స్థానిక నేతలతో ‘లోకల్‌’ సమ్మిట్‌గా మారిన `గ్లోబల్ సమ్మిట్’

స్థానిక నేతలతో ‘లోకల్‌’ సమ్మిట్‌గా మారిన `గ్లోబల్ సమ్మిట్’
‘అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా 150మంది కార్పొరేట్‌ దిగ్గజాలు ఇందులో పాలుపంచుకుంటారు. అనేక రాష్ర్టాల ముఖ్యమంత్రులు, దేశ, విదేశీ అతిథులు వస్తారు. తెలంగాణకు రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు తరలివస్తాయి’.. అంటూ ‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌’ గురించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన ఆర్భాటం ఇంతా అంతా కాదు.  దావోస్‌ను మించిన ప్రపంచ ఆర్థిక సదస్సుగా తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌ నిలుస్తుందని మూడు నెలలుగా ఊదరగొట్టారు. 

సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు, కేంద్ర మంత్రులను, కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను ఆహ్వానించారు. వివిధ రాష్ర్టాల సీఎంలను ఆహ్వానించేందుకు మంత్రులను స్వయంగా పంపారు. వారంతా సమ్మిట్‌కు హాజరవుతారని, వారి ఆగమనం రాష్ట్ర అభివృద్ధికి దిక్సూచి అవుతుందని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటనలు ఇచ్చింది. 

తీరా మీర్‌ఖాన్‌పేట్‌లో ప్రారంభమైన గ్లోబల్‌ సమ్మిట్‌ తుస్సుమనిపించింది. ముఖ్యమంత్రి చెప్పినట్టు ప్రముఖ దిగ్గజాలు ఎవరూ సదస్సులో కనిపించలేదు. కొద్దోగొప్పో పేరున్న అంతర్జాతీయ కార్పొరేట్‌ వ్యాపారవేత్తలు ఎవరూ అటువైపు చూడలేదు. సినీనటుడు నాగార్జున మాత్రమే వేదిక మీద ప్రముఖంగా కనిపించారు. మొత్తంగా గ్లోబల్‌ సమ్మిట్‌ కాస్తా లోకల్‌ సమ్మిట్‌గా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

తమ పోటీ ఏపీతోనో, బెంగళూరుతోనో కాదనీ, అభివృద్ధి చెందిన జపాన్‌, కొరియా లాంటి దేశాలతో పోటీపడతామని సీఎం రేవంత్‌రెడ్డి పదే పదే చెప్పుకొచ్చారు. ఈ సమ్మిట్‌ తర్వాత తెలంగాణ రాష్ర్టానికి పెట్టుబడుల వరద పారుతుందని ఆర్భాటం చేశారు. విజన్‌ డాక్యుమెంట్‌-2047 ద్వారా తెలంగాణను శక్తివంతమైన రాష్ట్రంగా మలుస్తామని ప్రకటనలు ఇచ్చారు.

గ్లోబల్‌ సమ్మిట్‌ కార్యక్రమంలో తొలిరోజు ఏ ఒక్క రంగానికి చెందిన ప్రముఖులు కూడా కనిపించలేదు. 44 దేశాల నుంచి, ప్రముఖ కంపెనీల నుంచి 3వేల మంది ప్రతినిధులు హాజరవుతారని చెప్పుకొచ్చారు. చివరికి స్థానికంగా తెలుగు సినీ పరిశ్రమ నుంచి నటుడు నాగార్జున, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అపోలో హాస్పిటల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్‌పర్సన్‌ శోభన కామినేని, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత కైలాష్‌ సత్యార్థి మాత్రమే కనిపించారు. 
 
వీరితో పాటు అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కరణ్‌ అదానీ రాగా, విదేశాల నుంచి ట్రంప్‌ మీడియా అండ్‌ టెక్నాలజీ గ్రూప్‌ సీఈవో ఎరిక్‌ స్వైడర్‌ హాజరయ్యారు. అయినా తొలిరోజు రూ.2 లక్షల కోట్లకు పైగా ఎంవోయూలు కుదుర్చుకున్నట్టు పత్రికా ప్రకటనలు విడుదల చేశారు. అందులో అన్నీ చిన్నా, చితక స్థానిక కంపెనీలతో పాటు, ఊరు పేరు లేని సూట్‌కేసు కంపెనీలతో ఒప్పందాలు జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
సదస్సుకు రెండు రోజుల ముందే స్పందన అంతంతమాత్రమే అని గ్రహించిన మంత్రి శ్రీధర్ బాబు స్వరం మార్చారు. సాధారణంగా ఎవరైనా ఇలాంటి సదస్సు జరుగుతోందంటే అది పెట్టుబడులను ఆకర్షించేందుకే అని భావిస్తారు. కానీ అసలు ఈ సదస్సు పెట్టుబడుల కోసం కాదని శ్రీధర్‌బాబు ప్రకటించారు. ఈ సమ్మిట్‌ తెలంగాణ-2047 విజన్‌ డాక్యుమెంట్‌ను విడుదల చెయ్యడానికే అని చెప్పడం గమనార్హం.
గ్లోబల్‌ సమ్మిట్‌కు కర్ణాటక రాష్ట్రం నుంచి డీకే శివకుమార్‌ మాత్రమే హాజరయ్యారు. ఏఐసీసీ నుంచి నేతలు ఎవరూ హాజరుకాలేదు. కనీసం కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు గానీ ఇండియా కూటమి నేతలు గానీ రాకపోవటం గమనార్హం. పార్లమెంట్‌లో వందేమాతరం, ఎస్‌ఐఆర్‌ తదితర అంశాల మీద చర్చ ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్‌ నేతలు రాలేకపోయారని చెప్తున్నారు. అయితే ఇదే సమయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమ్మిట్‌లో పాల్గొనటం గమనార్హం.
 
ఇప్పటికే హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సును నిర్వహణకు రూ.వందల కోట్లు వెచ్చించి నిర్మించిన అద్భుతమైన వేదికలు,. హైటెక్స్‌తోపాటు హెచ్‌ఐసీసీ పరిధిలో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు ఉండగా సరిగా రహదారుల వ్యవస్థలేని ఖాళీ భూముల్లో అంతర్జాతీయ సదస్సుని ఏర్పాటు చేయడం రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసమే అన్న విమర్శలు చెలరేగుతున్నాయి. ఖాళీ భూముల్లో తాత్కాలిక డేరాలు వేసి ఫోర్త్‌ సిటీలో చేపట్టిన గ్లోబల్‌ సమ్మిట్‌ అంతర్జాతీయ పెట్టుబడుల కోసమా? ఫోర్త్‌ సిటీ వైపు రియల్‌ ఎస్టేట్‌ ప్రమోషన్‌ కోసమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.