ఛత్తీస్‌గఢ్‌లో సోమవారం తెల్లవారుజామున రాయ్‌పూర్‌కు పశ్చిమాన 100 కి.మీ దూరంలో ఉన్న రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో మొత్తం 12 మంది మావోయిస్టులు సిపిఐ (మావోయిస్టు) సిద్ధాంతాన్ని త్యజించి, తమ ఆయుధాలతో లొంగిపోయారు. ఆయుధాలు విడిచిపెట్టిన వారిలో మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్ (ఎంఎంసి) జోన్‌కు చెందిన సీనియర్ మావోయిస్టు నాయకుడు, కేంద్ర కమిటీ సభ్యుడు రామ్‌ధేర్ మజ్జీ కూడా ఉన్నారు. అతని తలపై రూ. 3 కోట్ల బహుమతి ఉంది.
ఆయన దీర్ఘకాలంగా ఆయన ఎంఎంసీ జోన్‌లో ప్రభావవంతమైన పాత్ర పోషిస్తున్నారు. మిళింద్ తెల్టుంబే మరణం తర్వాత రాంధెర్ ఈ ప్రాంత నిర్వహణ, పార్టీ కార్యకలాపాల పర్యవేక్షణ బాధ్యతలను చేపట్టారు. అలాంటి నేత లొంగిపోవడం భద్రతా వ్యవస్థకు కీలక విజయంగా అధికారులు భావిస్తున్నారు. రాంధెర్ లొంగిపోవడంతో ఈ మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలు నక్సల్స్ ప్రభావం నుండి దాదాపు పూర్తిగా బయటపడుతున్నాయని సమాచారం.
నలుగురు డివిజనల్ కమిటీ సభ్యులు, అనేక మంది ఇతర కార్యకర్తలు కూడా లొంగిపోయారు. కేంద్ర కమిటీ సభ్యుని నేతృత్వంలోని ఈ సీనియర్ వ్యక్తుల లొంగిపోవడం నిషేధిత సిపిఐ (మావోయిస్ట్) ఎంఎంసి యూనిట్‌కు పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. 12 మందిలో ఆరుగురు మహిళలు.
మావోయిస్టులు ఏకే-47 రైఫిల్, ఇన్సాస్ అస్సాల్ట్ రైఫిల్, సెల్ఫ్-లోడింగ్ రైఫిల్ (ఎస్ఎల్ఆర్), 303 రైఫిల్, ఇతర ఆయుధాలను అందజేశారు. వారి పునరావాసం, సమాజంలో తిరిగి కలిసిపోవడానికి ఇప్పుడు అధికారిక చట్టపరమైన విధానాలు అనుసరిస్తారు. డిసెంబర్ 2023లో ఛత్తీస్‌గఢ్‌లో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి, రాష్ట్రంలో సుమారు 2,300 మంది మావోయిస్టులు లొంగిపోయారు.

More Stories
గోవా నైట్ క్లబ్లో ఘోర అగ్నిప్రమాదం.. 25 మంది మృతి
యునెస్కో వారసత్వ జాబితాలో దీపావళి త్వరలో!
పుతిన్ కు భారత్ వైవిధ్యం సూచించే బహుమతులు