థాయ్‌లాండ్‌-కంబోడియా సరిహద్దుల్లో మళ్లీ ఘర్షణలు

థాయ్‌లాండ్‌-కంబోడియా సరిహద్దుల్లో మళ్లీ ఘర్షణలు
థాయ్‌లాండ్‌- కంబోడియా సరిహద్దులో మరోసారి ఘర్షణలు భగ్గుమన్నాయి. ఉబోన్ రాట్చథాని ప్రావిన్స్‌లో థాయ్ దళాలపై కంబోడియా దళాలు కాల్పులు జరిపారు. దీంతో థాయ్‌ సైన్యం వైమానిక దాడులకు దిగింది. కంబోడియా పోస్టులు, ఆయుధ డిపోలే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించారు. ఈ క్రమంలో సరిహద్దుల్లో మరోసారి ఘర్షణలు చోటు చేసుకున్నాయి. 
ఈ ఘర్షణల్లో ఓ థాయ్‌ సైనికుడు మృతి చెందినట్లు థాయ్‌ సైన్యం వెల్లడించింది. ఈ ఘర్షణలకు సంబంధించి ఇరుపక్షాలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. కంబోడియా సైన్యం తొలుత దాడులను మొదలు పెట్టినట్లు థాయ్‌ అధికారులు చెబుతుండగా.. ఈ వాదనను కంబోడియా ఖండించింది. థాయ్‌ దళాలే తొలుత కాల్పులు జరిపినట్లు కంబోడియా రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది.

మొదట కంబోడియా దళాలు కాల్పులు జరిపినట్లు థాయ్‌లాండ్‌ సైనిక ప్రతినిధి మేజర్‌ జనరల్‌ వింథాయ్‌ సువారే తెలిపారు. సోమవారం తెల్లవారుజామున ఈ ఘర్షణ మొదలైనట్లు పేర్కొన్నారు. తమ దళాలకు చెందిన ఒక సైనికుడు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు గాయపడినట్లు చెప్పారు. అలాగే ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను తరలిస్తున్నారమని అన్నారు. కంబోడియా కాల్పులు జరిపినందుకే, పోస్టులు, ఆయుధ డిపోలే లక్ష్యంగా థాయ్ సైన్యం వైమానిక దాడులకు దిగిందని పేర్కొన్నారు.

మరోవైపు ఈ వాదనను కంబోడియా రక్షణ మంత్రిత్వశాఖ తోసిపుచ్చింది. థాయ్ సైన్యమే మొదట కంబోడియా దళాలపై దాడి చేసిందని తెలిపింది. తొలుత ప్రహ్‌ విహియార్‌ ప్రావిన్స్‌లో కాల్పులు జరిపినట్లు పేర్కొంది. శాంతి, స్థిరత్వానికి ముప్పు కలిగించే అన్ని కార్యకలాపాలను థాయ్​లాండ్ వెంటనే ఆపాలని కోరింది. వెంటనే కవ్వింపు చర్యలు ఆపివేసి సరిహద్దుల్లో శాంతి స్థిరత్వానికి కట్టుబడి ఉందామని పిలుపునిచ్చింది.

కాగా, ఈ ఏడాది జులైలో థాయ్‌లాండ్‌, కంబోడియా మధ్య ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సరిహద్దుల పొడవున అనేక ప్రాంతాల్లో ఇరుదేశాలకు చెందిన సైనికుల మధ్య భీకర ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణలలో సైనికులతోపాటూ పౌరులు కూడా మరణించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో ట్రంప్‌ రంగంలోకి దిగారు. 
కౌలాలంపుర్‌లో ఇరు దేశాల మధ్య సంధి కుదిర్చారు. ట్రంప్‌ సమక్షంలో థాయ్‌లాండ్‌-కంబోడియా దేశాలు శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీంతో సరిహద్దుల్లో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. అయితే, ఐదు నెలల్లోనే మళ్లీ అక్కడ ఘర్షణలు చెలరేగడం ఆందోళన కలిగిస్తోంది.