ఐఎఎస్ కేటాయింపు నిబంధనల ప్రకారం ఆమ్రపాలికి స్వాపింగ్ వర్తించదని డివొపిటి ప్రధానంగా వాదించింది. ఐఎఎస్ హరికిరణ్ రిజర్వ్ కేటగిరీకి చెందిన అధికారి కాబట్టి ఓపెన్ కేటగిరీకి చెందిన ఆమ్రపాలికి ఆయనతో స్వాపింగ్ చేయడం నిబంధనలకు విరుద్ధమని డివొపిటి హైకోర్టు దృష్టికి తీసుకువచ్చింది. డివొపిటి అప్పీల్‌ను పరిశీలించిన హైకోర్టు క్యాట్ ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
తదుపరి విచారణను హైకోర్టు 6 వారాలకు వాయిదా వేసింది. అప్పటివరకు క్యాట్ ఉత్తర్వులు అమలులో ఉండవని, వాటిపై స్టే కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా కౌంటర్ దాఖలు చేయాలని ఆమ్రపాలి తరఫు న్యాయవాదికి కూడా హైకోర్టు ఆదేశించింది.

More Stories
స్థానిక నేతలతో ‘లోకల్’ సమ్మిట్‌గా మారిన `గ్లోబల్ సమ్మిట్’
`మహాధర్నా’ రాబోయే రోజుల్లో `మహా ధర్మయుద్ధ్’గా మారుతుంది
బీఆర్ఎస్ లో కేంద్రీకృత అవినీతి, ఇప్పుడు వికేంద్రీకృత అవినీతి