రాష్ట్రంలో మతమార్పిడిలపై విచారణ జరపాలి!

రాష్ట్రంలో మతమార్పిడిలపై విచారణ జరపాలి!
గత రెండు దశాబ్దాలుగా జరిగిన మత మార్పిడులపై కమిటీ వేసి విచారణ జరపాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. వైసిపిలో కీలక నేతగా సుదీర్ఘకాలం పనిచేసిన తర్వాత 2024 ఎన్నికలలో పార్టీ పరాజయం అనంతరం ఆ పార్టీ నుండి రాజీనామా చేసి, తన నిష్క్రమణకు ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరీయే కారణం అంటూ స్పష్టం చేయడం తెలిసిందే.
 
అప్పటి నుండి రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెబుతూ, తాను కొత్తగా మరో పార్టీ ఏర్పాటు చేసే ఆలోచన కూడా లేదని స్పష్టం చేసిన ఆయన తాజాగా మతమార్పిడిలపై సోషల్ మీడియాలో ప్రస్తావించడం ఆసక్తి కలిగిస్తున్నది. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఆయన కోటరీ గురించే ఈ వాఖ్యలు చేశారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
 
హిందూ మతంపై కుట్రలు సహించేది లేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. డబ్బు ఆశ చూపి, మతం మార్చాలని ప్రయత్నిస్తే మాత్రం అటువంటి వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పి గుణపాఠం నేర్పిద్దామని ఆయన హెచ్చరించారు. దేశం కోసం ధర్మం కోసం హిందువుల్లో ఉన్న అన్ని సామాజిక వర్గాలు ఒక్కటవ్వాలని విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. అదే భారతదేశానికి రక్ష, శ్రీరామ రక్ష అని తెలిపారు.
 
వైసిపి నుంచి రాజీనామా చేసిన తరువాత కాకినాడ పోర్టు, లిక్కర్ కేసుల్లో సాయిరెడ్డి వెల్లడించిన అంశాలు సంచలనంగా మారాయి. ఇటీవల రాజకీయంగా తన భవిష్యత్ పైన ఆయన చేసిన విశ్లేషణ కొత్త చర్చకు కారణమైంది. కాగా ఇప్పుడు సాయిరెడ్డి గతంలో ఎన్నడూ లేని విధంగా హిందూ మతం ప్రస్తావన చేస్తూ ట్వీట్ చేయడం, ఇదే అంశం పైన ప్రభుత్వం ముందు తన డిమాండ్ ఉంచడం రాజకీయంగా కలకలం రేపుతోంది.
 
ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత 20 ఏళ్లుగా తనకు మంచి స్నేహితుడు అంటూ గత వారం ఆయన ఆసక్తికర వాఖ్య చేశారు. ఇవ్వన్నీ భవిష్యత్ రాజకీయ  ప్రణాళికలో భాగంగా వేస్తున్న అడుగులా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.