ఇండిగో సంక్షోభం ఇంకా కొనసాగుతుండగా ఎయిర్‌లైన్స్‌కు చెందిన శీతాకాలం షెడ్యూల్‌లో ఐదుశాతం కోత విధిస్తున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకటించింది. ప్రస్తుతం ఇండిగో రోజుకు సుమారుగా 2,200 విమానాలను నడుపుతున్నది. ప్రస్తుతం విమానాల సంఖ్య 110 వరకు తగ్గనున్నది. విమానాల షెడ్యూల్‌లో 5శాతం కోత విధించిన విషయాన్ని ఎయిర్‌లైన్స్‌కు డీజీసీఏ సమాచారం అందించింది. తగ్గించే విమానాల జాబితాను సైతం సిద్ధం చేస్తున్నారు.
నవంబర్ శీతాకాల షెడ్యూల్ ప్రకారం వారానికి 15,014 డిపాశ్చర్ విమానాలు, మొత్తం 64,364 విమానాలకు విమానాయన సంస్థ ఆమోదం పొందినట్లుగా డీజీసీఏ ఇండిగోకు జారీ చేసిన అధికారిక నోటీసుల్లో పేర్కొంది. అయితే, ఆపరేషనల్ డేటా ప్రకారం ఇండిగో 59,438 విమానాలను మాత్రమే నడిపించింది. నవంబర్‌లో ఎయిర్‌లైన్స్ 951 విమానాలను రద్దు చేసింది.
నోటీస్ ప్రకారం ఈ ఏడాది వేసవికాలం షెడ్యూల్‌తో పోలిస్తే శీతాకాల షెడ్యూల్‌లో 6 శాతం పెంచుకునేందుకు అనుమతి పొందింది. దాంతో 403 విమానాలను ఉపయోగించుకునే వీలు కల్పించింది. ఇండిగో అక్టోబర్ 339 విమానాలను, నవంబర్ 344 విమానాలను మాత్రమే నడపగలిగింది. గతేడాది శీతాకాలం షెడ్యూల్‌తో పోలిస్తే ఎయిర్‌లైన్స్ తన డిపాశ్చర్స్‌ను 9.66శాతం, ఈ ఏడాది వేసవి షెడ్యూల్‌తో పోలిస్తే 6.05శాతం పెంచిందని, కానీ, షెడ్యూల్‌ను సమర్థవంతంగా నిర్వహించలేకపోయిందని పేర్కొంది.
కంపెనీ షెడ్యూల్‌ను 5శాతం తగ్గించుకోవాలని, ముఖ్యంగా అధిక డిమాండ్, ఫ్రీక్వెన్సీ ఉన్న విమానాలపై దృష్టి పెట్టాలని సూచించింది. ఏ రూట్‌లోనైనా ఒక్క విమానానికి సైతం అంతరాయం కలుగకూడదని డీజీసీఏ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇండిగో అంతరాయాల నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. విమానాశ్రయాల్లో ఉన్న ప్రయాణికులకు తక్షణ సదుపాయాలు కల్పించాలని, న్యాయపరమైన స్వతంత్ర విచారణ జరపాలని, భవిష్యత్తులో టికెట్ ధరలు హఠాత్తుగా పెరగకుండా వ్యవస్థను రూపొందించాలని పిటిషన్ కోరుతోంది.
విమానయాన మంత్రిత్వ శాఖ ఇప్పటికే 10 మంది అధికారులను వివిధ విమానాశ్రయాల్లో మోహరించింది. వచ్చే 2-3 రోజులు వారు అక్కడే ఉండి పరిస్థితులను పర్యవేక్షించనున్నారు. ప్రయాణికులపై ప్రభావం పడే ఏ లోపమైనా వెంటనే సరిదిద్దాలని మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. దేశంలో అతిపెద్ద ఎయిర్‌లైన్ ఎదుర్కొంటున్న ఈ సంక్షోభాన్ని తక్షణమే అరికట్టేందుకు కేంద్రం అత్యవసర చర్యలు ప్రారంభించింది.

More Stories
ఇండిగో శీతాకాల విమానాలను తగ్గించనున్న కేంద్రం
$1 ట్రిలియన్ డాలర్లు దాటిన చైనా వాణిజ్య మిగులు
ఇండిగో అంతర్గత సమస్యలతోనే ఈ సంక్షోభం