మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ఆ రాష్ట్రంలో జరిగిన మతపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో ఆదివారం రోజున భారీగా హిందువులు ఒక్కచోట చేరి మెగా భగవద్గీత పారాయణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి 5 లక్షల మంది వస్తారని అంచనా వేయగా అంతకుమించి.. ఏకంగా 6.5 లక్షల మంది హిందువులు హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. సనాతన సంస్కృతి సంసద్ ఆధ్వర్యంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగింది. కోల్‌కతాలో గీతా పారాయణ కార్యక్రమానికి ఒక రోజు ముందు, అంటే శనివారం రోజున ముర్షిదాబాద్‌లోని రెజినగర్‌లో జాతీయ రహదారి 12 పక్కన బాబ్రీ తరహా మసీదు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.
ఈ మసీదు నిర్మాణం చేస్తానని ప్రకటించిన టీఎంసీ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్‌ను మమతా బెనర్జీ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని హుమాయున్ కబీర్ మసీదు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్ పార్టీ మత రాజకీయాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై హుమాయున్ కబీర్‌ను సస్పెండ్ చేశారు.
1992 డిసెంబర్ 6వ తేదీన ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేసిన వార్షికోత్సవం రోజునే ఈ మసీదు నిర్మాణానికి శంకుస్థాపన జరగడంతో ఇది తీవ్ర రాజకీయ విమర్శలకు దారితీసింది. ఈ కార్యక్రమానికి సౌదీ అరేబియా నుంచి మత పెద్దలు హాజరయ్యారు. అంతేకాకుండా 40 వేల మందికి పైగా ప్రజలకు బిర్యానీతో విందు ఏర్పాటు చేశారు.
ముర్షిదాబాద్ సంఘటన జరిగిన వెంటనే కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన ఈ గీతా పారాయణం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ‘పంచ లఖోం కొంఠే గీతా పాఠ్’ (ఐదు లక్షల కంఠాలతో గీతా పారాయణం) అనే పేరుతో పశ్చిమ బెంగాల్ నలుమూలల నుంచి.. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు హాజరయ్యారు. నిర్వాహకుల అంచనా కంటే ఎక్కువ మంది దాదాపు 6.5 లక్షల మంది పాల్గొన్నారు.
పశ్చిమ బెంగాల్ గవర్నర్ డాక్టర్ సి.వి. ఆనంద బోస్ కార్య్రక్రమంలో పాల్గొంటూ శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక, తాత్విక, సాంస్కృతిక రంగాలలో అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉందని చెప్పారు. దీనిని “దేవుని పాట”గా అభివర్ణిస్తూ, ఈ గ్రంథం “జీవితంలోని ప్రతి అంశాన్ని విస్తరించి” నిస్వార్థ చర్య, ఉద్దేశ్యపూర్వక జీవనానికి మార్గదర్శకత్వాన్ని అందిస్తుందని ఆయన తెలిపారు.
సమాజం, దేశం పట్ల తమ విధులను నిర్వర్తించడంలో గీత పౌరులకు స్ఫూర్తినిస్తూనే ఉందని ఆయన పేర్కొన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత కార్తీక్ మహారాజ్ (ప్రదీప్తానంద మహారాజ్) భగవద్గీత హిందువులందరినీ ఏకం చేసే అత్యంత పవిత్రమైన గ్రంథమని, బెంగాల్‌ను రక్షించడానికి సన్యాసుల ఆశీస్సులు అవసరమని తెలిపారు. ఇది హిందువుల సామూహిక చైతన్యం ఫలితమేనని బీజేపీ నాయకుడు దిలీప్ ఘోష్ వెల్లడించారు. భగవద్గీత ప్రతి ఒక్కరినీ ఏకం చేయడానికి ఉత్తమ మాధ్యమమని పేర్కొన్నారు. బెంగాల్‌కు గీతా పారాయణం అవసరమని, ఎందుకంటే హిందుత్వానికి ప్రమాదం ఉందని ఆయన చెప్పారు.
కేంద్ర మంత్రి సుకాంత మజుందార్, బెంగాల్ బిజెపి అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య, మాజీ ఎంపి లాకెట్ ఛటర్జీ, ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్, అనేక మంది సీనియర్ బిజెపి నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సరిగ్గా రెండేళ్ల క్రితం, లోక్‌సభ ఎన్నికలకు ముందు ‘లక్ష స్వరాలతో’ జరిగిన గీతా పఠన కార్యక్రమం రాజకీయ ఘర్షణకు దారితీసింది.

More Stories
స్థానిక నేతలతో ‘లోకల్’ సమ్మిట్‌గా మారిన `గ్లోబల్ సమ్మిట్’
సిద్దూ భార్య కౌర్ కాంగ్రెస్ నుండి సస్పెండ్
తిరుపరంకుండ్రం ఆలయంలో దీపోత్సవ్ పై స్టాలిన్ కన్నెర్ర!